అబ్బుర పరిచే జంబుకేశ్వరాలయం !

Sharing is Caring...

తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చికి 11 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి.  ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు.

ఈ ప్రాకార నిర్మాణంలో పనిచేసినవారికి రోజూ ఆ సిద్ధుడు కొంత విబూది ఇచ్చేవాడట. ఇంటికి వెళ్ళగానే ఆ విబూది బంగారం లాగా మారిపోయేదట. ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని స్థానిక భక్తుల నమ్మకం.

స్థల పురాణం ప్రకారం శంభుడు అనే ఋషి శివభక్తుడు.శివుని పూజించనిదే మంచినీరు కూడా తాగేవాడు కాదు. ఒకసారి శంభుడికి శివుడిని  ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు.

భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజిస్తావు అని చెప్పి అంతర్థానం అయ్యాడట.శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు లింగ రూపంలో వెలియగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తున్నాడు.ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తులు నమ్ముతారు. మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో నిర్మితమైంది.  గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అలాగే  అనేక ఉపఆలయాలు, మండపాలు ఉన్నాయి. ఇక్కడి శిల్పసంపద యాత్రీకులను ఆకట్టుకుంటుంది.  ఇక్కడి శివ లింగం పానపట్టం నుండి ఎపుడూ  నీరు ఊరుతూ ఉంటుంది.

ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకుని .. అభయ హస్తంతో వరద ముద్రతో దర్శనమిస్తారు.

అఖిలాండేశ్వరి  పూర్వం  ఉగ్ర రూపిణిగా  ఉండేవారని శంకరాచార్యులు ఈమె ను ఆరాధించి ..  ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. తమిళనాడు వెళ్ళినపుడు జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శించి రండి. 
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!