Bharadwaja Rangavajhala …………………………………….
ఆ కమల్ హసనూ రజనీకాంతూ ఆళ్ల సినిమాల్లో పాటలు భలే ఉంటాయిరా … మన రామారావూ కృష్ణా సినిమాల్లో పాటల్లా కాకుండా …ఈ డైలాగ్ కొట్టింది ఎక్కడా విజయవాడ చుట్టుగుంట సెంటర్లో. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ ఉన్న చోటులో అప్పట్లో మామిడి తోటలు ఉండేవి కదా … వాటి ముందు పాక హోటల్ ఉండేది.
అందులో టీ తాగుతా అన్నమాట …అక్కడ టేపు రికార్డర్ లో దాన్ని డెక్కు అనేవారు. అందులో పాటలు పెట్టేవాళ్లు. ఇదంతా 1977-78 ప్రాంతాల్లో అన్నమాట … అలాగే శాంతి హాలు క్యాంటీన్ లో కూడా రిలీజ్ అవబోయే సినిమాల క్యాసెట్లు తెచ్చి ప్లే చేసేవారు. టీ తాగడం కోసం కాదు పాటలు వినడానికే వెళ్లే వాళ్లం అక్కడకి .. టీ తాగడం అనేది కేవలం సాకే.
విని .. ఏ సినిమాలో పాటలివీ అని అడిగి తెల్సుకుని … ఊర్వశీ హాలు కాడ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్ ఉండేవి కదా .. అక్కడకు పోయి ఈ పాటలన్నీ ఓ క్యాసెట్ లో వేయించుకుని ఇంటికి పోయి వినేవాళ్లం.. ఫిలిప్స్ టేపు రికార్డరులో …ఈ కష్టాలు పడుతున్న సమయంలోనే కనిపెట్టాం.
ఎమ్మెస్వీ అనబడే ఎమ్మెస్ విశ్వనాథనూ, ఇళయరాజా అనే ఇద్దరు వీళ్ల సినిమాలకు సంగీతం అందిస్తున్నారనీ వారి సంగీతం మన రెగ్యులర్ సంగీతానికి భిన్నంగా ఉంటోందని అర్ధమైంది. అప్పటికి తెలుగులో వెరైటీగా అనిపించిన “రామచిలుకా పెళ్లి కొడుకెవరే “పాటా … “సిరిమల్లెపూవా “, రెండూ ఇళయరాజా అనేవాడు చేసినవే అనీ మన సత్యం , చక్రవర్తి వాటిని తెలుగైజ్ చేశారని తెల్సింది … అలా నెమ్మదిగా ఇళయరాజా అనేవాడి మీద కాస్త ఇంట్రస్టు మొదలైంది.
సరిగ్గా అలాంటప్పుడే రజనీకాంత్ కమల్ హసన్ నటించిన వయసు పిలిచింది అను చిత్రము శైలజానందు విడుదలయెను. అందులో “మబ్బే మసకేసింది లే” అను గీతమూ … “జీవితం మధుశాలా” అను గీతమూ “హల్లో మైరీటా ఏమైంది నా మాటా ” పాటలు బాగా నచ్చేశాయి.. ఎందుకు మన పెద్ద హీరోలు ఈళ్లని పెట్టుకోరూ అని అనుకుంటూ ఉండగా … ముల్లుపువ్వు వచ్చింది.
“రాముడు రాజైన రావణుడు రాజైన మన కథమారదురా “అంటూ ఓ పాట ఆవేశపరచింది. దానికి ఇళయరాజాతో పాటు ఎల్.వైద్యనాథన్ కూడా సంగీత దర్శకుడు…”జీవన పోరాటంలో” అనే ఓ తొక్కుడు హార్మనీ గీతం వైద్యనాథన్ చేసింది కూడా భలే ఉంటుంది. ఇట్టా నడుస్తూండగా … ఎన్టీఆర్ యుగంధర్ కి ఇళయరాజా సంగీతం అనే మాట విని భలే ఉందే అనుకున్నాన్నేను. ఫాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
సత్యం ను పెట్టేసుకునుండుంటే … హాయిగా డాన్ పాటలే తెలుగు చేసి అదరగొట్టేవాడు కదా … ఈడెవడో ఇళయరాజా అంట సర్వనాశనం చేశాడు అని దుర్గాకళామందిరం దగ్గర ఎన్టీఆర్ ఫాన్స్ ఆవేదన. పాటలు విన్నా నాకు నచ్చాయి … అసలు ఈ ప్రాజెక్ట్ లోకి ఇళయరాజా రావడం వెనకాల దర్శకుడు పి.వాసు హస్తం ఉంది. నిర్మాత మరియు ఎన్టీఆర్ పర్మినెంట్ మేకప్ మేన్ పీతాంబరం కుమారుడే పి.వాసు.
తను పట్టుబట్టి ఇళయరాజాను పెట్టించాడు ఆ సినిమాకి. నిర్మాత వత్తిడికి లొంగి ఒక్క పాట మాత్రం ఒరిజినల్ నుంచీ కాపీ చేసి మిగిలినవన్నీ తను అనుకున్న పద్దతిలో కంపోజ్ చేశాడు రాజా. సినిమా విడుదలయ్యాక పాటలే కాదు … రీరికార్డింగు కూడా అదరగొట్టేశాడు ఇళయరాజా. సరిగ్గా ఆ సమయంలోనే కాస్త అటూ ఇటూగా సీతాకోకచిలుక వచ్చింది. దాని శతదినోత్సవ వేదిక మీద విశ్వనాథ్ మాట్లాడుతూ తానూ త్వరలో ఇళయరాజా తో పని చేయబోతున్నట్టు చెప్పాడు.
సాగరసంగమం పాటలు వింటుంటే మొదట కొంత మహదేవన్ టచ్ కనిపించినా ఇళయరాజా కూడా బలంగా విపిపించాడు. క్రమంగా కె.ఎస్ రామారావు తన డబ్బింగ్ సినిమాల ప్రభావం వల్ల అభిలాష సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. అలా స్ట్రెయిట్ సినిమాల్లో ఇళయరాజా ప్రభ మొదలైంది.
వంశీ ప్రేమించు పెళ్లాడు పాటలు టీకొట్ల దగ్గర తెగ మోతమోగాయి. మహర్షి … దానికి ముందు లేడీస్ టైలర్ … నెమ్మదిగా రాఘవేంద్రరావు కూడా చక్రవర్తి నుంచీ బయటకు వచ్చి … ఇళయరాజా దారి పట్టేయడానికి ప్రయత్నిస్తున్న వేళ …పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , దొంగమొగుడు లాంటి సినిమాలతో తన జోరు తక్కువ కాలేదని చక్రవర్తి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జగదేకవీరుడు అతిలోక సుందరి వచ్చేవరకూ చక్రవర్తి ప్రభ పూర్తిగా మసకేయలేదు.
ఇళయరాజా సందడ్లో రాజ్ కోటి సడేమియా అనిపించేయడం మొదలయ్యాకే చక్రవర్తి రెస్ట్ తీసుకోక తప్పలేదు. అలా మొదలైపోయిన ఇళయరాజా ప్రభంజనం రెహమాన్ ప్రవేశం వరకూ తెలుగునాట కూడా కొనసాగింది. అయితే రెహమాన్ ఇళయరాజాలా కాకుండా దక్షిణాది సంగీత సరిహద్దులు చెరిపి జై బాలీవుడ్ అనేశాడు.
దీంతో కీరవాణి, మణిశర్మ లాంటి కొత్త కుర్రాళ్లు వచ్చేశారు … ఇక ఆ పాదుల్లోంచీ వరసగా కీబోర్డుప్లేయర్ సంగీత దర్శకులు వచ్చేశారు. ఈ లోగా క్యాసెట్లు సీడీలయ్యాయి పెన్ డ్రైవులయ్యాయి. ఇప్పుడు డౌన్ లోడ్ లయ్యాయి. అయినప్పటికీ …. టీ కొట్ల దగ్గర టీలు తాగుతూ పాటలు వినడం …. అనే చుట్టుగుంట , గాందీనగర్ శాంతి థియేటర్ అనుభవాలే అనుభవాలు.
క్యాసెట్ రికార్డింగ్ కి రెండు రోజులు మూడు రోజులు టైమ్ పెట్టడం …వాటి కోసం పది సార్లు తిరిగి తెచ్చుకోవడం … అసలు ఆడియో క్యాసెట్లు అద్దెకివ్వడం … వాటిని తెచ్చి జాగ్రత్తగా విని వెనక్కివ్వడం … టూ ఇన్ ఒన్ లు … రేడియోల్లో వచ్చే పాటల్నిరికార్డు పెట్టడం … ఇలా అనేక ముచ్చట్లు … అన్నీ మూలకు పడిపోయాయి.