తెలుగు రాష్ట్రాలపై సీతారామన్ శీతకన్ను!

Sharing is Caring...

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ కేటాయింపుల్లో అత్తింటి మీద కంటే పుట్టింటి పైనే  ప్రేమ చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తకపోవడం విచారకరం. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.ఇదేమి బడ్జెటో అర్ధం కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.  దక్షిణాదిలోని కేరళ, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పనుల కింద నిధుల కేటాయింపులు బాగానే జరిగాయి.  మెట్రో రైలు, జాతీయ రహదారులు ప్రాజెక్టులు భారీ స్థాయిలోనే ప్రకటించారు. చెన్నై మెట్రో రైలు విస్తరణకు రూ.63, 246 కోట్లు కేటాయించారు. అలాగే బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. కానీ సీతారామన్ తెలుగు రాష్ట్రాల పై శీత కన్నువేయడం  బాధాకరం.

తెలంగాణకు మంత్రి మొండి చెయ్యి చూపించారు. పన్నుల వాటా, గ్రాంట్లు తప్ప రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇస్తున్న నిధులు పెద్దగా ఏమీ లేవు. విభజన నాటి హామీలూ అమలు కాలేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ హామీ ఇచ్చినా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్వహణకు వచ్చే ఐదేళ్లలో 52,941 కోట్లు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్‌లో వీటి సంగతి లేదు. కాజీపేటలో రైల్వే వ్యాగన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఆ ప్రస్తావన లేదు. కేంద్రం పట్టించుకోలేదు. ఇంకా  డ్రై పోర్ట్ గురించి.. బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు.

ఇక ఏపీ  పరిస్థితి కూడా అంతే.  విశాఖ రైల్వేజోన్‌ ప్రకటించి ఏడాది కావస్తున్నా వాటి ఊసే బడ్జెట్లో లేదు. శ్రీకాళహస్తి- నడికుడి, బెంగళూరు-కడప, కోటిపల్లి-నర్సాపురం లైనుకు సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. వీటన్నింటినీ  భూసేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నిధులు మాత్రం కేటాయించడం లేదు. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నడికుడి-శ్రీ కాళహస్తి రైల్వేలైను ఏర్పాటుకు భూసేకరణ దశకొచ్చినా పరిహారాలు ఇవ్వలేదు.విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చే దిశగా ఆర్థిక మంత్రి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ముఖ్యంగా ఏపీ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదాపై బడ్జెట్‌లో కనీస ప్రస్తావన రాలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ… బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఊసే లేదు. ఎన్నికల సీజన్‌ కాకపోవడం, రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా లేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. బడ్జెట్ పై అగ్రనేతల అభిప్రాయాలు ఇంకా వెలువడలేదు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!