A Real Covid Hero ……………………………….తండ్రి కరోనా సోకి చనిపోతేనే మృత దేహాన్ని తీసుకోవడానికి భయపడుతున్న రోజులివి. తల్లి కి కరోనా సోకిందని ఊరు బయట వదిలివేసే వెళ్లే బాధ్యత లేని కూతుళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో .. దేనికి భయపడక 1100 మృత దేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు జరిగేలా చూసిన మంచి మనసున్న మనుష్యులు కూడా ఉన్నారు. కరొనాతో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే తానే మానవత్వం తో దగ్గరుండి అంత్యక్రియలు జరిగేలా చూస్తున్నారు ఆ మానవతావాది.
ఆయన పేరు రాకేష్ కుమార్. ఢిల్లీ పోలీసు విభాగంలో ASI గా పనిచేస్తున్నారు. 56 ఏళ్ళ రాకేష్ కుమార్ అంబులెన్సు లలో వచ్చిన డెడ్ బాడీని దహన వాటిక లోపలికి తరలించడం దగ్గరనుంచి అన్ని పనుల్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాకేష్ కుమార్ గొప్ప సహాయమే చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మే 7న జరగాల్సిన తన కుమార్తె పెళ్లి కూడా వాయిదా వేసుకుని కరోనా బాధితుల అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1100 మంది బాధితుల అంత్యక్రియలు ఆయన నిర్వహించారు. ఇందులో 50 మంది చితికి తానే స్వయంగా నిప్పటించారు.
రాకేష్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. రాకేష్ కుమార్ కి ముగ్గురు పిల్లలు. కుటుంబం తో నిజాముద్దీన్ పోలీస్ బ్యారక్ లో ఉంటున్నారు. రాకేష్ కుమార్ చేస్తున్న సేవను ఢిల్లీ పోలీస్ విభాగం అభినందించింది.ఇందుకు సంబంధించిన వీడియో ను కూడా ట్విట్టర్ లో పెట్టింది. ఏప్రిల్ 13 నుంచి రాకేష్ కుమార్ లోధి రోడ్ లో ఉన్న శ్మశాన వాటికలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రాణాలకు తెగించి అంకిత భావంతో రాకేష్ కుమార్ అందిస్తున్న సేవలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పోలీస్ విభాగం కూడా భవిష్యత్తులో అతనికి ప్రమోషన్ ఇచ్చి అవార్డులు -రివార్డులు ప్రకటించాలని కోరుకుందాం.