మరణం శరీరాలకే .. జ్ఞాపకాలకు కాదు !

Sharing is Caring...

Marudhuri Raja ………………………………………. 

Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయన లో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ లు,జోక్స్ వేస్తుంటారు.

హరనాథరావు కి  ఈతరం ఫిలిమ్స్ కి విడదీయలేని బంధం.. ఆయనకీ, పోకూరి బాబూరావు గారికి చెప్పలేని అనుబంధం.. ఒకరిమీద ఒకరు సెటైర్లు వేసుకొని..విమర్శ చేదుగా ఉన్నా తీపి నవ్వులు నవ్వుకునేవాళ్ళు.ఓ రోజు….
“అమ్మాయి కోసం” సినిమాని.. ఆఫీసులో కూర్చుని వ్రాస్తున్నా.ఎదురుగా..ఖాళీ టీ కప్పు..ప్లేట్ లో బిస్కెట్లు. బాబురావు గారితో మాట్లాడుతుండగా..హరనాథరావు గారు ఎంటరై..ప్లేట్ వైపు చూసాడు. 
” ఏంట్రా..మీ ప్రొడ్యూసర్..బిస్కెట్లు కూడా పెడుతున్నాడు..”విశ్వాసం” తో రాస్తావనా..” అన్నాడు..!అంతే.

ఓ సినిమాకి ఆయనకి సహాయ రచయిత గా చేస్తున్నాను..డైరెక్టర్ కి, హరనాధ రావు గారికి సీన్స్ ఎడిటింగ్ విషయంలో గొడవ.
“నాకు ఆ డైలాగులు నాలుగూ వద్దంటాడు” డైరెక్టర్ .
“కావాల్సిందే” అంటాడు ఈయన.
అన్నీ సీన్స్ లో ఇదే గొడవ.! ఎంతకీ మంట ఆరదు.
అప్పుడే అక్కడి నేను వెళ్ళాను టైమ్ బ్యాడ్ అయి …
అన్నయ్య చిరాకుతో బాధ్యత నాకు అప్పగించి కాసేపు బయటకు వెళ్లారు రిలాక్స్ కావాలని. 
నేను లోపల సీన్లు మార్పులు చేసి.. ఓకే చేయించి బయటకు వస్తుండగా..హరనాధ రావు గారు వాకిట్లోనే ఎదురయ్యారు.
నాకు గిల్టీ,భయం..నేను మార్పు చేశానంటే ఎలా మండిపడతాడో అని…..
ఆయన గాంభీర్యం గా….
” ఏమైందిరా..డైరెక్టర్ చెప్పినట్టు “లెంగ్త్” లు అన్నీ తీసేశావా..” అని అడిగాడు.
“లెంగ్త్ లేంటి.. “స్ట్రెంగ్త్ ” లు కూడా తీసేశాను..” అన్నాను.. అంతే…ఆయన కోపంపోయి..పెద్దగా నవ్వాడు.. ఆ పూట అలా ఇద్దరం హాయి గా.. నవ్వుకున్నామనమాట. 

———– 
పూర్వం..ఓ సంవత్సరం లో 
గుంటూరులో మాజేటి గురవయ్య హైస్కూల్ లో జరిగిన నాటికల పోటీల్లో “భువన విజయం” నాటికలో “ధూర్జటి కవి” వేషం వేసి వెండి డాలర్ బహుమతి సంపాదించాడు 12 ఏళ్ళ కుర్రవాడు. ఆ వెండి డాలర్ ని దారాలతో చుట్టి ఓ దండగా తయారుచేసి మూడేళ్ల తమ్ముడి మెడలో ప్రేమతో వేసాడు. ఓ రోజు ఓ మల్లెపూలు అమ్ముకునే వాడు బుట్టతో వచ్చి..బిడ్డ తల్లి ఏమరుపాటులోఉండగా బ్లేడ్ తో దారాల దండ కట్ చేసి డాలర్ కాజేసి వెళ్లి పోయాడు. దండపోయిందన్నబాధ..పోయినా పిల్లాడికే ప్రమాదం జరగలేదని సంతోషం.ఆ ఇంట్లో.
ధూర్జటికవి వేషం వేసి డాలర్ సంపాదించి,దండని చేసి తమ్ముడి మెడలో వేసింది  ఎవరో కాదు …. M.V.S హరనాథ రావు గారే దండ వేయించుకున్న తమ్ముడు సర్వ సామాన్య రచయిత ఈ మరుధూరి రాజా నే.  ఐదుగురు అన్నదమ్ములలో పెద్దవాడాయన..నాలుగో వాడు వీడు..! ఈ రోజు హరనాథరావు గారిపుట్టిన రోజు..!
హరీ..
నువ్వు వెళ్లి పోయావు.. మరణం శరీరాలకే గానీ..జ్ఞాపకాలకి ఉండదు..ఉంటే చరిత్ర లే ఉండేవి కాదు..నా స్మృతి లో నువ్వెప్పుడూ..సజీవ కావ్యానివి.  నువ్వు లేవనే విషాదాన్ని మరిచిపోవటానికి సరదాగా ఆడుకోమని బాల్య జ్ఞాపకాల గవ్వలు అందించి మరీ వెళ్లావు. అమ్మ ఇచ్చిన ఈశరీరం ఆరిపోనంత కాలం నువ్వు నా మనసులో వెలుగుతూనే ఉంటావు… నీకు ఎన్నో మనస్పూర్వక నమస్సులు అర్పిస్తూ…!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!