సీనియర్ న్యాయవాదిగా చేస్తూ బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన కొద్దిమందిలో పమిడిఘంటం శ్రీ నరసింహ ఒకరు. ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు.
1988 లో ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టులో చేరినప్పటికీ, హైదరాబాద్ న్యాయవ్యవస్థ తో ఆయన అనుబంధం రెండేళ్లు మాత్రమే. తర్వాత న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన దేశ రాజధానిలోనే ప్రాక్టీసు కొనసాగించారు. ఆయన తండ్రి జస్టిస్ కోదండ రామయ్య హైకోర్టులో న్యాయమూర్తి గా చేశారు.
వీరి మూలాలు ప్రకాశంజిల్లాలో ఉన్నాయి. ఇప్పటికి వీరి బంధువుల్లో చాలామంది ప్రకాశం లోనే ఉన్నారు. అలవలపాడు గ్రామానికి చెందిన వీరి పూర్వీకులు మొదటి నుంచి శ్రీరామ భక్తులు..నరసింహ తాత గారికి అద్దంకి మండలం మోదేపల్లిలో కూడా కొంత భూమి ఉండడంతో ఆ గ్రామంలో స్థిర పడ్డారు. జస్టిస్ నరసింహ పెద్ద తాత గారు పమిడిఘంటం వెంకట రమణ భద్రాచలంలో అంబ అన్నదాన సత్రం (అలవలపాటి వారి సత్రం) ను స్థాపించారు.
ఇప్పటికి అంబ సత్రం భద్రాచలం వచ్చే రాములవారి భక్తులకు సేవలందిస్తోంది. ఈ సత్రానికి భక్తులు కొన్ని వందల ఎకరాల భూములను విరాళంగా ఇచ్చారు. ఇటీవల వరకు జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య ఈ సత్రం ట్రస్టీ గా ఉన్నారు. దరిమిలా ఈ సత్రాన్ని శ్రీ భారత తీర్ధ మహాస్వామి వారి పీఠానికి అప్పగించారు.
2008వ సంవత్సరంలో సుప్రీంకోర్టు నరసింహ ను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2014 లో కేంద్ర ప్రభుత్వం ఆయనను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 2018 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో నరసింహ అత్యున్నత న్యాయ స్థానానికి పలు అంశాలలో సహాయపడ్డారు. రాజ్యాంగ పరంగా నిర్ణయాలు తీసుకోవడానికి సూచనలు అందించారు.
జల్లికట్టు విషయంలో ప్రజల సంస్కృతిని పరిరక్షించే హక్కులను ఆయన సమర్థించారు. కొత్త అంతరిక్ష కార్యకలాపాల బిల్లు సిద్ధమైనప్పుడు ఇస్రో ఆయన సహాయం తీసుకుంది. అలాగే పర్యావరణానికి సంబంధించిన విషయాలలో సుప్రీంకోర్టు నరసింహ సూచనలు స్వీకరించింది.
అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఆయన ఇటాలియన్ మెరైన్స్ కేసు, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, రామ జన్మభూమి కేసులలో తన వాదనలను వినిపించారు. BCCI కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి అందరితో చర్చించి .. వారందరిని ఒప్పించి ఆ సంస్థ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఆయనకెంతో పేరు తెచ్చి పెట్టింది. అక్టోబర్ 2027 లో శ్రీ నరసింహ ఏడు నెలల స్వల్ప కాలానికి భారత ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన మే 2028 లో సుప్రీంకోర్టు నుండి రిటైర్ అవుతారు.

