భండారు శ్రీనివాసరావు ………………………………………………….
He is collecting all the old things ………. పేరు అనిరుద్ కానీ ‘నా పేరు అనిరుద్ విజయ కుమార్’ అంటాడు…బాండ్! జేమ్స్ బాండ్ లాగా.తండ్రి పేరు అసలు పేరుకు తగిలించుకునే సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో వుంది. తమిళనాడు దీనికి మంచి ఉదాహరణ. కానీ ఈ అనిరుద్ పదహారు అణాల తెలుగువాడు. ‘నాకు నా తండ్రి అంటే గౌరవం. పలానా వారి అబ్బాయిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం” అంటాడు అనిరుద్.మిలిటరీ వారసత్వం. రూపంలో ఆ గంభీరత కనబడుతుంది. ‘నేను నాలా జీవిస్తాను, ఒకరిలా, లేదా మరొకరికి ఇష్టం అయ్యే రీతిలో జీవించడం నాకు అస్సలు ఇష్టం వుండదు అనేది అనిరుద్ ఫిలాసఫీ.
పాత వస్తువులు ఇష్టం. పాత సామాగ్రి ఇష్టం. పాత సినిమాలు ఇష్టం. పాత పాటలు ఇష్టం. ఇలా పాతలో కొత్తని వెతుక్కోవడం ఇష్టం. ఆ వెతుకులాటలో బోలెడు పాత వస్తువులు పోగేసాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన వింటేజ్ వనం అని పేరు పెట్టుకున్న తన ఫాం హౌస్ లో ఎక్కడ చూసినా ఇవే. ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు పాత వస్తువు దొరుకుతుందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి దానిని దొరికించుకునేదాకా నిద్రపట్టదు.
Once upon a time there was a……. పెద్దలు పిల్లలకు ఇంగ్లీష్ లో చెప్పే నీతి కధలన్నీ చాలావరకు ఇలాగే మొదలవుతాయి. అలాగే తెలుగులో కూడా అనగనగా ఒక రాజు, ఒక పేదరాశి పెద్దమ్మ అంటూ చిన్నప్పుడు మన బామ్మలు కధలు చెప్పడం చాలామందికి గుర్తుండే వుంటుంది. ఒకప్పుడు అలా వుండేది అని ఈనాటి తరం తెలుసుకోవడానికి, తెలపడానికి అనిరుద్ విజయకుమార్ హైదరాబాదు పొలిమేరల్లో ఒక వింటేజ్ వనం ఏర్పాటు చేసుకున్నాడు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ వింటేజ్ వనం వుంది. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి వుంది.
“ There are no strangers here, only friends you have not met” అని రాసి వుంటుంది.అలాగే అక్కడ ఇంతకు ముందు పరిచయం లేని ఇద్దరు కళాకారులు కనిపించారు. ఎన్నాళ్ళ బట్టో నాకు స్నేహితులు అన్నంతగా వాళ్ళు చాలా కలుపుగోలుగా మాతో కలిసిపోయారు. ఒకరు Aqeel. ప్రసిద్ధ తెలంగాణా చిత్రకారుడు అజీజ్ గారి కుమారుడు. ఆయన దగ్గర చిత్రకళ అభ్యసిస్తున్న దివ్య అనే అమ్మాయి. మరొకరు కన్నన్. వంటల్లో ప్రవీణుడు. అక్కడ క్యాంటీన్ వంటివి లేవు. వాళ్ళే వాళ్లకి కావాల్సినవి వండుకుని తింటారు. వాళ్ళ ప్రాధాన్యత వేరే.
అడవిలా ప్రశాంతంగా వున్న ఆ ప్రదేశంలో చిత్రాలు గీసుకుంటూ, కవిత్వాలు రాసుకుంటూ సమయాన్ని గడిపేస్తారు. అక్కడ ఉండగానే వాళ్ళు ఒక గోడ చిత్రం మొదలు పెట్టారు. ఎర్రటి ఎండలో నిలబడి దాదాపు నాలుగు గంటలు కష్టపడ్డారు. ముందు ఓ కోడి పుంజు బొమ్మ గీస్తున్నారేమో అనిపించింది అవుట్ లైన్ చూసినప్పుడు. పూర్తయిన తర్వాత చూస్తే అది ఓ అమ్మాయి చిత్రం. చుట్టూ చెట్లు, మధ్యలో ఆధునిక వసతులు వున్న అతిథి గృహాలు. అవి కూడా ప్రి ఫాబ్రికేటెడ్.హాయిగా గుండెల నిండుగా ఆక్సిజన్ దట్టించుకుని మళ్ళీ ఇంటికి చేరాము.థాంక్స్ అనిరుద్ విజయ్ కుమార్!