ఏపీ ఎస్.ఈ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లో వైసీపీ సర్కార్ నిమ్మగడ్డను కావాలనే వేధిస్తోందని సామాన్య జనాలు అనుకున్నారు. అయితే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అని చీటికీ మాటికీ ప్రభుత్వాన్నిబెదిరిస్తున్నవైనం,అధికారుల బదిలీ వ్యవహారంలో మొండిగా వ్యవహరిస్తున్న వైఖరి, మంత్రులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కి లేఖ రాసి మీడియా కు లీక్ చేసిన తీరు ఆయన పై ఉన్న సదభిప్రాయాన్ని మారుస్తున్నాయి.
ఈయనేంటి ఇలా వ్యవహరిస్తున్నారని జనాలు అనుకుంటున్నారు.పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు.కమీషనర్ మాటలు, చేతలు, వ్యవహరిస్తున్నతీరు పొలిటికల్ లీడర్ స్టైల్ లో ఉంటున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.
వైఎస్ విగ్రహానికి ముసుగు వేయమన్నారు. అంటే జనాలు ఎన్నికల కాలంలో వైఎస్ ను మర్చిపోవాలని కమీషనర్ ఉద్దేశ్యం. మంచిదే.కానీ విగ్రహాలకు ముసుగులేయించి కడప వెళ్లి కమీషనర్ ఏమి చేసారు ? వైఎస్ ను ముందెన్నడూ లేని రీతిలో పొగిడారు. సీబీఐ కేసులు గురించి మాట్లాడారు. ఇది తప్పా ? ఒప్పా అనే సంగతి ఆయనే చెప్పాలి. తద్వారా ఒక కమీషనర్ గా ఆయన ఇచ్చిన సందేశం ఏమిటి ? తను ఒక స్వతంత్ర వ్యవస్థకు ప్రతినిధినంటూ చెప్పుకుంటూ.. నిమ్మగడ్డ రాజకీయ నేతలా మాట్లాడటం ఆ సందర్భానికి తగదు.
రేషన్ డెలివరీ వాహనాల తనిఖీ కూడా కమీషనరే చేయాలా ? కింది అధికారులచే చేయించవచ్చు. అలా కాకుండా తానే తనిఖీ చేసి డ్రైవర్ సీటులో కూర్చోని ఫోటోలు దిగడం కొంచెం అతిగానే ఉంది. ఇదంతా పబ్లసిటీ కోసమే చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. వెళ్లిన చోటల్లా మీడియాతో మాట్లాడటం కూడా రాజకీయనాయకులకు చెల్లుతుంది కానీ అధికారులకు కాదు. తిరుమల లో ఎన్నికల ప్రస్తావన అవసరం లేదు. ఇక కమీషనర్ ఈ వాచ్ పేరుతో తెచ్చిన యాప్ విషయం లో కూడా వివాదం చోటు చేసుకుంది.కేంద్ర ఎన్నికల కమీషన్ యాప్ ను కమీషనర్ ఉపయోగిస్తే .. ఎవరు మాట్లాడే వారు కాదు.ఆ ప్రయివేట్ యాప్ సంగతిని రహస్యంగా ఉంచారని విమర్శలు కూడా వచ్చాయి. ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఈ నెల 9 వరకు యాప్ ను అమల్లోకి తీసుకురావొద్దని ఆదేశించింది.
ఇక కింది స్థాయి అధికారులను కూడా కమీషనర్ నమ్మాలి.. ఏకగ్రీవాల విషయంలో కలెక్టర్లను హెచ్చరించడం … అనుమానించడం .. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఏకగ్రీవాలను ఆపడం పై కూడా విమర్శలు వస్తున్నాయి. కాగా టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టోను ఉపసంహరించుకోమని కమీషనర్ ఆదేశించారు. మ్యానిఫెస్టో అంశాలు జనం లోకి వెళ్ళాక ఉపసంహరణ చేసి ప్రయోజనం ఏముంది? పోనీ ఆపార్టీ నేతలతో అలాంటి స్టేట్మెంట్ ఇప్పించారా అంటే అదీలేదు. మొత్తం మీద ప్రభుత్వ వ్యవస్థ ను ఢీ కొంటూ నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను బాగానే ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికలను నిష్పాక్షికంగా .. పారదర్శకంగా నిర్వహించాలన్న తపన నిమ్మగడ్డ కు ఉండొచ్చు కానీ అదే సమయంలోఅధికారులతో మెరుగైన సంబంధాలు, సంయమనం పాటించడం కూడా అవసరం. అలా చేస్తే విమర్శలకు అవకాశముండదు. ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది.
————– K.N.MURTHY