Right time to earn profits …………………………………..స్టాక్ మార్కెట్లో లాభాలకు అమ్మకాలే కీలకం. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నపుడే అదను చూసి షేర్లను అమ్ముకోవాలి.అంతే గానీ షేర్ ధర మరింత పెరుగుతుందని కూర్చోకూడదు. ప్రస్తుతం సెన్సెక్స్ 50 వేల మార్కును,నిఫ్టీ 15 వేల పాయింట్లను దాటాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూలతలు, దేశంలో కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడం వంటి పరిణామాలు మార్కెట్ పెరుగుదలకు దోహద పడ్డాయి. మార్కెట్ పెరుగుతున్నపుడే చిన్న ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవాలి. డబ్బును ప్రేమించాలి కానీ షేర్లను ప్రేమించకూడదు.
స్టాక్ మార్కెట్లు ఎందుకు పెరుగుతాయో? ఎందుకు పతనమౌతాయో ఒక్కోసారి విశ్లేషకులకే అర్ధం కాదు.స్వల్ప విషయాలకే మార్కెట్లు పతనమైన ఉదాహరణలు కోకొల్లలు.అందుకే ఇన్వెస్టర్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి.కొనుగోలు చేసిన షేర్ల ధరల్లో కదలిక వున్నపుడు మార్కెట్ ట్రెండ్ ను అనుసరించి వెంటనే షేర్లను అమ్మేసి సొమ్ము చేసుకోవాలి అదనులో తొందరపడక పోతే అవకాశం పోగొట్టుకున్నందుకు తర్వాత విచారించాలి. చాలామంది ఇన్వెస్టర్లు ధర మరింత పెరుగుతుందని వేచి చూసే ధోరణి కి అలవాటు పడి వుంటారు. ఈ అలవాటుకి స్వస్తి చెబితే మంచిది.
దీర్ఘకాలం లో ఘనమైన రాబడులు అందుకోవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తుంటారు.షేర్లను ఏడాది పాటైనా ఉంచుకోక పోతే ఎలా ? అని ప్రశ్నిస్తుంటారు అయితే స్టాక్ మార్కెట్ ధోరణుల్లో కాలానుగుణం గా మార్పులొచ్చాయి.గతం లో మాదిరిగా ఇపుడెవరూ పెట్టుబడిని ఒకే షేర్ లో ఉంచడం లేదు. స్వల్ప కాలిక కొనుగోళ్ళు.. అమ్మకాల పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీర్ఘ కాలమంటే ప్రస్తుతం అయిదు లేక ఆరు మాసాలే. ఆ పీరియడ్ లో షేర్ల ధరలు పెరగక పోతే నష్టానికైనా వదిలించుకోవడమే మంచిది. పెరుగుదల లేని షేర్లను పోర్ట్ ఫోలియోలో ఉంచుకోవడం వల్ల నష్టం తప్ప లాభం వుండదు.
ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన షేర్ల ధరలు ఎలా వున్నాయో ఎప్పటి కపుడు పరిశీలించు కోవాలి.నిత్యం షేర్ కొటేషన్లను స్టడీ చేయడం మరీ మంచిది.అంతే కానీ ప్రతి విషయానికి బ్రోకర్ల పై ఆధార పడకూడదు.అలాగే షేర్ల తాలూకు కంపెనీల వార్తలను కూడా గమనించాలి. ముఖ్యం గా విస్తరణ, వివిదీకరణ, ఫలితాల ప్రకటన సమయాల్లో షేర్ల ధరలు పెరిగే అవకాశాలుంటాయి. ఆ సమయంలో మార్కెట్ సెంటిమెంట్ మెరుగ్గా వుంటే అప్ ట్రెండ్ కొనసాగవచ్చు.ఆలాంటి సమయంలోఅమ్మకాలు చేపడితే లాభాలు వళ్ళో వచ్చి వాలుతాయి . కాబట్టి ఇన్వెస్టర్లు సరైన సమయం లో షేర్లను విక్రయిస్తే లాభాలను అర్జించవచ్చని గుర్తుంచుకోవాలి.
—————–KNM