దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని మీడియాకు తెలియజేసారు. ఆరోజుల్లో నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ వైఎస్ ఇచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగిందన్నారు. తాను వైఎస్ఆర్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకున్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని, కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారని వివరించారు. వైఎస్ ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని స్పష్టంగా చెప్పారు. దివంగత నేత వైఎస్‌లో లౌకిక దృక్పథం ఉండేదని నిమ్మగడ్డ విశ్లేషించారు. చిత్రం గా ఈ పొగడ్తలను ఆంధ్రజ్యోతి అక్షరం పొల్లు పోకుండా ప్రచురించింది.
ముందెన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ వైఎస్ ను పొగడటం విశేషం. అంతకు ముందు నిమ్మగడ్డ ఎప్పుడూ బహిరంగంగా వైఎస్ ప్రస్థావన తీసుకురాలేదు. ఇపుడు కడప వెళ్లి మరీ వైఎస్ ను పొగడటంలోని ఆంతర్యం ఏమిటనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇపుడు అధికారం లో ఉన్నది ఆ వైఎస్ కుమారుడు వైఎస్ జగనే. ఆయన పేరు మీదనే జగన్ పార్టీ పెట్టారు. ఈ విషయాలు అందరికి తెలిసినవే. జగన్ సర్కార్ కి ఎస్ ఈ సి కి వార్ నడుస్తున్న నేపథ్యంలో వైఎస్ కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉండేది అంటే అర్ధం ఏమిటి ? జగన్ కి లేదనే అనుకోవాలా ? వైఎస్ భావప్రకటనా స్వేచ్ఛ కల్పించారని అంటే అర్ధం ఏమిటి ? జగన్ సర్కార్ అలా చేయడం లేదని అనుకోవాలా ? పరోక్షంగా జగన్ కు చురకలు అంటించారు అనుకోవాలా ? ఎవరైనా తండ్రి అలా ఉన్నాడు అంటే ? ఏ విధంగా అర్ధం చేసుకుంటారు ? నిమ్మగడ్డ మనసులో ఏముందో ఏమో కానీ తండ్రి ని పొగిడితే జగన్ పొంగి పోతాడనా ? అసలే పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటున్న తరుణంలో నిమ్మగడ్డ వైఎస్ ను పొగిడిన తీరు మరో వివాదానికి దారి తీసే అవకాశం లేకపోలేదు. నిమ్మగడ్డ నిజాయితీగానే వైఎస్ ను ప్రస్తుతించినా ఎన్నికల వేళ అవన్నీ అప్రస్తుతాలే అవుతాయి. ఒక రాంగ్ మెసేజి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.
————–KNM