అడవి ..పులి కథల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటికి ఈ షేర్నీ కి చాలా తేడా ఉంది. సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా ఇది. అడవి ని ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు పులి భయంతో వణికిపోతుంటారు.
అపుడపుడు ఆ ఆడ పులి అడవి సమీపంలో సంచరించే వారిపై దాడి చేస్తుంటుంది. ఈ క్రమంలో పులిని చంపి ప్రజల ఓట్లను రాబట్టుకోవాలని రాజకీయ పార్టీ నేతల చేసే హడావుడి ..అందుకు సహకరించే కొందరు అధికారులు .. ఒక వేటగాడు… వారిని ఎదుర్కొని ఆ పులి ని…దాని పిల్లలను జూకి అప్పగించాలని తపన పడే ఫారెస్ట్ అధికారిణి చుట్టూ కథ నడుస్తుంది.
తమాషా ఏమిటంటే సినిమాలో పులి ఒకటి రెండుసార్ల కు మించి కనబడదు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు .. పులితో ఫైట్ లాంటి సీన్లు ఏమి ఉండవు. T 12 కోసం (సినిమాలో ఆడపులి పేరు ) అడవుల్లో వెతకటం .. దాని కదలికలను రికార్డు చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.
రాత్రివేళ పులి కోసం వెతికే సన్నివేశాలను బాగా తీశారు. సినిమా లో అడవి .. పులి జాడలను కనుగొనే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కథ ముందుకు సాగదు. ఏదో డాక్యుమెంటరీ చూస్తున్నామా అనిపిస్తుంది.
వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ పాలసీలు ఎలా అమలు జరుగుతున్నాయి ? అడవులకు దగ్గరగా ఉండే గ్రామ ప్రజలు ఇబ్బందులను .. వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే నేతల వికృత క్రీడలను దర్శకుడు చక్కగా తెరకెక్కించారు.
ఫారెస్ట్ శాఖ వాహనాలను దగ్ధం చేయడం, ఒక యువకుడు మాయమైతే అతని కోసం రాత్రివేళ అడవిలో గాలించే సన్నివేశాలు చాలా సహజంగా చిత్రీకరించారు. వేటగాడు పింటూ పులిని కాల్చి చంపడం .. తర్వాత ట్రాంక్విలైజర్ తో షూట్ చేసిన సన్నివేశం ఆసక్తికరంగా ఉంటాయి. పులిని కావాలనే చంపారని పై అధికారికి చెబితే, అతను విద్యా బాలన్ తో చూసి చూడనట్టు ఉండండి అన్న రీతిలో మాట్లాడే సీన్ ఆకట్టుకుంటుంది.
సినిమా మొత్తం మీద నిజాయితీ గల అధికారులను పనిచేయనివ్వరు అని విద్యాబాలన్ క్యారెక్టర్ ద్వారా దర్శకుడు చెబుతాడు. అదే సమయంలో అటవీ అధికారులు జంతు సంరక్షణ కోసం ఎలా పనిచేస్తారో చూపారు. సినిమా మొత్తం అడవిలోనే సాగుతుంది.
అడవి అందాలను కెమెరా మాన్ మనోహరంగా చూపారు. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. సినిమా నిడివి తగ్గిస్తే బాగుండేది. విద్యా బాలన్ ఫారెస్ట్ అధికారిణి పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ కు భిన్నంగా ఉండే కథతో తీసిన “షేర్నీ” ని చూడొచ్చు.