పార్టీల నేతలంతా శాఖాహారులే ! కానీ —-

Sharing is Caring...

Govardhan Gande ……………………………………………………

“రాళ్లతో కొట్టి చంపండి” (పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను)అని ఓ పార్టీ కొత్త సారధి చేసిన వ్యాఖ్య…కలకలం రేపింది.చర్చకు తెర దీసింది.  పత్రికలు టీవీలు ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. సంతోషించవలసిన సంగతే. స్వాగతించవలసిందే. అభ్యంతరకరమైందేమీ కాదు. ఈ చర్చ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోయినా,జనానికి కొంత అవగాహననైనా కలిగించేందుకు దోహదపడుతుంది.కానీ ఇక్కడ ఈ చర్చలో ఆవేశంగా మాట్లాడుతున్న పార్టీలు (వామపక్ష పార్టీలు మినహా) నాయకులందరూ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారే.

వచ్చిన వారిని తమ పార్టీల్లో చేర్చుకున్న వారే. ప్రలోభాలకు ఎవరు లొంగుతారు. ఎవరిపై ఎలాంటి వల/ఎర వేసే అవకాశాలుఏ మేరకు ఉన్నాయి. సామ,దాన,భేద దండోపాయాల్లో దేనికి లొంగుతారు అని యత్నించిన వారే. ఆ పార్టీని అస్థిరపరచడం, తద్వారా వారి పార్టీని అధికారం నుంచి తొలగించడం, ఆ అధికారాన్ని సొంతం చేసుకోవడం లక్ష్యoగా జరిగిన ఫిరాయింపులే. అందరివీ అవకాశవాద వాదాలే. అధికార రాజకీయాలే.ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను సాదరంగా ఆహ్వానించినవారే. అక్కున చేర్చుకున్నవారే.తమ వైరి పక్షాన్ని ఇబ్బందుల పాల్జేసిన వారే. బీజేపీలో టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల విలీనం. మధ్య ప్రదేశ్ లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల ద్వారా అధికారం సొంతం చేసుకున్న ఉదంతం. ఏపీలో గత శాసన సభలో 23 మంది ఎమ్మెల్యేల బహిరంగ కొనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం. లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది.

జాతీయ అధికార బీజీపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు .. తెలంగాణలోని అధికార ప్రతిపక్ష పార్టీలు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తో సహా వేటికి మినహాయింపు లేదు. రాళ్లతో కొట్టి చంపమని పిలుపు నిచ్చిన ఈ నాయకుడి నిజాయితీ కూడా శుద్ధమైనది ఏమీ కాదు. ఈయన గారు టీడీపీ నుంచి నాడు ఎమ్మెల్యేగా గెలిచారు. పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి ఆ లేఖను తమ పార్టీ అధ్యక్షుడికి మాత్రమే అందజేసి కాంగ్రెస్ లో చేరారు. పదవీ కాలం అయిపోయేంత వరకు ఎమ్మెల్యేగా కొనసాగారే తప్ప స్పీకర్ కు రాజీనామాను అందజేసి ఆమోదింపజేసుకోలేదు. అలా చేసి ఉండిఉంటే ఆయన నిజాయితీ కొంత మేరకైనా ప్రశ్నార్థకం అయి ఉండేది కాదు. రాళ్ళ తో కొట్టమని ఇచ్చిన పిలుపునకు కొంత విలువ ఉండేది.

కానీ ఆయన గారు అలా చేయలేదు. ఈ సారుగారికి మరో డిగ్రీ కూడా ఉన్నది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే ఓటును రూ 5 కోట్లకు బేరం కుదుర్చుకొని, రూ.50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ రెడ్ హ్యాండెడ్ దొరికి పోయిన డిగ్రీ ఆయన కీర్తి కిరీటంలో ధగధగా మెరిసిపోతున్నది. ఏళ్లుగా ఆ కేసు కోర్టులో విచారణ దశలో మాత్రమే ఉన్నది.ఇదంతా ఇలా ఉండగా…ఇప్పుడు అందరూ ఆశ్చర్యకరంగా సుద్దపూసల్లా మాట్లాడుతున్నారు. నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ఎనలేని గౌరవాన్ని ప్రకటిస్తున్నారు. వ్యవస్థను,సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.

మేమంతా “శాకాహారులమే” కదా “రొయ్యల బుట్ట”  ను ఎవరు మాయం చేశారు? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నటనను, వీరి మాటలను విశ్వసించే అమాయక స్థితిలో ప్రజలేమీ లేరు. కానీ ఓటరు అధికారం .. ఒక్క పోలింగ్ రోజుకు మాత్రమే పరిమితం చేశారు కదా. పోలింగ్ సమయంలో మినహా ఓటరుకు ఎలాంటి అధికారాన్ని లేకుండా చేసేసారు వీరంతా కలిసి. ఓటరుకు ఉన్న ఈ ఒక్క రోజు అధికారమే ప్రజాస్వామ్యంతో ఆటలాడుకునేలా అవకాశం ఈ రాజకీయ నాయకత్వానికి కల్పించింది. చట్టంలోని సాంకేతిక అంశాలు,లొసుగులతో ఆటలాడుకుంటూ ఎన్నికలు, ప్రజాప్రాతినిధ్య చట్టంతో ఆడుకుoటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వస్తున్నారు. ఓటరులో చైతన్యం వచ్చి వీరిని నడిరోడ్డుపై నిలదీసేంత వరకూ ఈ “రొయ్యల బుట్టలు ” మాయమవుతూనే ఉంటాయి. వారు కూడా ప్రజాస్వామ్య ఉద్ధారకులుగా చలామణి అవుతూనే ఉంటారు మరి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!