దీదీ హ్యాట్రిక్ సాధించేనా ?

Sharing is Caring...

పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ నుంచి మమతా గట్టిపోటీ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ పలు వ్యూహాలను పన్నుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్న నాయకులకు గాలం వేస్తోంది. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలను బీజేపీ తనవైపుకు తిప్పుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమత ఎక్కడా తగ్గ కుండా తనదైన శైలిలో బీజేపీ విమర్శలను తిప్పికొడుతోంది. 
కాగా … వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని ఇటీవల జరిగిన కొన్ని సర్వేలు చెబుతున్నాయి.  పైగా మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమంటున్నాయి ఆ సర్వేలు. సీఎన్‌ఎక్స్‌, ఏబీపీ సంస్థలు నిర్వహించిన పబ్లిక్‌ ఒపినియన్‌ సర్వేలు..తృణమూల్‌ ‌ మరోసారి విజయం సాధించి తీరుతుందని అంటున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి  146 నుంచి 156 స్థానాలు దక్కవచ్చని .. మమతా బెనర్జీ మరోసారి సీఎం అవుతారని ఆ పోల్ సర్వేలసారాంశం. ఇక బీజేపీ విషయానికొస్తే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించవచ్చని చెబుతున్నాయి. ఆపార్టీకి 113 నుంచి 121 సీట్లు రావచ్చని పోల్ సర్వేలు తేల్చాయి. మేజిక్‌ ఫిగర్‌ 148 స్థానాలకు అటు ఇటుగా తృణమూల్‌ గెలిచినా పెద్దగా ఇబ్బంది ఉండదని, కాంగ్రెస్‌-వామపక్షాల నేతృత్వంలోని కూటమి మద్దతుతో దీదీ అధికారంలో రావచ్చని పబ్లిక్‌ ఓపినియన్‌ సర్వేలు అంటున్నాయి. కాంగ్రెస్‌ వామపక్షాల కూటమికి 20 నుంచి 28 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి పరిస్థితే. ఎన్నికలకు ముందు ఓటర్ల మూడ్ మారే అవకాశం లేకపోలేదు. 
గతంలో మాదిరిగా మమతా బెనర్జీ అంత సులభంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ. బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ ఎన్నికల వ్యూహాలను, ప్రచారాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే కాలంలో మరికొందరు తృణమూల్ నేతలు బీజేపీ లో చేరే అవకాశాలున్నాయి. అయినా దీదీ జంకడం లేదు. ఓటర్లు గుంభనంగా అన్ని పార్టీల తీరును గమనిస్తున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!