Govardhan Gande ……………………………….
చట్టం వివాదాలను పరిష్కరించాలి. అంతరాలను తొలగించాలి. సామాజిక జీవనాన్ని సులువుగా మార్చివేయగలగాలి. అంటే ఆ చట్టం అందరికీ అర్ధమయ్యే భాషలో రూపుదిద్దుకోవాలి. అదే ప్రజల చట్టంగా మిగిలిపోతుంది. కానీ మన చట్టాల్లోని భాష ఈ లక్ష్యాలకు అడ్డు పడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పండితులు కూడా జుట్టు పీక్కునే రీతిలో చట్ట పరిభాష ఉంటున్నది. ఇటీవల రూపొందిన చట్టాలు కూడా అలాగే ఉంటున్నాయి.
న్యాయ వాదులు,న్యాయమూర్తులకు మాత్రమే అర్ధమయ్యే రీతిలో ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వారికి కూడా అర్ధం కాక కోర్టు కేసుల్లో వాయిదాల పర్వం ఎడ తెగకుండా సాగిపోతూ ఉండడం వల్ల కక్షి దారులు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు.వారిలో సహనం నశించి,విధి లేక కోర్టు వెలుపల వివాద పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని కేసుల తీర్పులు తేలిపోయే సమయానికి జీవితాలే అంతమైపోతాయి. ఇలాంటి ఉదంతాలు మన దేశంలో అనేకం సంభవించాయి.
వీటిని నివారించే దిశలో చట్ట పరిభాష లో కృతకమైన అర్ధం కాని భాషను సవరించే ప్రయత్నం చేస్తే వివాద పరిష్కారంలో అనవసర జాప్యాన్ని నివారించే అవకాశం కలుగుతుంది. అపుడే అది ప్రజల చట్టంగా నిలుస్తుంది. ఈ కోణంలో చట్టసభలు దృష్టి పెట్టడం అనివార్యమైన అవసరం.
ప్రస్తుతం కొన్ని చట్టాలకు సంబంధించిన పుస్తకాలు తెలుగులో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పక్రియ మరింత విస్తృతం కావాలి.కీలకమైన చట్టాలన్నీ తెలుగు భాషలో అనువాదం అవ్వాలి. ముసాయిదాలో కృతకమైన పదాలను తీసి వేయాలి. సరళమైన పదాలను వాడాలి. లోపాలుంటే తెలుగు భాష నిపుణుల చేత సరిచేయించాలి. కానీ ఇదంతా సులభం కాదు. దీనికి ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేయాలి.
ఇబ్బంది తెలుగు వాళ్ళది. దాని పరిష్కారం కోసం శాసన సభ్యులు కృషి చేయాలి. వాడుక భాషలో చట్టాలు తేవడానికి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. కొన్ని అనువాదాలలో ఉపపరిచ్చేదము, అర్ధాధికారలేఖ, కార్యవర్తనములు, ఉపవలయాదికారి…. లాంటి సంస్కృత పదాలను చొప్పిస్తున్నారు. ఇలాంటి పదాలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటికంటే ఆంగ్ల పదాలే నయం .. అర్ధం అవుతాయి. ఈ సమస్య ఏ కొందరిదో కాదు అందరిదీ. కాబట్టి ప్రభుత్వాలు సమస్యపై దృష్టి పెట్టాలి.