ఆయన్నిఎందుకు చంపాలనుకున్నారు ?

Sharing is Caring...

Escaped from many assassination attempts..………………………..

ఆయనపై  638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో.

క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ యోధుడు. గండర గండడు. అర్ధ శతాబ్దం పాటు క్యూబాను ఒంటి చేత్తో పరిపాలించిన ఆయన… 2008లో అధికార పగ్గాలను తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అప్పగించారు.1926 ఆగస్టు 13న జన్మించిన ఆయన పూర్తి పేరు ఫిడెల్ అలెహెంద్రో క్యాస్ట్రో రుజ్.

సంపన్న రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ ఫిడెల్ వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులైనారు. విద్యార్థి దశనుంచే సామ్రాజ్యవాద వ్యతిరేక ఆలోచనల్లో ఉండేవారు. క్యూబాలో విప్లవోద్యమాన్ని రగిలించిన నేతగా ఆ దేశీయులు గర్వంగా ఇప్పటికి చెప్పుకుంటారు. విప్లవ భావాలు  ఉగ్గుపాల దశనుంచే ఆయనకు వంట పట్టాయి. ఫిడెల్ తమ్ముడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి 1953లో అప్పటి క్యూబా మిలటరీ నియంత ఫుర్జెసియో బటిస్టాపై దాడి చేశారు.

ఈ దాడిలో తమ్ముడితో కలిసి బందీగా చిక్కిన ఫిడెల్‌ కారాగార శిక్ష అనుభవించాడు. రెండేళ్ల తర్వాత క్షమాభిక్షతో బయటపడ్డారు. రౌల్, చేగువేరాలతో పాటు ఎంతోమంది యువతను చేరదీసారు. వారందరికీ గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చారు. సుశిక్షితులైన గెరిల్లా దళంతో ఫిడెల్.. 1959, జనవరి 9న బటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా యుద్ధంతో గద్దె దింపారు.

1959 లో కేవలం 33 ఏళ్ల వయసులో క్యూబా త్రివిధ ధళాల అధిపతి పగ్గాలు చేపట్టిన ఫిడెల్ నెల రోజుల్లోనే ఆ దేశ ప్రధానిగా అధికారం చేపట్టారు. నాటి నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా పనిచేసిన ఫిడెల్.. 1976 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా క్యూబాను ముందుకు నడిపారు.

ఫిడెల్ అమెరికా సామ్రాజ్య విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన ప్రధమ శత్రువుల జాబితాలో చేరిపోయాడు. ఈ ఒక్కకారణంగానే అమెరికా గూఢాచార సంస్థ సీఐఏతో క్యాస్ట్రోను హత్య చేయడానికి  మొత్తం 638 సార్లు విఫలయత్నం చేసిందని అంటారు. ఫిడెల్ కాల్చే చుట్టలో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ఉంచటం వంటి పలు విన్నూత విధానాలతో హత్యాప్రయత్నాలు చేసింది.

అండర్ వరల్డ్ మాఫియా సహకారంతో రోడ్డు పైనే  కాస్ట్రోను కాల్చివేయటానికి కూడా ప్రయత్నించింది. ఆఖరికి అతని మాజీ ప్రియురాలు మారిటా లోరెంజ్ ను లొంగ దీసుకుని ఆమె ద్వారా విష ప్రయోగం చేయించాలని ప్లాన్ కూడా చేసింది.  కానీ ప్రతీ సారీ కాస్ట్రో అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లెంగా మారాడు. అమెరికా ఎన్ని ఎత్తుగడలు వేసినా …  ఎన్ని కుట్రలుపన్నినా కాస్ట్రో ఒంటి చేత్తో వాటిని తిప్పి కొట్టాడు.

కాస్ట్రోను చంపే ప్రయత్నాలు 1959 విప్లవం తరువాత ప్రారంభమయ్యాయి. 1961 లో యుఎస్ ప్రభుత్వ మద్దతుతో క్యూబా బహిష్కృతులు కూడా ఫిడేల్, రౌల్ కాస్ట్రో, చేగువేరాలను హత్య చేసేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమైనారు. కొన్నాళ్ల తరువాత  అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ హత్యకు గురైన రోజున, పారిస్‌లో పెన్-సిరంజి ద్వారా  కాస్ట్రోను చంపడానికి ఒక ఏజెంట్ ను పంపారు.

అదికూడా విఫలమైంది.  2000 లో కాస్ట్రో పనామాను సందర్శించబోతున్న సమయంలో మరోమారు హత్యాయత్నం జరిగింది. అతను మాట్లాడబోయే పోడియం కింద 200 90 కిలోల పేలుడు పదార్థాలను ఉంచడానికి ప్లాన్ చేసారు. ఆ సమయంలో కాస్ట్రో వ్యక్తిగత భద్రతా బృందం అక్కడ తనిఖీలను నిర్వహించింది. దీంతో ఆ పధకం కూడా ఫెయిల్ అయింది.

సాటిలేని వీరునిగా, ధీరునిగా ఫిడెల్ కాస్ట్రో జీవితంలో ఇది ఒక కోణం కాగా ఫిడెల్  శృంగార ప్రియుడనే ప్రచారం కూడా జరిగింది. తన 90 ఏళ్ళ జీవితంలో ఎక్కువ మంది మహిళలతో శృంగార కార్యకలాపాలు  నెరపాడని అమెరికా విస్తృత ప్రచారం చేసింది. ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా తీసిందని అంటారు. అంతటి చరిత్ర గల ఫిడెల్ క్యాస్ట్రో 2016 నవంబర్లో కన్నుమూసారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!