Taadi Prakash ……………………… FILMS AS POLITICAL WEAPONS …
గ్రీస్ ఆకుపచ్చని అందమైన దేశం. చారిత్రక ఒలింపిక్ నగరం ఏథెన్స్ రాజధాని. సంస్కృతి, సౌందర్యం, కవిత్వం, గత కాలపు వైభవంతో కలిసి ప్రవహించే సజీవ నది గ్రీస్.1960వ దశకం మొదట్లో అక్కడ ప్రజా కంటకులు పాలకులయ్యారు. 1963 మే 22న గ్రీస్ లో ఒక రాజకీయ హత్య జరిగింది. ప్రతిపక్ష వామపక్ష నాయకుల్లో ప్రముఖుడైన గ్రిగోరియస్ లంబార్కిస్ని చంపేశారు. అమెరికాలో, దక్షిణ అమెరికాలో, ప్రతిపక్ష నాయకుల్ని హతమార్చడం, యాక్సిడెంట్ అనో, జారిపడితే తలకి పుట్‌పాత్ తగిలి చనిపోయాడనో కథలు అల్లి చెప్పడం చాలా మామూలు.
దర్శకుడు కోస్టా గౌరస్ ‘Z’ సినిమా యీ హత్య గురించే. 1969లో ‘జీ’ రిలీజ్ అయింది. దేశదేశాల్లో జనం విరగబడి చూశారు. అప్పట్లోనే 17 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఒక పరమ వెకిలి జేమ్స్‌బాండ్ సినిమానో, సెక్సూ హత్యలతో నిండిన క్రైమ్ పిక్చరో కమర్షియల్‌గా హిట్ అయి డబ్బు చేసుకోవడం వేరు. కోస్టా గౌరస్ అనే డేంజరస్ డైరెక్టర్ సినిమాలో ఎంజాయ్ చేయడానికేమివుండదు. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుంది? మర్యాదగా, చిరునవ్వుతో, వినమ్రంగా హత్యలు ఎలా చేస్తుంది? అదే దాన్ని ఎలా కప్పిపుచ్చుతుంది? చేతికి అంటిన నెత్తుటి మరకల్నిWASH చేసుకునే తీరులోని DARK HUMOUR ఎలా వుంటుంది?
సున్నితమైన మోసపూరితమైన మాటలు, హంతకులను రక్షించుకునే కుట్రలు, కోర్టు కేసు మతలబులు..పాలకుల కాఠిన్యం…బాధితుల నిస్సహాయత…ఈ సంక్లిష్ట విజువల్ ప్రెజంటేషన్ చూసి విస్తుపోవాల్సిందే ! విపక్షనాయకుణ్ణి తలమీద ఇనపరాడ్తో కొడతారు. మూడు నాలుగు రోజులు ఆస్పత్రిలో వుండి, మూడు ఆపరేషన్ల తర్వాత చనిపోతాడు. కేసు నడుస్తుంది. ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడాని పాలకులు అంటారు.
అయితే, తెగించి ముందుకొచ్చిన కొందరు నాయకులు ‘ఇది హత్య’ అని రుజువు చేయగలుగుతారు. అయినా కేవలం కిరాయి హంతకులు జైలుకెళతారు. హత్య చేయించిన వాళ్ళు విలాసంగా నవ్వుకుంటారు. సాహసించి హత్య కేసుని ఛేదిస్తే మాత్రం ఏమవుతుంది? ఆ నాయకుని భార్య దిగులు నిండిన కళ్ళతో సముద్రం వైపు చూస్తూ వుంటుంది. ఆ విషాద సంగీతం చీకటి తీగలుగా మారి మనల్ని చుట్టుకుంటుంది.
జీ,మిస్సింగ్ సినిమాలు చూసి బైటికి వస్తుంటే ఒక పెద్ద పోరాటం చేసి, చచ్చీచెడీ చివరికి బైటపడినట్టు వుంటుంది. హృదయం లేని పాలకుల కంటే దారుణమై మనిషి కోస్టా గౌరస్ అని మనకి తెలిసొస్తుంది. సినిమా అనేది ఒక భాష. భావోద్వేగాల Explosion. ఆ భాషా పండితుడు కోస్టాగౌరస్. వెండితెర కథనాన్ని ఆయుధంగా మార్చి పాలకుల గుండెల్లో పొడిచే విద్యా పారంగతుడు. ఒక ఆదర్శప్రాయమైన హంతకుడు కోస్టాగౌరస్. శాన్ఫ్రాన్సిస్కో ఫిలింఫెస్టివల్లో అణుబాంబులా పేలింది ‘జీ’. కమర్షియల్ సినిమాల్తో బతికేవాళ్ళు కంగుతిన్నారు.
కరచాలనం చేసి కోస్టాగౌరస్ చేతుల్ని ముద్దు పెట్టుకున్నారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజి ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ పొందింది. వరసగా అనేక ఫిలింఫెస్టివల్స్‌లో ఉత్తమదర్శకత్వం,స్కీన్‌ప్లే, సంగీతానికి అవార్డులు దక్కించుకుంది. కోస్టాగౌరస్ స్వయంగా కొన్ని సినిమాల్లో నటించారు. మంచి రచయిత. ప్రజల్ని ప్రేమిస్తాడు, నియంతల్ని అసహ్యించుకుంటాడు. ఆ ధర్మాగ్రహాన్నీ,ద్వేషాన్నీ తెర మీద విరజిమ్ముతాడు. కూతురు జూలీగౌరస్ కొడుకు రోమైన్ గౌరస్లు కూడా దర్శకులు.
*** *** ***
అసలు మన రాజకీయ హత్యలపై మనం ఎప్పుడు గొప్ప సినిమాలు తీస్తాం? రెండుకోట్ల జనాభా కూడా లేని గ్రీస్ అనే చిన్నారి దేశం కోస్టాగౌరస్ అనే పదునైన ఆయుధాన్ని తయారు చేయగలిగినపుడు, మనకి ఎంత మంది కోస్టా గౌరస్లు వుండాలి? అలాంటివాళ్ళు మనకెందుకూ..? ఇండియాని చిలీగా మార్చాలన్న మన పాలకుల కల ఫలించకపోవచ్చు. ఆ ప్రయత్నం చేయడం మాత్రం మానరు. శక్తిమంతులైన వ్యూహకర్తలు బి.జె.పికి వున్నారు.
గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ క్యూబా బాటిస్టాకి బంధువు. అగస్టోపినోచెట్కి ఆత్మబంధువు. ఎప్పుడో 50 ఏళ్ళక్రితం రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త’ అంటే అదో చమత్కారం అనుకున్నా పిచ్చిమొహాన్ని. రావిశాస్త్రి ఎంత PROPHETIC ! నాటి ఆవులేనేమో… కొమ్ములు తిరిగిన దున్నపోతులై ఇప్పుడు జనం మధ్య తిరుగుతున్నాయి. రాజకీయాల్లో బి.జె.పి ఎగిరెగిరి పడుతోంది.
2013, ఆగస్ట్ 20, పుణే, మహారాష్ట్ర. ఉదయం 7 గంటల 20 నిమిషాలు. మార్నింగ్ వాక్ చేస్తున్న దభోల్కర్‌ని యిద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. నరేంద్ర అచ్యుత దభోల్కర్ డాక్టర్. హేతువాది. సోషల్ యాక్టివిస్ట్. 67 ఏళ్ళ వయస్సున్న ఆ విద్యావంతుడైన సంస్కారిని కాల్చి చంపిందెవరో అందరికీ తెలుసు. ఎనిమిది నెలల తర్వాత… 2014, మే 26, న్యూ ఢిల్లీ, భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ భగవంతుని మీద వొట్టేసి ప్రమాణస్వీకారం చేశారు.2015, ఆగస్ట్ 30, కర్నాటక ఉదయం 8 గంటల 40 నిమిషాలు… 76 ఏళ్ళ కల్బుర్గిని కాల్చిచంపారు.
ధార్వాడ్‌లోని ఆయన ఇంట్లోనే హత్య చేశారు. మల్లేషప్పమదివలప్ప కల్బుర్గీ రచయిత. హంపీ యూనివర్శటీలో అధ్యాపకుడు. ఆయన పరిశోధన వ్యాసాలకు సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 2015, ఫిబ్రవరి 16, ముంబ ఉదయం 9 గంటల 25 నిమిషాలు… మార్నింగ్ వాక్ నుంచి తిరిగివస్తున్న కమ్యూనిస్టు నాయకుడు గోవింద్ పన్సారే, ఆయన భార్యపై కాల్పులు జరిపారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. పన్సారే 20వ తేదీన ఆస్పత్రిలో మరణించారు. తలకి గాయం అయినా పన్సారే భార్య బతికింది.
2017, సెప్టెంబర్ 5, బెంగళూరు ఉదయం 8 గంటలు…జర్నలిస్టు గౌరీ లంకేష్‌ని ఆమె యింట్లోనే కాల్చిచంపారు. 55 ఏళ్ళ గౌరి ‘లంకేష్ పత్రికె’ అనే కన్నడ వారపత్రిక సంపాదకురాలు. ముగ్గురు గుర్తు తెలియన వ్యక్తులు ఆమెని హతమార్చారు.
THESE ARE ALL BRUTAL MURDERS, DONE IN BROAD DAY LIGHT. మతశక్తులు ముసిముసిగా నవ్వుకున్నాయి. ప్రజాస్వామిక వాదులు నిర్ఘాంతపోయారు.వాళ్ళది ఒకటే మాట. ఒకే ఒక్క నినాదం.. మేం వూరుకోం…చంపేస్తాం ! భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం.
*** *** ***
2016 నుంచి 2019 దాకా నరేంద్రమోడీ, అమిత్‌షాల పాలనలో నేరాలు బాగా ఆర్గనైజ్డ్గా జరిగాయి. పేద,దిగువ మధ్యతరగతికి చెందిన 44 మందిని కిరాతకంగా కొట్టి చంపేశారు. ఆ 44 మందిలో 36 మంది ముస్లింలే కావడం .. ఒక చేదు నిజం ! 2015 మే నెల నుంచి 2018 డిసెంబర్ దాకా విచ్చలవిడిగా జరిగిన వందకి పైగా దాడుల్లో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాడికల్ గో సంరక్షణ గ్రూపులు యీ అరాచకానికి పాల్పడ్డాయి.
హిందూ నేషనలిస్ట్ విజిలెంట్ ఎటాకర్స్ ఈ పుణ్యంలో పాలుపంచుకున్నారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న HUMAN RIGHTS WATCH సంస్థ ఈ వివరాలు తెలిపింది. నేరస్తులు మనమధ్య స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ప్రజల మేలు కోరేవాళ్ళని రాజకీయ నేరస్తులని అంటూ వుంటారు. అచ్చూ కోస్టాగౌరస్ సినిమా చూస్తున్నట్టే వుంటుంది.
రైతులు, చేనేత కార్మికులూ … ఆత్మహత్యలు చేసుకుంటారు. అయోధ్యలో గుడి కట్టి దేశాన్ని ఉద్ధరిస్తాం అని వాళ్ళు చెబుతుంటారు. పురాణలని చరిత్ర అని వొప్పించడంలో బిజెపి సఫలం అయింది అని ఈ మధ్యనే అన్నారెవరో… అవును మరి… ఉన్మాదాన్ని భక్తిగా, యుద్ధోన్మాదాన్ని దేశభక్తిగా చిత్రించి మభ్యపెడుతున్న పాలకుల చేతుల్లో చిక్కుకొని వున్నాం.
కాషాయం మాజెండా. విద్వేషం ఎజెండా ! ఈ దేశంలో 18-20 కోట్ల మంది వున్న ముస్లింలని యిక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టు వాగడం… పోనీ అది జరిగే పనేనా ! కాకపోయినా అది ‘హిందూత్వ’ రాజకీయ అవసరం.
ఇక్కడ గాడ్సే, హిట్లర్, ముస్సోలినీ, పినోచెట్లని ఆరాధించే వాళ్ళు వుండొచ్చు. వాళ్ళ COMMUNAL DREAM కకావికలు అయిపోయే రోజు ఎంతో దూరంలో లేదు.ఆ కలని వాళ్ళ కత్తులతోనే హత్య చేసుకోగల సమర్దులు వాళ్ళు. మనది ఎంత దగుల్బాజీ ప్రజాస్వామ్యం అయినా హంతకులకు ఎర్రతివాచీలు పరిచేస్థాయికి దిగజారడం జరగదని ఒక నమ్మకం.
పచ్చి వ్యాపార సినిమాలు తీసుకుని డబ్బుపిండుకోవడానికి అలవాటు పడిన మన మెయిన్ స్ట్రీం సినిమా నుంచి కోస్టాగౌరస్లని ఆశించడం వెర్రితనం ! బలమైన రాజకీయ సినిమా రావాల్సిన అవసరం వుంది. ఒక్క పుస్తకాల ద్వారా కాకుండా చరిత్రని విజువల్‌గా ప్రిజర్వ్ చేయడం అత్యవసరం. బీహార్ గిరిజన వీరుడు బిర్సాముండా మీద భారత ఫిల్మ్ డివిజన్ వాళ్ళు గొప్ప డాక్యుమెంటరీ తీశారు. నాటి ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహి నుంచి నేటి కల్బుర్గి, గౌరి, ధబోల్కర్, పన్సారే దాకా మంచి డాక్యుమెంటేషన్ కావాలి.
మునుపటిలా కాకుండా Netflix,Amazonలు వెబ్‌సిరీస్ వెంట పడుతున్నాయి. అదో గొప్ప అవకాశం. యూ ట్యూబ్ ఎలాగూవుంది. కావాల్సిందల్లా చదువుకున్న,విజన్‌వున్న రక్తం ఉరకలెత్తే కమిటెడ్ కుర్రాళ్ళు. కోస్టాగౌరస్ తీసినవి కేవలం సినిమాలు కావు. మనకవి పాఠ్యగ్రంథాలు. ఇలానే పోలెండ్,రష్యా, జపాన్, ఇరాక్, అప్ఘనిస్తాన్ ఇంకా ఎన్నో దేశాలు మరిచిపోలేని రాజకీయ చిత్రాలు నిర్మించాయి ఇన్ని కబుర్లు చెప్పే మార్క్సిస్టు పార్టీ జ్యోతిబసు జీవితం మీద ఒక సాధికారికమైన సినిమా ఎందుకు ప్లాన్ చేయలేదో?
షాపూర్జీ షకలత్వాలా, మఖ్దూం మొహియుద్దీన్ అజయ్ ఘోష్, రజనీ పామీదత్ నుంచి ఎం.ఎన్. రాయ్ దాకా, పి.సి జోషి నుంచి చారు మజుందార్ దాకా…. హక్కుల డాక్టర్ రామనాథం నుంచి HRF బాలగోపాల్ దాకా… ఎన్ని ఉత్తేజకరమైన సంఘటనలు, ఎంత ఆదర్శప్రాయమైన జీవితాలు ! ఏం మనుషులు వాళ్ళు ! బతుకంతా జనం కోసం,దేశం కోసం నిలబడి, సుఖాల్ని త్యాగం చేసి, త్యాగానికి నిలువెత్తు అర్ధమై వెలిగి, ఆ త్యాగంలోనే దగ్ధం అయిపోయిన నిజమైన మనషుల కోసం మనం ఏమీ చేయలేమా?
అనుపమానమైన వాళ్ళ త్యాగాల్ని భావితరాలకు అందించలేనంత బాధ్యతారాహిత్యం మనల్ని ఆవహిస్తోందా?
ఈ అరణ్యరోదన వినేవాళ్ళవరైనా వున్నారా?