వియత్నాంలో ఆరేడు ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహిస్తోంది. పునరుద్ధణ పనులు కూడా కొన్నిచోట్ల చేస్తోంది. ఆమధ్య 9 వ శతాబ్దపు నాటి పురాతన శివలింగం ఒకటి బయట పడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న పునరుద్ధరణ పనుల్లో ఈ శివలింగాన్ని కనుగొన్నారు. వియత్నాం లోని క్వాంగ్ నామ్ పరిధిలో ఉన్న మై సన్ సిటీలో చామ్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.
అప్పటి చంపా సామ్రాజ్య రాజు ఇంద్రవర్మ ఈ దేవాలయాన్ని నిర్మించారు.ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేశారు. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఈ దేవస్థానంలో ఇంతకుముందు కూడా ఆరు శివ లింగాలను గుర్తించారు. అయితే వాటన్నింటి కంటే ఇది చాలా అద్భుతమైందని అధికారులు అంటున్నారు. ఏకశిలతో ఈ శివలింగం తయారైంది. ఇది 1100 సంవత్సరాల నాటి పురాతన శివలింగం. గత ఏడాది జరిగిన పనుల్లో ఈ శివ లింగాన్నివెలికి తీశారు.
4 వ శతాబ్దం నుంచి 13 వ శతాబ్దం మధ్యకాలంలో హిందూ ఆధ్యాత్మిక మూలాలు కలిగిన చంపా రాజ్యంలో ఈ ఆలయాలు నిర్మితమైనాయి. వాటిలో భద్రేశ్వరుడి ఆలయం ముఖ్యమైనది. 1903-1904లో ఫ్రెంచ్ నిపుణులు ఆలయ సముదాయాన్ని శిథిలావస్థలో కనుగొన్నారు. ఆ సమయంలో జరిగిన తవ్వకాలలో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు దేవాలయ స్థలంలో ఒక శివలింగం ఉన్నట్లు వివరించారు. అయితే అపుడు తవ్వకాలు పూర్తిగా జరగలేదు. తర్వాత వియత్నాం పై జరిగిన దాడులు .. యుద్ధాలు ఆలయ సముదాయాన్ని నాశనం చేశాయి.
కాగా తొమ్మిదో శతాబ్దికి చెందిన రాజు ఇంద్రవర్మ ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇంద్రవర్మ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించక మునుపు ఆయన పేరు శ్రీ లక్ష్మీంద్ర భూమీశ్వర గ్రామ స్వామి అని అక్కడ బయట పడిన శాసనాలలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంద్రవర్మ రాజధాని నగరం ఇంద్రపురం. ఇక్కడ లభించిన బుద్ధుడి కాంస్య విగ్రహం అమరావతి శైలిలో ఉందని అంటారు. చంపా తొలి శిల్పం అంటే క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి ముందున్నదంతా అమరావతి శైలిలో ఉందని అక్కడి చరిత్రకారులు అంటున్నారు. తాజాగా కొద్దీ రోజుల క్రితం మరో సైట్ లో ఇంకొక భారీ శివలింగం బయటపడింది.
వియత్నాంలో శివాలయం, గోండు ల గురించి, విశ్వనాధుల వారి గురించి, విశేషాలు అందిస్తున్న తర్జని మూర్తి గారు అభినందనలు.