అనాయాస మరణం వరమేనా ?

Sharing is Caring...

కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు. కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం. కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు. ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి భాధ పడతాం. అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా రైల్లో  నిద్రపోతూ ఆ నిద్రలోనే లోనే చనిపోయేవారు కూడా ఉన్నారు.

ఇలా ఇహాన్ని వదిలి , అకస్మాత్తుగా దూరమైపోయేవారు ఎంతో మంది ఉంటారు. నిత్యం ఇలాంటి మరణాలు సంభవిస్తూనేఉంటాయి. కొన్ని మన దృష్టికి రావచ్చు. మరికొన్ని రాకపోవచ్చు. ఒక విధంగా చూస్తే ఇలాంటి అనాయాస మరణాలు మంచివేమో. ఆసుపత్రుల్లో చేరి ఇబ్బందులు పడుతూ కొడుకులు ,కోడళ్ళు ఏమనుకుంటున్నారో ?డబ్బులు ఖర్చుఅయిపోతున్నాయని మధనపడుతూ … సమయానికి సేవలు అందించే వారు లేక కష్టపడుతుంటారు. కొందరు ఆసుపత్రుల్లో చేరి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ, దారుణమైన శారీరక యాతన అనుభవిస్తూ చనిపోతుంటారు. రక్త సంబంధీకులు సేవలు చేయలేక ఇబ్బంది పడుతుంటారు.అది చూసి మంచాన ఉన్నవారు మరీ కృంగి పోతుంటారు. ఇలాంటి కేసులెన్నోఉన్నాయి.
కానీ అనాయస మరణం ఒక వరం.. అందరికి దొరకదు. అది దొరికిన వారు నిజంగా పుణ్యాత్ములే.
ఇక మృత్యు ముఖంలో ఉన్న రోగులు ప్రశాంతమైన అనాయాస మరణం కోసం జీవన వీలునామా రాసుకోవచ్చని పేర్కొంటూ సుప్రీం కోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును ఆ మధ్య  వెలువరించింది. వైద్యులు అప్పటిదాకా రోగికి అందించిన జీవనాధార వైద్య చికిత్సను ఉపసంహరించుకునే అవకాశాన్ని జీవన వీలునామా అందిస్తుంది. జీవితేచ్ఛ లేని వ్యక్తి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడ రాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ప్రశాంతమైన అనాయాస మరణం, ముందుస్తు జీవన వీలునామా అనుమతించతగినవిగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఈ జీవన వీలునామా ఎవరు అమలు చేయాలి, మెడికల్‌ బోర్డు ప్రశాంతమైన అనాయాస మరణాన్ని ఎలా ఆమోదించాలి అనే దానిపై మార్గదర్శకాలను ధర్మాసనం జారీ చేసింది. మెడికల్‌ బోర్డు జీవన వీలునామాను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మృత్యు ముఖంలో ఉన్న రోగులకు ముందస్తు ఆదేశాల ను వారి సన్నిహిత మిత్రుడు, బంధువులు జారీ చేసి అమలు చేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇదే అంశంపై ఒక చట్టం వచ్చేంతవరకు ధర్మాసనం విధించిన ఆదేశాలు, మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 
 
  ——- KNMURTHY
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!