Omkareshwar Temple ……………………
దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్నది. మామూలుగా అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రం లో కలుస్తుంటాయి. ఇక్కడ నర్మదా నది మాత్రం పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదే ఈ క్షేత్రం యొక్క విశేషం గా చెబుతారు.
ఇక్కడ నర్మదా నది రెండు పాయలుగా చీలి నర్మదా, కావేరిగా ప్రవహిస్తుంది. ఈ రెండు చీలికల మధ్యన ఉన్న ప్రదేశాన్ని’శివపురి’ గా పిలుస్తారు. ఓంకారేశ్వర లింగానికి తలపైన ఉన్న చీలిక లో నుంచి అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది. నర్మదా నది రెండు కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తుంది.
ఆకాశంలోనుండి చూసినపుడు “ఓం” కార రూపంలో ఈ నది కనిపిస్తుంది. అందుకే ఈ స్వామికి ఓంకారేశ్వరుడిగా పేరు వచ్చిందని చెబుతారు.ఈ ప్రధాన ఆలయంలో పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారీశ్వర్, గుప్తనాథ్ పేర్లతో వివిధ ముఖాలయాలు ఉన్నాయి. ఈ అయిదు ఆలయాలను పంచలింగ ధామాలుగా పిలుస్తారు.
మొదట ఓంకారేశ్వరుడిని, అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందని పురాణ కథనాలు చెబుతున్నాయి.పురాణ కాలంలో పరమ శివ భక్తుడైన మాంధాత రాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను చేపడతాడు. నర్మదా నదీ పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి జాలువారుతూ ఆ ఓంకారేశ్వరున్ని నిత్యం అభిషేకిస్తాయి.
మాంధాత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు. ఈ ప్రదేశాన్ని ‘ఓంకార మాంధాత’గా కూడా పిలుస్తారు. ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మునులెందరో తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి.
ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాతి కాలంలో పలు రాజ వంశస్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. రాణి అహల్యాదేవీ హోల్కర్ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయించారు. ఇక్కడి ఆలయ గోపురం ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలు జరుగుతాయి.
ఓంకారేశ్వర దర్శనం తర్వాత భక్తులు నర్మదా నది అవతల వైపు ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మమలేశ్వర ఆలయంలో కూడా ఉప ఆలయాలు ఉన్నాయి. గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ స్వామివారినే అమలేశ్వరుడు అని కూడా పిలుస్తారు.
ప్రతి ఏటా ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళా విశిష్టమైన ఉత్సవం. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళ తాళాల నడుమ జలవిహారం చేస్తారు. అనంతరం నదీ మధ్యలో ఒకచోట ముమ్మార్లు ప్రదక్షిణం చేస్తారు. ఈ దృశ్యాలు భక్తులకు కనులవిందు చేస్తాయి. శ్రావణమాసంలో చివరి సోమవారం జరిగే ఈ వేడుకకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ఈ క్షేత్రం 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముంబయి, ఢిల్లీ , గ్వాలియర్, భోపాల్ నుంచి ఇండోర్ కు విమాన సర్వీసులు ఉన్నాయి. ఇండోర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో రాట్లాం-ఖాండ్వాకు రైలు మార్గం ఉంది. దిల్లీ ముంబయిల నుంచి కూడా రైలు సౌకర్యం ఉంది. ఇండోర్ నుంచి ఉజ్జయిని, ఖాండ్వాకు బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. జీవితం లో ఒకసారైనా చూసి రావాల్సిన క్షేత్రమిది.
————- Theja