తాంత్రిక కేంద్రాలుగా యోగినీ ఆలయాలు !

Sharing is Caring...

Yogini Temples ………….

చౌసత్ యోగిని ఆలయం..ఈ ఆలయం గురించి చాలామంది విని ఉండరు. అరుదైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం మధ్యప్రదేశ్ లో మోరేనా జిల్లా లోని మితావలి గ్రామం దగ్గర చిన్నకొండపై ఉంది.

మామూలుగా హిందూ దేవాలయాల నిర్మాణం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. కానీ ఈ యోగిని ఆలయం మాత్రం వృత్తాకారంలో ఉంటుంది.ఇలాంటి వృత్తాకార దేవాలయాలు చాలా అరుదు. ఇలాంటివే దేశంలో మరో మూడు దేవాలయాలున్నాయి.

హీరాపూర్, ఒడిశా… ఇది భారతదేశంలోని పురాతన చౌసత్ యోగిని దేవాలయాలలో ఒకటి, 9వ శతాబ్దంలో భౌమ వంశానికి చెందిన రాణి హీరాదేవిచే నిర్మించబడిందని నమ్ముతారు.బోలంగీర్, ఒడిశా …. హీరాపూర్ తర్వాత ఇది రెండవ ప్రసిద్ధ ఒడిశా యోగిని దేవాలయం. 

భేదఘాట్‌లోని (Bhedaghat) చౌసత్ యోగిని దేవాలయం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు దగ్గరలో ఉంది, దీనిని కలాచురి రాజవంశం 10వ శతాబ్దంలో నిర్మించింది. ఈ వృత్తాకార ఆలయంలో 81 మందిర మందిరాలు ఉన్నాయి. సాధారణంగా కనిపించే 64 మంది యోగినిల కంటే ఇవి ఎక్కువ. దీనిని గోలకీ మఠం అని కూడా పిలుస్తారు. యోగినిల ఆరాధన ఇక్కడ జరుగుతుంది.

ఖజురహోలో యోగిని దేవాలయం మామూలుగానే ఉంటుంది.ఇక్కడి చౌసత్ యోగిని ఆలయాన్ని 9వ శతాబ్దం చివరలో చందేలా రాజవంశం నిర్మించింది.

ఈ మితావలి యోగిని ఆలయ సముదాయంలో 64 యోగినీ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పురాతన శివాలయం కూడా వుంది. ఒక శాసనం ప్రకారం ఈ యోగిని ఆలయాన్ని 9 వ శతాబ్దంలో బెంగాల్ పాల వంశానికి చెందిన దేవపాలరాజు నిర్మించారు.

పూర్వకాలంలో ఇక్కడ మంత్ర,తంత్ర సాధకులు పూజలు చేసేవారని అంటారు. తాంత్రిక శక్తుల కోసం ఈ యోగినీలను ఆరాధించేవారట. అతీంద్రీయ శక్తుల కోసం యోగిని దేవతలను పూజించే ఆచారం 7 శతాబ్దం నుంచే ఉందని అంటారు.

యోగిని ఆలయాలలో ప్రధాన దేవత ఒకరిద్దరు ఉండరు, కానీ 64 మంది యోగినిలనే దేవతలుగా భావించి పూజిస్తారు. ఈ యోగినిలు మహాదేవి (దుర్గాదేవి) అవతారాలు, శక్తి స్వరూపాలుగా భావిస్తారు. అయితే కొన్ని ఆలయాలలో ఈ సంఖ్య మారవచ్చు.యోగిని ఆలయాలు ముఖ్యంగా శక్తి ఆరాధనకు సంబంధించినవి, ఇక్కడ తాంత్రిక ఆచరణలు చేస్తారు.  

చౌసత్ యోగిని దేవాలయానికి ఇప్పటికి మంత్ర.. తంత్ర సాధకులు ఇక్కడికి వస్తుంటారట. యోగిని ఆరాధన ఒకప్పుడు దేశంలో ఎక్కువగా ఉండేది. తాంత్రిక కేంద్రంగా ఈ దేవాలయం ఉండేదని అంటారు.

ఈ చౌసత్ యోగిని దేవాలయం గ్వాలియర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టుపక్కల మరికొన్ని దేవాలయాలు… స్మారక కట్టడాలు ఉన్నాయి . వీటిని పురావస్తు సర్వే శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ పెద్దగా వసతులు ఏమీ లేవు. ఈ యోగిని దేవాలయమే ప్రస్తుత పార్లమెంట్ భవనం రూపకల్పనకు స్ఫూర్తినిచ్చిందని అంటారు. రెండింటి నిర్మాణ పోలికలు ఒకేలా ఉంటాయి.

ఇక జబల్‌పూర్‌ లోని చౌసత్ యోగిని దేవాలయం సిటీకి 5 కి.మీ దూరంలో ధూంధర్ జలపాతం..  భేదాఘాట్ ప్రాంతంలో నర్మదా నదికి సమీపంలో ఉంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో జరిగిన దాడుల వల్ల ఈ ఆలయం కొంతమేరకు పాడైపోయింది. ఇది మితావలి ఆలయం తరహాలోనే ఉంటుంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!