Mass Song ………………………………
‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ‘? ‘వేదం’ సినిమాలోని ఈ పాట హుషారెక్కించే గీతం.వయసుతో సంబంధం లేకుండా అందరిని కదిలిస్తుంది. తెరపై ఈ పాటకు అనుష్క అభినయం అందరిని అలరిస్తుంది. థియేటర్లలో ఈలలు ..కేకలు,చప్పట్లు.
గుండె గుబులుని గంగకు వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి..ఊరి సంగతి ఊరికి వదిలి..దారి సంగతి దారికి వదిలి..తప్పు ఒప్పులు తాతలకొదిలి..సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి..
తెరలను వదిలి పొరలను వదిలి….తొలి తొలి విరహపు చెరలను వదిలి…
గడులుని వదిలి ముడులని వదిలి…గడబిడలన్నీ గాలికి వదిలేసి
ఆహా..ఆహా..
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.
సాహితీ రాసిన ఈ గీతానికి కీరవాణి మంచి ట్యూన్ కట్టారు.. సునీత అద్భుతంగా పాడారు.
అభిమానులు వెర్రెక్కి వీరంగం వేసే తరహాలో క్రిష్ ఈ పాటను తెరకెక్కించారు. ‘వేదం’ లో అనుష్కది ఒక సెక్స్ వర్కర్ పాత్ర. గతంలో ఇలాంటి పాత్రలు చాలామంది చేసినప్పటికీ వాళ్లందరికంటే అనుష్కనే ఎక్కువ మార్కులు కొట్టేసింది.(మల్లెపువ్వులో లక్ష్మి పాత్రకు మినహాయింపు ఇవ్వొచ్చు)
అమలాపురం సరోజ పాత్ర అనుష్కకు మంచి గుర్తింపు తెచ్చింది. కొన్నాళ్ళు అనుష్కను ఎక్కడికెళ్లినా ‘సరోజా’ అంటూ పిలిచే వారు.”ఏ ఉద్యోగానికైనా అనుభవం ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు.. కానీ మా ఉద్యోగానికి అనుభవం ఎంత తక్కువుంటే అంత ఎక్కువ డబ్బులిస్తారు.” “మేం బట్టలు విప్పి అమ్ముడు పోతాం, మీరు బట్టలు వేసుకొని అమ్ముడు పోతారు.” వంటి అనుష్క డైలాగులు ఎప్పటికి గుర్తుండి పోతాయి. వేదం లో అనుష్క పాత్ర, గెటప్ ..డైలాగ్స్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.
‘అరుంధతి’ తర్వాత అనుష్క చేసిన పాత్ర అది. సరోజ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది.. అదినువ్వు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ క్రిష్ చెప్పగానే ఆమె ఒకే అనేసింది. రొటీన్ పాత్రలకు భిన్నంగా చేసిన క్యారెక్టర్ అది. అందుకే అంత పేరు కూడా వచ్చింది.తమిళంలో ఇదే సినిమాను ‘వానం’ పేరిట రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. సరోజ పాత్ర ను అనుష్క చేయగా మిగతా నటులు మారారు. క్రిష్ నే డైరెక్ట్ చేశారు.
ఈసినిమాలో సరోజ పాత్ర అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సెక్స్ వర్క్ చేస్తుంటుంది. అందరూ ఆమెను అమలాపురం సరోజ అని పిలుస్తారు. ఆ పాత్ర పేరు ముందు అమలాపురం అని పెట్టినందుకు ఆ ఊరి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ క్రిష్ “వేదం” ను రొటీన్ సినిమా గా కాకుండా డిఫరెంట్ ఫిలింగా తీశారు. సొసైటీ లో మన కళ్ళముందే కనిపించే పాత్రల చుట్టూ కథ తయారు చేసుకున్నారు. దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అల్లు అర్జున్,మంచు మనోజ్, మనోజ్ వాజపాయ్, నాగయ్య తదితరులు నటించారు. ఈ సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి.
ఈ సినిమా విడుదలై అపుడే 15 ఏళ్ళు అవుతోంది. ఈ చిత్రం తరువాత అనుష్క స్టార్ హీరోయిన్ స్థాయి కెదిగింది. తర్వాత రుద్రమదేవి .. బాహుబలి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తన 16 ఏళ్ళ కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క సెలెక్టివ్ గా కొన్ని సినిమాల్లోనే నటిస్తోంది.
ఆమె పారితోషకం కూడా ఎక్కువే. సుమారు 4 కోట్లు తీసుకుంటుందని అంటారు. ఈ మధ్య రేసులో స్వీటీ వెనుక బడింది. లేడీ ఓరియెంటెడ్ పాత్రలనే చేస్తుంది. అన్నట్టు స్వీటీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. వేదం మూవీ యూట్యూబ్ లో ఉంది … చూడొచ్చు. చూసిన వారు కూడా చూడవచ్చు.