దేశంలోని శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది.
“గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయములో గర్భాలయమ. అంతరాలయము ముఖమండపముల కన్నా లోతులో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును,మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు.
అత్యంత అద్భుతంగా ఆ నాటి శిల్పులు రుద్రుడి ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా,దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానాన్ని సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.
ఆలయ గర్భ గుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. శివలింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఏడు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పులో ఉంటుంది.
శివుడు రెండు చేతులతో …. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని దర్శనమిస్తాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు కర్ణాభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి కనిపిస్తాడు.
ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనిపిస్తాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా శివుని శరీరభాగములు కనపడుతుంటాయి. శివునికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము… క్రింది పొడవైన స్థంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంటుంది.
ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.గుడిమల్లం 2009 వరకు పురావస్తు శాఖ వారి ఆధీనంలో వున్నది. ఈ కారణంగా శివుడికి పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. దీంతో ప్రజలు ఎక్కువగా వచ్చేవారు కాదు.. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు గుడికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు.
ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడ అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం అని., క్రీస్తుపూర్వం 2వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు.
1911లో గోపీనాధరావు అనే పురాతత్వశాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడని అంటారు. ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు.ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి.
ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించ లేదు. కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. (జిల్లా గజిటీర్లు పరిశీలిస్తే క్రీ.శ. 1908 నాటికే బిటీష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది). అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియటం లేదు.
కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మిత మైంది. గర్భాలయంపై కప్పు గజ పృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ”తిరువిప్పరమ్ బేడు” అని పిలిచినట్టు తెలుస్తోంది.
అంటే తెలుగులో ‘శ్రీ విప్రపీఠం’ అంటారు. పల్లవుల నిర్వహణ లోకి వచ్చాక ఇది గుడిపల్లమైంది. కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.
చోళ,పల్లవ,గంగపల్లవ,రాయల కాలంలో నిత్యం ధూప,దీప,నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి.
గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండీ 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్దం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు.
ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సంపాదించారు గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది.
ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘డెవలప్ మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ అర్కిటెక్చర్ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.
మొదట్లో ఈ శివలింగం ఆరు బయటే పూజలు అందుకునేదట. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దానిచుట్టూ గుడిని నిర్మించాయి. ఆలయ సముదాయాలన్నీ పరిపల్లవ, బాణ, చోళుల శిల్పశైలిని పోలి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య దేవాలయాలున్నాయి.
ఏకలింగంపై శివుని అనేక రూపాలను మలచిన తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనం. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతున ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగంపై పడేలా నిర్మాణ చాతుర్యం చూపారు.
తిరుపతికి గానీ, రేణిగుంటకి గానీ రైల్లో చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు. అయితే ఇక్కడ ఉండేందుకు వసతి, హోటల్స్ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే తీసుకుని వెళ్లాలి. ఇటీవలే యాత్రీకులు ఎక్కువగా వస్తున్నారు.
———– KNMURTHY