అసలు రూపం వేరే !

Sharing is Caring...

Govardhan Gande …………………………………….

రాత్రికి రాత్రే రాజు కాగలడు! ముఖ్య మంత్రి, ప్రధాన మంత్రి కూడా కాగలడు! విమానాలు నడపగలడు! రైలును సైతం ఒంటి చేత్తో ఆపేయగలడు!కనుసైగతో దేశాన్ని ఒకవైపునకు మళ్లించగలడు! విప్లవాలను సృష్టించగలడు! ప్రభుత్వాలను కూల్చేయ గలడు! శాంతి దూతగా మారగలడు!

వసుధైక కుటుంబం అంటాడు! విశ్వ మానవుడిని అంటాడు! అంతా సమానులే అంటాడు! కులం కుళ్లును కడిగి పారేస్తానంటాడు!సంఘ సంస్కర్తగా మారిపొతాడు! బంటులా మారిపోతాడు! కోటీశ్వరుడూ కాగలడు! ఆస్తిని అంతా వదిలేసి నిరుపేదగా మారిపోతూ ఉంటాడు!simple living high thoughts అని ఓ పోజు పెడతాడు!

వంద మంది సాయుధ రౌడీలను ఎదుర్కోగలడు! చేతిలో ఉన్న ఆయుధాన్ని సైతం వదిలేసి మరీనూ.వారందరినీ చావగొట్టగలడు! వారందరి తోలు కూడా ఒలిచేయగలడు! బట్టలూడదీసి కొట్టగలడు! తన్ని తరిమేయగలడు! చిత్తు చేయగలడు! ఒంటి చేత్తో యుద్దాన్ని సైతం జయించి తన దేశాన్ని గెలిపించనూగలడు! సినిమా చూసిన మన అమాయక యువత ఇదంతా నిజమే కాబోలు అనుకొని భ్రమలో వీరికి వీరభిమానులుగా మారిపోతూ ఉంటారు!

ఫ్లెక్సీలు కడతారు. రక్త దానాలు చేస్తారు. మొదటి రోజు మొదటి షో చూసేందుకు పోటీలు పడతారు.ఇంట్లో పీడించి,అప్పు చేసి ఆ సినిమా రాజాన్ని చూసి తరించిపోతూ ఉంటారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు.స్నేహితులకు తమ డబ్బుతో చూపిస్తుంటారు.

తమ హీరో గురించి గొప్పలు చెబుతుంటారు.ఆ హీరో గారిని పల్లెత్తు మాట అననివ్వరు. ఆయన గారిపై ఈగను సైతం వాలనివ్వరు. పొరపాటున ఎవరైనా ఆ “తార” పై నోరు జారితే ఇక అంతే సంగతులు. వాడి పని అయిపోయినట్లే.సినిమా ఎపుడెపుడు విడుదలవుతుందోనని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. ఆరాటపడతారు.టికెట్టు వేటలో జరిగే తొక్కిసలాటలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటూ ఉంటారు వెర్రి అభిమానులు.

తెర వెనక……… ఇదంతా నటనే కదా. మేమూ మీ లాంటి వారమే అనే మాట వీరు ఎక్కడా చెప్పుకోరు. తాము అంతటి వారమేననే పోజు కొడతారు. తాము సినిమాల్లో చెప్పే నీతి వచనాలను ఒక్కరు పాటించరు. అందరం ఒకటే అంటారు. సమానం అంటారు. కలసి ఉంటాం అంటారు. ఆ మాటలను ఆచరణలో అమలు చేయరు. అదే కదా ఇక్కడ సమస్య.

తెర వెనుక అంతా ఉత్తుత్తిదిదే… అంతా తాలు సరుకే. అందరూ మామూలు మనుషులే. సాధారణ మనుషులకు ఉండే అతి సహజమైన బలహీనతలే వీరికి ఉన్నాయి.ఉంటాయి. నిరూపితమయ్యాయి కూడా… మొన్నటి “MAA” ఎన్నికల బాగోతం చూసాం కదా. కుళ్లు అంతా బయటపడి పోయింది కదా. కడుపుల్లో ఉన్నదంతా కక్కేశారు కదా.తెరపై చేసేదంతా నటనేనని తేలిపోయింది కదా. అంతా బయట పడిపోయింది కదా. ఇదండీ మన తెలుగు సినిమా తెర వెనుక బాగోతం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!