Taadi Prakash ………………………………………………….
విదేశీ వార్తలు విన్న భారత ప్రభుత్వం ‘‘చాల్లే సంబడం, ఇక్కడ రిలీజ్ చేసుకోండి’’ అంది. సత్యు మిత్రుడొకాయన, బెంగళూరులోని తన రెండు థియేటర్లలో ముందు ప్రదర్శించాడు. విమర్శకులు ‘కెవ్వుకేక’ అన్నారు. Land mark film in Indian histroy అని పత్రికలు రాశాయి.
ఎం.ఎస్.సత్యు, ఇషాన్ ఆర్య, బలరాజ్ సహానీ, కైఫీ ఆజ్మి పేర్లు దేశం అంతటా మోగిపోయాయి. ఇది కమర్షియల్ సినిమా కాకపోయినా, న్యూవేవ్ ఆర్ట్ ఫిలిం కేటగిరీకి చెందిందే అయినా లాభాలు రాబట్టగలిగింది.బెస్ట్ ఫారెన్ లాంగ్వేజి ఫిల్మ్ కేటగిరిలో ఇండియన్ ఎంట్రీగా ‘గరంహవా’ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయింది.
గమ్మత్తేమిటంటే దేశ సమైక్యతను చాటి చెప్పిన చిత్రంగా ఆ ఏడాది నర్గీస్‌దత్ అవార్డు గెలుచుకుంది. 1975లో ఉత్తమ డైలాగులు కైఫీ ఆజ్మి, ఉత్తమ స్క్రీన్ ప్లే కైఫీ ఆజ్మీ, షామా జైది, ఉత్తమ కథ ఇస్మత్ చుగ్తాయ్ ఫిలిం ఫేర్ అవార్డులు పొందారు.
లక్నో జీవితం… కష్టాల కొలిమిThe land is divided–Lives are shattered–Storms rage in every heart:–It’s the same here or there.–Funeral pyres on every home:—The flames mount higher—.Every city is deserted:–It’s the same here or there.–No one heeds the Gita:–No one heeds the Koran–Faith has lost all meaning:-Here or there.వేదనా భరితమైన ఈ మాటలతో సినిమా ప్రారంభం అవుతుంది.
ఆవిర్లు చిమ్ముతూ లక్నో నుంచి రైలు పాకిస్తాన్ వెళుతుంటుంది.ఫ్లాట్‌ఫాం మీద నించుని వున్న సలీం మీర్జా (బలరాజ్ సహానీ) చెయ్యి వూపుతూ మిత్రులకు వీడుకోలు చెబుతుంటాడు. అలా మొదవుతుంది ‘గరంహవా’. ఆ ఒక్క సీన్‌తోనే దేశవిభజనలోని లోతైన వేదనని మన కళ్ళముందుంచుతాడు సత్యు.
సలీం మీర్జా లక్నోలో ఒక లెదర్ బూట్ల కంపెనీ యజమాని. చదువూ సంస్కారంతో హుందాగా ప్రవర్తించే పెద్దమనిషి ఆయన. తల్లి, భార్య, ఎదిగిన ఇద్దరు కొడుకులు, కూతురు, కోడలు, మనవడు… మీర్జా కుటుంబం. ఒక పురాతన హవేలీలో వుంటారు. విభజన వల్ల ముస్లింలని అనుమానంగా చూస్తుంటుంది సమాజం. రోజూ అనేక మంది ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోతుంటారు.
తరతరాలుగా ఉత్తరప్రదేశ్‌లోనే వుండి, పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డల్నికని, ఇండియానే మాతృభూమి అని గట్టిగా నమ్మే ముస్లింలు సందిగ్ధంలో నలిగిపోతుంటారు. ఒక్కటే ప్రశ్న, పాకిస్థాన్ వెళ్ళిపోవడమా? సమస్యల్ని తట్టుకుని ఇక్కడే ఉండిపోవడమా? ‘‘మీర్జాగారు, మీరెప్పుడైనా పాకిస్తాన్ వెళిపోవచ్చు. మీ లెదర్ కంపెనీకి యిక రుణం ఇవ్వలేం’’ అంటుంది బ్యాంక్.
బూట్లకి పెద్ద ఆర్డరు వుంటుంది. అడిగిన రోజుకి బూట్లు తయారు చేసి పంపించాలి. వర్కర్లకి జీతాలు యివ్వాలి. ఆర్డర్ కేన్సిల్ అయిపోతుంది. చిన్నకొడుకు పాకిస్తాన్ వెళిపోతాడు. ముస్లిం అని పెద్ద కొడుక్కి ఎవరూ ఉద్యోగం యివ్వరు. కూతురు ప్రేమించిన యువకుడు పాకిస్తాన్ వెళిపోతాడు. కొంత కాలం తర్వాత మరో యువకుడితో పెళ్ళికి సిద్ధపడుతుంది.
అనుకోని పరిస్థితుల్లో అతను పాకిస్తాన్‌లో మరో అమ్మాయిని చేసుకుంటాడు. నిరాశతో మీర్జా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. చాలా అప్పు వుందని ఇల్లు మరొకరు స్వాధీనం చేసుకుంటారు. బూట్ల ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఎలాగైనా బతకాలని, సలీంమిర్జా బూట్లు తయారు చేసి, ఒక కుర్రాడితో బజార్లో తిరిగి అమ్ముతుండగా, మిర్జాని ‘పాకిస్తాన్ గూఢాచారి’ అంటారు. విషాదంలో ఒంటరిగా మిగిలిపోతాడు. కోర్టు మిర్జాని విడుదల చేస్తుంది.
చివరి సన్నివేశం : భార్య, కొడుకులతో సలీం మిర్జా గుర్రపుబండి (టాంగా)లో బయల్దేరుతాడు. స్టేషన్‌కి వెళ్ళి, పాకిస్తాన్‌కి రైలు ఎక్కాలి, దారిలో టాంగాకి ఒక పెద్ద ప్రదర్శన అడ్డువస్తుంది. వందలమంది యువకులు, ‘ఉద్యోగాలు కావాలి’ అని నినాదాలు చేస్తుంటారు. ఎర్ర బేనర్లు, ఎర్ర జెండాలు పట్టుకున్న ఆ యువకులు ఇంక్విలాబ్ జిందాబాద్ అని గట్టిగా అంటూంటారు.
‘‘నాన్నా, నేను వాళ్ళతోనే వెళతా’’ అంటాడు కొడుకు (ఫారూక్ షేక్), టాంగా దిగుతూ, వెళ్ళు… నేనూ మీతోనే… అంటూ సలీం మిర్జా టాంగా దిగుతాడు. తాళం భార్య చేతికిచ్చి, ఆమెని ఇంటికి తీసికెళ్ళు అని టాంగా వాడితో చెబుతాడు. ఆవేశంతో నినాదాలు చేస్తున్న యువకులతో కలిసి నడుస్తాడు మిర్జా. చావోరేవో భారతదేశంలోనే వుండాలన్నదే పెద్దాయన అంతిమనిర్ణయం.
కొన్ని తెరవెనుక కబుర్లు ; నిజజీవితంలో బలరాజ్ సహాని మొదటి భార్యకి ఒక కూతురు. ఆమె ఒక ముస్లింని ప్రేమించింది. దానికి బలరాజ్ తల్లి ఒప్పుకోలేదు. దాంతో ఓ హిందూ యువకునితో కూతురిపెళ్ళి చేశాడు బలరాజ్ సహాని. తర్వాత కూతురు ఆత్మహత్య చేసుకుంది. సినిమాలో కూడా ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది.
‘బొంబాయిలో అచేతనంగా వున్న నీ కూతుర్ని చూస్తూ నిబడిపోయావు. కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఇక్కడ సినిమాలో కూడా చనిపోయి వున్న కూతుర్ని విషాదంగా చూస్తూ నిలబడు. ఇది నీకు క్రూయెల్‌గా అనిపించినా, దర్శకుడిగా నా పని అది’’ అని బలరాజ్ సహానీతో సత్యు చెప్పారు.సినిమాలో సలీంమిర్జా తల్లిపాత్రకి 70 ఏళ్ళ వయసుండే వృద్ధురాలు కావాలి.
ఆ పాత్ర చేయాలని గాయని షంషాద్ బేగంని అడిగారు. ఆమె ఒప్పుకోలేదు. బాదర్ బేగం అనే ఆమె 16 ఏళ్ళకే బొంబాయి పారిపోయి సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసింది. కొన్నేళ్ళ తర్వాత లక్నో తిరిగి వచ్చి వ్యభిచారం చేసింది. పెద్దయ్యాక ఒక వ్యభిచారగృహం నడిపింది. 70 ఏళ్ళ బాదర్ బేగంని ఒక మిత్రుడు పరిచయం చేశాడు సత్యుకి. కళ్ళుకూడా సరిగా కనిపించని ఆమెకి బలరాజ్ సహానీ తల్లిపాత్ర యిచ్చాడు. ఆ పాత్రలో ఆమె చెప్పలేనంత బాగా వొదిగిపోయింది. ఆ పాత్రకి ప్రఖ్యాత నటి దీనా పాఠక్ డబ్బింగ్ చెప్పింది.
1953లో లెజండరీ బిమల్‌రాయ్ తీసిన దోబిఘా జమీన్’ సినిమాలో బరాజ్ సహానీ అప్పు తీర్చడంలేదని పొలం లాక్కోబోతాడు భూస్వామి. అప్పు తీర్చడం కోసం ఆ పేద రైతు కలకత్తా వీధుల్లో రిక్షాతొక్కుతాడు. ఆ తలపాగా చుట్టిన రిక్షా కార్మికునిగా బలరాజ్ సహానీ, భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచివుంటాడు. 1973లో ‘గరంహవా’ నిర్మాణం ముగిశాక, డబ్బింగ్ పూర్తయిన మర్నాడే బరాజ్ సహానీ మరణించారు. దుర్భరవేదన, విషాదం కగలిసిన భావోద్వేగాన్ని తెరమీద బలరాజ్ సహానీ పలికించిన తీరు మనల్ని కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్ళినవాళ్ళు అక్కడ బాగుపండిదేమీ లేదు. ఇక్కడున్న ముస్లింలు, పాక్‌నించి వచ్చిన సింధీలు, తదితరులు బావుకున్నదీ ఏమీ లేదు. చివరికి ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాలు సామాన్య జనం, మధ్య తరగతి వాళ్ళ బతుకుల్ని గాలికి వదిలేశాయని అర్థం అయినపుడు మనసుకెంతో కష్టంగా వుంటుంది.
‘గరంహవా’ ఫిలిం రీళ్ళు పాడయిపోతే సినిమాని పునరుద్ధరించడానికీ, డాల్బీ సరౌండ్‌కి మార్చడానికీ కోటి రూపాయలు ఖర్చయింది. కాలిఫోర్నియాలోని ఫిలింలాబ్‌లో ‘గరంహవా’ని ఇలా బతికించి, 2004లో ఇండియా అంతా 80 మల్టీప్లెక్సుల్లో మళ్ళీ విడుదల చేశారు.
చరిత్రలో ఒక సంక్లిష్టమైన దశలో భారత ముస్లింల వేదనాభరిత జీవితాన్ని సహజసుందరంగా తెరకెక్కించిన ఇషాన్ ఆర్య, ఎం.ఎస్.సత్యు ధన్యులు.తర్వాత ముత్యాలముగ్గు సినిమాకి ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ఇషాన్ ఆర్య జాతీయ అవార్డు పొందారు.గరంహవాకి ఒరిజినల్ కథరాసిన ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్,Woman Sexuality, Femininity మీద దిగ్భ్రాంతి పరిచే కథలు, నవలలు రాసి సంప్రదాయ సమాజం వీపు పగలగొట్టారు.
ఆమె మన గుడిపాటి వెంకట చెలంగారికి ఉర్దూ వెర్షన్ అన్నమాట. అనేక భాషల్లోకి తర్జుమా అయిన చుగ్తాయ్ కథ ‘Quilt’ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నటి షబానా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ. గరంహవాలో కైఫీ సహచరి షౌకత్ ఆజ్మీ బలరాజ్ సహానీ భార్యగా నటించారు.సత్యజిత్ రే పథేర్ పాంచాలి కూడా మొదట పారిస్ లో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందాక మాత్రమే ఇక్కడ రిలీజ్ కి నోచుకుంది. అదీ మన దుర్గతి.