Emergency Atrocities…………………………….
సరిగ్గా 49 ఏళ్ళ క్రితం జూన్ 25 వ తేదీ … చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది. అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ అర్ధ రాత్రి హడావుడిగా ఎమర్జెన్సీ ని విధించారు.1975 జూన్ 25 రాత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని మంత్రిమండలి సమావేశమై ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయం తీసుకుంది.
ఇందిర ప్రతిపాదనకు మంత్రులెవరూ నో చెప్పలేదట. క్యాబినెట్ తీర్మానానికి అనుగుణం గా రూపొందించిన ఆర్డినెన్సు పై అప్పటి రాష్ట్ర పతి ఫక్రుద్దీన్ ఆలీ అహమ్మద్ అర్ధరాత్రి 12 గంటలకు కొద్దీ నిమిషాలకు ముందు సంతకం చేశారు.
ఎమర్జెన్సీ విధించినట్టు ఉదయం ఆరుగంటలకు ఆలిండియా రేడియో లో వార్తలు విని ప్రజలు తెలుసుకున్నారు. అప్పటికి ఎమర్జెన్సీ అంటే ప్రజలకు పూర్తిగా తెలీదు. తర్వాత రోజుల్లో అదేమిటో తెలిసింది. నాడు ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలింది.
1977 మార్చి ఎన్నికలలో ఇందిర ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. అంతకంటే ముందు దేశంలో రెండు సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారి 1962లో చైనాతో యుద్ధం జరిగినపుడు … 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలోనూ అత్యవసర పరిస్థితి ప్రకటించారు
ఎమర్జెన్సీ కాలంలో ఎదురు తిరిగిన విపక్ష నాయకులను జైళ్లలో బంధించారు. పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. పత్రికల్లో ఏం రాయాలి ? ఏమి రాయకూడదో అధికారులు చెప్పేవారు. అధికారులు ఒకే అన్న తర్వాతనే పత్రికలు ముద్రణకు వెళ్లే పరిస్థితి నెలకొన్నది.
ఈ నిరంకుశ పాలనకు నిరసనగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఎడిటోరియల్ ప్రచురించే కాలాన్ని ఖాళీగా ఉంచేది. ఇతర పత్రికలూ ఇదే మార్గాన్ని అనుసరించాయి. అప్పటి సమాచార శాఖా మంత్రి వీసీ శుక్లా ఎక్స్ ప్రెస్ మెడలు వంచాలని ప్రయత్నించారు.
ఎమర్జెన్సీ సమయం లో ఇందిర తనయుడు సంజయ్ గాంధీ చెలరేగిపోయారని అంటారు. ఆయన అండ చూసుకుని అనుచరులు మరీ ఘోరం గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. సంజయ్ సన్నిహితులు జగదీష్ టైట్లర్, కమల్ నాథ్ మరికొందరు సంతాన నిరోధక అపరేషన్లు బలవంతంగా చేయించారు.
21 నెలల కాలం లో 8.3 మిలియన్ ల మందికి ఆపరేషన్లు చేశారు.అప్పట్లో ఈ ఆపరేషన్ల వ్యవహారం దేశవ్యాప్తంగా అలజడి రేపింది.ఢిల్లీ లో జమా మసీదు,తుర్కుమన్ గేట్ ప్రాంతాల్లో మురికి వాడల నిర్మూలనకు బుల్డోజర్ ల తో పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించడానికి ప్రయత్నించగా స్థానికులు వ్యతిరేకించారు.
ఆ సందర్భంగా జరిగిన కాల్పుల లో 20 మంది మృతిచెందారు. సెన్సార్ షిప్ ఉండటం మూలానా వార్తలు ప్రచురితమయ్యేవి కాదు. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. చట్ట సభలను సుషుప్తావస్థలో ఉంచి దేశ అధ్యక్షుడి పాలనలో ప్రధాని ఇందిరాగాంధీ తన సలహాదారులు గవర్నర్ల ద్వారా పరిపాలన సాగించేరు.
————KNM
POST UPDATED JUNE 25 TH..2024