టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన వందమంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అదర్ పూనా వాలా ఉన్నారు. ఈయన సీరం ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్. కొన్నికోట్లమంది ప్రజలు ఉపయోగించిన కోవిషీల్డ్ టీకా తయారీ దారుడు ఈయనే. కార్పొరేట్ టైకూన్ అయిన పూనా వాలా ఆమధ్య నెలకు 2 కోట్ల రూపాయల అద్దెతో ఒక పెద్ద భవంతిని తీసుకుని వార్తల్లో కెక్కారు.
నెలకు 2 కోట్ల రూపాయలంటే మాటలా మరి. లండన్ లోని అతి ఖరీదైన మే ఫెయిర్ ప్రాంతంలో విశాలమైన భవంతిని ఆయన లీజుకు తీసుకున్నారు. ప్రతి వారం 50 వేల పౌండ్లను (అరకోటి)ని అద్దెగా చెల్లిస్తామని ఆ ఇంటి యజమాని డోమెనిక కల్కజిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ భవంతి ని 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
ప్రధాన భవనం తో పాటు అతిధి భవనం కూడా ఉంటుంది.భవంతి చుట్టూ ఉద్యానవనాలు ఉన్నాయి. బ్రెగ్జిట్, కరోనా సంక్షోభం తో గత పదేళ్లలో మే ఫెయిర్ ప్రాంతంలో అద్దెలు 10 శాతం తగ్గాయి.బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..పూనావాలా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. ఇక అదర్ పూనావాలా గురించి చెప్పుకోవాలంటే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయం లో చదువుకున్నారు.
2001 లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరారు. ఈ సంస్థను అదర్ పూనావాలా తండ్రి డాక్టర్ సైరస్ పూనావాలా 1966లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీదారు గా సంస్థ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు సీరం తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ ఆదాయంలో 85 శాతం ఆదాయం ఎగుమతుల ద్వారానే వస్తోంది. పోలియో వ్యాక్సిన్ , డెంగ్యూ, ఫ్లూ, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్లను సంస్థ తయారు చేస్తున్నది.2011 లో అదర్ పూనావాలా తన తల్లి శ్రీమతి విల్లూ పేరిట ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ 6 పాఠశాలలు, 1 ఆసుపత్రి ని నిర్వహిస్తోంది. పూణేలో ఆరోగ్య, విద్య, నీరు, పారిశుధ్యం , పర్యావరణం రంగాల్లో సేవలు అందిస్తోంది.