కొందరికి అదృష్టం అలా కలిసి వస్తుంది.. ఆ కోవలో వారే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్. మంత్రి పదవి పోయిన గంటల్లోనే గవర్నర్ గిరీ వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని అదృష్టం కాక మరేమంటారు. కొద్దీ రోజుల క్రితం ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మొత్తం 11 మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించారు. అందులో రవిశంకర్ ఒకరు. అయితే కేబినెట్ విస్తరణకు కొద్దీ గంటలముందే రవిశంకర్ రాజీనామా చేసారు. ప్రధాని మోడీ రవిశంకర్ ప్రసాద్ పనితీరు పై అసంతృప్తితో ఉన్నారని అందుకే క్యాబినెట్ నుంచి తప్పించారని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది.
ప్రతి ఇంటికి ఇంటర్నెట్ లక్ష్యం తో మోడీ సర్కార్ భారత్ నెట్ పధకం ప్రారంభించింది. ఈ పధకాన్ని అమలు జేయడంలో .. లక్ష్యాలు సాధించడం లో ఐటీ మంత్రిగా చేసిన రవిశంకర్ ప్రసాద్ పనితీరు మోడీ కి సంతృప్తికరం అనిపించలేదట. సోషల్ మీడియా దిగ్గజం పేస్ బుక్,ట్విట్టర్ తో వచ్చిన వివాదాలను సమర్ధవంతంగా డీల్ చేయలేకపోయారని విమర్శలున్నాయి. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టడం లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఇపుడు అదే సోషల్ మీడియాలో మోడీ వ్యతిరేక ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇవన్నీకలిసి రవి శంకర్ పదవికి ఎసరు పెట్టాయి అంటారు.
సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారానికి రవి శంకర్ ఏమి చేయగలరు ? నియంత్రించ లేకపోయారనే కోపం కావచ్చు.మొత్తానికి మంత్రి పదవి పోయింది.అయితే నేమి ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ పదవి వరించింది. మిగతా వారికి దక్కని ఛాన్స్ దక్కింది. ఒక విధంగా చూస్తే ఈ గవర్నర్ పదవే హాయి. పెద్ద తలనొప్పులు పాడు ఉండవు. లక్ష్యాలతో అసలు పని లేదు. .. చెప్పుకోదగిన పని ఏమీ ఉండని గవర్నర్ గిరీ అంటే రాజ వైభోగమే కదా. ఐదేళ్లు పదవికి డోకా లేదు. రాజభవన్ లో హాయిగా కాలక్షేపం చేయవచ్చు. ఇలాంటి పదవి కి రవిశంకర్ ప్రసాద్ లాంటి నేత అర్హులే. రాజకీయంగా బోలెడు అనుభవం ఉన్నవాడే.
సాదా సీదా నాయకుడు కాదు. ఆయనకు పెద్ద చరిత్రే ఉంది. రవిశంకర్ ప్రసాద్ 1970 దశకంలో విద్యార్థి నాయకుడిగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.1975 లో ఎమర్జెన్సీ విధించినప్పుడు జైలు పాలయ్యారు. జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో బీహార్లో విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. ఆర్ ఎస్ ఎస్ లో చాలాకాలం పనిచేశారు. బీజేపీ కార్యవర్గంలో సభ్యుడు. సంఘపరివార్ పెద్దలతో సంబంధాలు ఉన్ననేత. సుప్రీం కోర్టు లో న్యాయవాదిగా చేశారు. ఎల్ కె అద్వానీ కేసులు కొన్ని వాదించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఎన్డిఎ సర్కార్ లో రవిశంకర్ బొగ్గు గనులు,న్యాయ,సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.2019 లో పాట్నాసాహిబ్ లోకసభ స్థానంలో ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హాను ఓడించి 2.84 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. 2014 నుంచి మొన్నటివరకు మోడీ క్యాబినెట్లో మంత్రిగా చేశారు.
———-KNM

