Govardhan Gande…………………………………..
చరిత్ర అంటే తేదీలు మాత్రమేనా? ఇంకేమీ లేదా? అంతకు మించి చర్చించడానికి ఏమీ లేదా? ఉండదా? సెప్టెంబర్ 17 పై తెలంగాణలో జరుగుతున్న చర్చ/రచ్చ క్రమంలో ఈ ప్రశ్నలు వ్యక్తం కావడం అసహజం ఏమీ కాదు. ఆ తేదీన జరిగింది ఏమిటి? తరువాత పౌర జీవనంలో వచ్చిన మార్పేమిటి ? అంతకు ముందు సాగిన హింస కొంతైనా తగ్గిందా? జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయా? క్షీణించాయా? ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా?
స్వేచ్చా,స్వాతంత్ర్యాలను పౌర సమాజం అనుభవించగలుగుతున్నదా? లేక మరింత ఒత్తిడిలో సమాజం కూరుకుపోయిందా ?ఈ ప్రమాణాల కోణంలో ఆ తేదీలను గుర్తుంచుకోవడం,స్మరించుకోవడం సబబు. అంతకు ముందు జరిగిన పీడనను కూడా చరిత్ర నమోదు చేస్తుంది.దాన్ని ఎవరు చేరిపి వేయలేరు. చరిత్ర లిఖించని వాస్తవాలు కూడా అనేకం ఉంటాయి.
లిఖించనంత మాత్రాన అవి అబద్దాలుగా మారిపోవు. ప్రజల మది నుండి వాటిని ఎవరూ చేరిపి వేయలేరు. అవి చేదు జ్ఞాపకాలుగా చిరస్థాయిగా మిగిలిపోతాయి. అలాంటి జ్ఞాపకాల్లో రజాకార్ల అకృత్యాలు ఉంటాయి.విలీనం/విముక్తి /విమోచనం అనే పేరిట భారత సైన్యం పోలీసు చర్య పేరిట/ముసుగులో అమాయక తెలంగాణ పౌరులపై చేసిన దురంతాలు కూడా ఉంటాయి.
ఈ రెండు సైన్యా( రజాకార్లు కూడా నిజాం రాజు అండతో కొనసాగిన ప్రైవేటు సైన్యమే)లు సాగించిన మారణ కాండను ప్రత్యక్షంగా చూసిన కొందరు ఇంకా జీవించే ఉన్నారు. నాటి పోరాట యోధులు వాటిని అక్షర బద్దం చేశారు. అలాంటి అనేక పుస్తకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కూడా. సెప్టెంబర్ 17, 1948 వరకు నిజాం రాజు పాలన తరువాత పౌర ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగింది సైనిక అరాచక పాలనే కదా. ఈ అకృత్యాల్లో చాలా దుర్ఘటనలు చరిత్రలో కన్పించక పోవచ్చు.
కానీ ఆ పీడన,హింస ను అనుభవించిన వారి వారసులు ఆ జ్ఞాపకాలతో సజీవంగానే ఉన్నారు. మత విశ్వాసాల ప్రకారం నిజాం తురక రాజు కాబట్టి వాటిని ద్వేషించి , తరువాత వచ్చిన భారత సైనిక ప్రభుత్వ హింస పీడనలను సమర్థించవచ్చునా? తురక రాజైతే నేమి మరొక రాజు అయితే నేమి హింస హింస కాకుండా పోతుందా? ఇప్పుడు రచ్చకు ప్రాతిపదిక ఇదే కదా. తేదీలకు ప్రాధాన్యత లేదనడం లేదు. హింస, పీడన, నియతృత్వం, అణచివేత అనే అంశాల్లో రాజుల మతానికి ఎలాంటి సంబంధమూ లేదు. రాజులంతా ఒక్కటే.ఏ మతానికి చెందిన రాజు కూడా వీటికి అతీతం కాదు అని చరిత్ర స్పష్టంగా వివరిస్తున్నది.రాచరికమే అలాంటిది.దానిలో ప్రజలకు స్థానం ఎక్కడుంటుంది? అలాంటప్పుడు చరిత్రను ఆ ప్రమాణాల కోణంలోనే చూడాలి కదా.
1,సెప్టెంబర్ 17,1948 హైద్రాబాద్ సంస్థానం ఇండియాలో కలిసిన రోజు. 2,నవంబర్ 1, 1956 తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన రోజు
3,ఫిబ్రవరి 18,2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును లోకసభ ఆమోదించిన రోజు.
4,ఫిబ్రవరి 20, 2014 బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన రోజు.
5,జూన్ 2 విభజన బిల్లు ఆమోదం పొంది తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన రోజు.)