ఆ నిర్ణయం ‘ఇందిర’ ఎందుకు తీసుకున్నారో ? 

Sharing is Caring...

Nehru’s successors in BJP …………………………..

పై  ఫోటో 1982 నాటిది.  ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ.

2024 .. లోకసభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ..  వరుణ్ గాంధీకి ఆ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. అంతకుముందు వరకు వారిద్దరూ బీజేపీ లోక్ సభ సభ్యులు గా ఉన్నారు. నెహ్రూ  కుటుంబ వారసులు బీజేపీ లో ఉండట మేమిటి ? …….  దీని వెనుక పెద్ద కథే ఉంది.

1982 మార్చినెలలో ప్రధాని ఇందిర లండన్ పర్యటన ముగించుకొని ఇంటికి చేరుకున్నారు. కోడళ్ళు సోనియా, మేనకా అప్పటికి చిన్న పిల్లలు అయిన రాహుల్, ప్రియాంక, వరుణ్ లు ఎదురొచ్చి స్వాగతం పలికారు. మేనకను చూసి ఇందిరా గాంధీ నీతో తరువాత మాట్లాడతాను అనేసి తన గదిలోకి వెళ్లిపోయారు.

ఆ నెలలో మార్చి 27 న మేనకా గాంధీ లక్నౌ లో యూత్ కాంగ్రెస్ మీటింగ్ లో పాల్గొని వచ్చింది . ఆ సమావేశంలో “1980 నుండి దేశంలో అవినీతి పెరిగిపోతున్నదని, అవినీతిని సమూలంగా తుడిచి పెట్టాలి “అంటూ సుదీర్ఘ మైన ఉపన్యాసం  ఇచ్చారు. 

మార్చ్ 28 రాత్రి తొమ్మిది గంటలకు “భోజనం నీ గదికి వస్తుంది నీవు మాతో వద్దు “అని  ఇందిర కబురు పెట్టారు. తరువాత ఒక గంటకు మేనకా గాంధీ గదికి వచ్చి “నీవు ఇంట్లో నుండీ వెళ్లి పో ” అని పెద్ద గా అరిచారు. అదే స్థాయి లో మేనకా గాంధీ  “నేను ఏమి తప్పు చేశాను” అని అడిగింది. మళ్లీ అదే రాత్రి 12గంటలకు వచ్చి” నువ్వు తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపో …  నీ సామాన్లు తనిఖీ చేయాలి” అన్నారు ఇందిర. ఈ సందర్భంగా అత్తాకోడళ్లు  కాసేపు అరుచుకున్నారు.

ఆ సమయంలో ఇందిరతో పాటు ఆమెకు సన్నిహితుడైన ధీరెంద్ర బ్రహ్మ చారి కూడా అక్కడ ఉన్నారు. ఇందిరకు  ధీరేంద్ర  అప్పట్లో ఆంతరంగిక కార్య దర్శి గా చేసేవారు .ఇద్దరూ ఆరోజులలో ఒక వెలుగు వెలిగిన వారు. మేనకా గాంధీ అత్తగారి మాటలతో ఏమనుకున్నదో  ఏమో ఆ రాత్రే ఇందిర ఇంటి నుండి ఆమె కుటుంబం నుండి తన పసి బిడ్డ వరుణ్ గాంధీ తో బయటకు వెళ్లి పోయింది.

ఆ సమయంలో సోనియా రాజీవులు మేనకాను ఆపలేదు అంటారు.కాగా అంతకు ముందే మేనకా గాంధీ పై ఓ కన్నేసి ఉంచమని ఇందిర గూఢ చారులను నియమించారు. వారు ఇందిరకు ఇచ్చిన సమాచారం మేరకే  కోడల్ని ఇందిర నిర్దయగా అర్ధరాత్రి ఇంటి నుంచి పంపి వేశారని అంటారు. ఈ ఘటన అప్పట్లో ఒక సంచలనం అయింది.  ఇందిర అనుకూల మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదు.

వ్యతిరేక మీడియా మాత్రం హైలెట్ చేసింది. మేనకా కూడా తనను ఇందిర గాంధీ అర్ధరాత్రి ఇంటి నుంచి తరిమేసింది అని మీడియాకు చెప్పింది. ఆ క్రమంలో వచ్చిన విమర్శలను ఇందిరాగాంధీ పెద్దగా పట్టించుకోలేదు.కొన్నాళ్ళు పుట్టింట్లో ఉన్న మేనక  తర్వాత  రోజుల్లో  సంజయ్ విచార మంచ్ అనే పార్టీ పెట్టింది.  1982 లో ఎన్టీఆర్ ప్రభంజనం చూసి ఆయనను మేనక కలసి మాట్లాడింది.

ఇందిరపై కోపం తో ఉన్న ఎన్టీఆర్  అయిదు సీట్లు ఆమె పార్టీకి కేటాయించారు. సంజయ్ విచార్ మంచ్ అయిదు సీట్లలో పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది.  పార్టీ ని జనంలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేసింది కానీ మేనక ఫలితాలు సాధించలేకపోయారు. 1984 లో ఇందిర దారుణంగా హత్యకు గురయ్యారు.

ఇందిర నివాసంలోనే   అంగరక్షకులయిన సత్వంత్‌ సింగ్, బియాంత్ సింగ్ లు ఇందిరను కాల్చి చంపారు. ఈ హత్య అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో సైన్యం చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ కి  ప్రతీకారంగా జరిగింది.ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.

అమేధీ స్థానం లో రాజీవ్ పై మేనకా పోటీ చేసింది కానీ గెలవలేదు. తర్వాత జనతాదళ్ లో చేరి 1989 లో ఫిలిభిత్ స్థానం నుంచి గెలిచి వీపీ సింగ్ క్యాబినెట్లో స్టేట్ మంత్రి గా చేరింది. నాటి నుంచి రాజకీయంగా మేనక వెనక్కి చూసుకోలేదు.

ఆ తర్వాత  మేనకా గాంధీ బీజేపీ లోచేరి పోయింది వాజ్ పాయ్ మంత్రి వర్గం లో స్టేట్ మినిస్టర్గా పని చేసింది. 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ మంత్రి వర్గం లో  మంత్రి గా ఉన్నది 2019 లో ఎందుకో నరేంద్ర మోడీ మేనకా గాంధీ కి మంత్రి పదవి ఇవ్వలేదు.  అమె కుమారుడు వరుణ్ గాంధీ గూడా 2014 నుండి 2024 వరకు బీజేపీ లోక్ సభ సభ్యుడి గా ఉన్నారు.

ఒంటరి మహిళగా మేనక  ధైర్యంగా పలు సమస్యలను ఎదుర్కోవడం గొప్ప విషయమే. విదేశీ కోడలు సోనియా ను ఆదరించిన ఇందిర స్వదేశీ కోడలు మేనకను ఆదరించలేకపోయింది. వితంతువు అయిన మేనకను ఎందుకు నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి ఇంటి నుంచి పంపారో  ఎవరికి తెలియదు.

ఇక పార్లమెంట్ లో సోనియా మేనకా గాంధీలు ఎదురుపడి పలకరించుకున్న సందర్భాలు లేవు. ఒకసారి మేనకా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ..స్పీకర్ ను కల్సి వస్తున్నపుడు ఎదురుగా ఉన్న సోనియా ఇతర ఎంపీలకు నమస్కరించారు. బదులుగా సోనియా కూడా నమస్కరించారు. రెండు కుటుంబాల మధ్య మాటలు లేవని అంటారు. వరుణ్ గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో టచ్ లో ఉన్నారని చెబుతారు. 

కొసమెరుపు ఏమిటంటే …ఎన్టీఆర్  ప్రతి  ఎన్నికల సభలోనూ  మాజీ ముఖ్యమంత్రి  టీ అంజయ్యని రాజీవ్ గాంధీ అవమానించిన సంఘటన ను, ఇందిర మేనకను వెళ్లగొట్టిన తీరును పదే పదే చెప్పి ఎండ గట్టారు.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!