రమణ కొంటికర్ల…………………………………………………………
రేణికుంట రమేష్ పోస్టింగ్స్ ఇప్పుడు లక్షల్లో చూస్తున్నారని బల్ల గుద్ది మరీ స్పష్టంగా చెప్పలేం కానీ… వేలల్లో నెటిజనం మాత్రం చూస్తున్నారు. ఆయన హృదయం విదారకరమైనప్పుడు స్పందించే తీరుకు… ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులతో నెటిజనం నుంచీ అంతే స్పందనా, అదే ప్రతిస్పందనా మాత్రం వస్తోంది. సేవకు సోషల్ మీడియా కూడా ఓ మార్గమని పట్టిచూపించిన బహు కొద్దిమందిలో రమేషొకడనుకుంటా! అందుకే రమేష్ బాయ్ ఫ్రెండ్ గా నేనతడి కోసం రాస్తున్న ప్రేమలేఖ ఇది!!
రమేష్ ఎర్రితనం వర్ధిల్లాలి… రేణికుంట రమేష్ సోషల్ సర్వీసూ వర్ధిల్లాల్లి… రమేష్ పిచ్చి మరింతమందికి పిచ్చి పట్టించే స్ఫూర్తవ్వాలి! రమేషెక్కడో పక్క రాష్ట్రంలోనో… లేక, ఫ్రాన్స్ లోనో పుట్టిన ప్రత్యే’కథేం’ కాదు. జస్ట్ పల్లెటూరి పిల్లగాడు. మండల కేంద్రానికి పక్కనే ఉన్నా… కనీసం రోడ్డు లేని రోజుల్లో… సైకిల్ మీద చదువుకోసం, తనకిష్టమైన క్రికెటాట కోసం ఉరుక్కుంటూ… తన పల్లెటూరైన దమ్మనపేట నుంచి పక్కనే ఉన్న ధర్మపురి మండల కేంద్రానికి వచ్చేవాడు.
ఆర్డీనరీ పర్సన్ కు ఓ నిలువెత్తు ఉదాహరణ. మన పక్కింటి శివడో… ఏ రవిలాగో అన్నమాట! నిజానికి ముందు చెప్పుకున్నట్టు ఏ ఫ్రాన్సో.. ఏ శానిఫ్రాన్సిస్కోనో అని రాస్తే దర్జాతనం ఉట్టిపడేదేమో… పైగా ఇవాల్టి జనమందరికీ బాగా ఎరిగిన పేర్లూ అయ్యుండొచ్చునేమోగూడా! కానీ రమేష్ దమ్మనపేటలోనే పుట్టాలన్నది ఆ విధాత సంకల్పం.. ఏంచేస్తాం మరి..?!!
ఎక్కడుంది దమ్మన్నపేట..? మన తెలంగాణాలనె! అదీ జైతాల జిల్లా ధర్మపురి మండలంల!! రమేష్ లాగా చదువుకున్నోళ్లు ఇవాళ బానే ఉన్నప్పటికీ… ఇప్పటికీ చాలామందికి దమ్మనపేట అంటే అందరికీ తెలియకపోవచ్చునేమో..?!! అలా అని దమ్మనపేట స్థలమహత్యమేం చెరిగిపోదుగా..?!! పైగా రమేష్ లాంటోళ్లతోని ఆ ఊరూ ఇప్పుడు ఫేమసైపోతోంది.
అలా అని రమేషేం సింగిల్ రోడ్డు కూడా సరిగ్గాలేని తన ఊరికి రోడ్డేద్దామని యోచించిన దశరథ్ మాంజీ కాదూ… చిప్కో వంటి ఉద్యమం చేపట్టినటువంటి సుందరలాల్ బహుగుణంత గొప్పోడు కాదు.. కానీ, పేద, సామాన్య, మధ్య తరగతి ఈతిబాధలకు ప్రతిస్పందిస్తూ… నేటివిటీని మించి యోచించే హృదయం కలవాడు.
రమేషంటే ఏ స్వచ్ఛందసంస్థ పేరిటో… ప్రభుత్వాల నుంచో, లేక పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీల నుంచో ఫండ్స్ తీసుకుని సేవనో దందాగా చేసిన వ్యక్తీ కాదు… అలా అని.. చాలా గొప్పగా చెప్పుకోవడానికి సోనూసూదంత వ్యక్తిగత సాయమూ చేయలేడు.. కానీ, ఎవరికైనా సాయం చేయడానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం మాత్రం చేయగలడు.
ఎందుకంటే తాను చేయాలనుకున్న సాయానికి నాల్గు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి కాబట్టి! అంతేకాదు ఆ దాతల సాయాన్ని అంతే పారదర్శకంగా ఖర్చు చేసిన ఆధారాలనూ చూపించగల నిజాయితీ రమేష్ ది కాబట్టి. నేరుగా బాధితులకే ఆ సాయమేదో చేసేవాళ్ల నుంచి అందేలా చేసి… వారి సేవలో తరించే ఆత్మసంతృప్తి చెందే మనస్తత్వం కాబట్టి!!
ఏ సాయం చేస్తే ఎంత ఎంత పేరొస్తుంది… సాయం పెద్దదా చిన్నదా అంటూ లెక్కలు వేసుకునే కార్పోరేట్ స్వచ్ఛంద సంస్థల లెక్కలస్సలుండవిక్కడ. రోడ్డుమీద తిండీ, కనీసం నీళ్లు కూడా లేని బిచ్చగత్తైనా… క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబమైనా… ఏ ప్రభుత్వమో, మనసున్న మారాజులో చేయ్యేస్తే బతికి బట్టకడుతున్న కుటుంబ గాధలైనా… అవే రమేష్ సోషల్ మీడియా ద్వారా… మరీ ముఖ్యంగా తన ఫేస్ బుక్ వేదికగా చేసే ఓ చిన్న వితరణ… కానీ అదే మార్కెట్ సర్వేలకందని ఎన్నో కుటుంబాల బతుకుచిత్రాన్ని మార్చే ఓ పేద్దసాయం కూడానూ!!
డబ్బూ, ప్రమోషనూ, పింఛనూ, గ్రాట్యుటీ ఇలాంటివేవీ రానీ ఈ రంగాన్నెందుకెంచుకున్నాడీ పిచ్చిమాలోకమని నాలోంటోళ్లనుకుంటున్నా… దాన్ని తదేకదీక్షలా కొనసాగిస్తున్న రమేష్ సేవాయజ్ఞం చూస్తే ముచ్చటేస్తోంది! రమేష్ సేవ ఏ మదర్ థెరీస్సా అంత పేరుగాంచకపోవచ్చు.
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలోనూ ఎంతో కొంత డబ్బులు దిగమింగే భూత, ప్రేత, పిశాచాలావహించిన తరీకంతకన్నా కాదు… స్వచ్ఛందసంస్థల పేరిట డబ్బును దిగమింగేటువంటి చేతబడికి గురైనవాడూ కాదు… సామాన్యుల పాలిట ఆలోచించే మరో సామాన్యుడు… ఒకవేళ తాను చేసే మంచిలోనూ ఎవరైనా తప్పులు వెతికితే అనవసరమైన ప్రేలాపనలను పట్టించుకోకుండా తన యజ్ఞాన్ని కొనసాగించే పవిత్ర ప్రయత్నం చేసే ఓ ఆర్ధ్రత కల్గిన హృదయం రమేష్!
ఇప్పటికే ఐదేళ్ల కాలం నుంచీ 83 పేద కుటుంబాలకు విద్యావైద్యం కోసం ఒక కోటి ఐదులక్షల సాయమందేలా చూసి.. గూడు లేని నిరుపేదలకు సకల వసతులతో ఓ 24 ఇళ్లు కట్టించిన రమేష్ సామాజిక బాధ్యత స్పష్టంగా కళ్లముందు కదలాడుతోంది. సోషల్ మీడియాలో నేతలపై అభిమానంతో కామెంట్స్ పెడుతూ లైకులందుకోలేనోడు..
ఏది పడితే అది షేర్ చేసి కాపీ అండ్ పేస్ట్ చేయలేనోడు… ఇతరులు పెట్టిన పోస్టులకు కామెంట్స్ పెడుతూ బీభత్సమైన ట్రోలింగూ, మీమ్స్ నూ సృష్టించలేనోడు… అసలు నేటి సోషల్ మీడియా వైఖరికే భిన్నమైన మనస్తత్వం కల్గినోడు… ఒక్కమాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉండేందుకు సంపూర్ణమైన అనర్హుడు… కానీ అదే సోషల్ మీడియా ద్వారా ఎందరిపాలిటో దేవుడైన అనన్య సామాన్యుడైన నూటికి నూరుపాళ్ల అర్హుడు మా రేణికుంట రమేష్!.
అందుకే సేవల్లోనూ పోటీపడుతున్న కార్పోరేట్ కాలంలో… అదే సేవతో అంతో ఇంతో పేరు సంపాదించుకున్న ఎలాంటి లాభమాశించని మా రమేష్ పిచ్చితనం వర్ధిల్లాలి… అందుకే రేణికుంట రమేష్ అమాయకత్వం, మొండితనం జిందాబాద్.