A sacred place where rivers meet…………………….
ప్రయాగ అంటే సంగమం. నదులు సంగంమించే పవిత్ర స్థలం. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు, ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం.విష్ణుప్రయాగ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో 4,501 అడుగుల ఎత్తులో ఉంది. ఇది బద్రీనాథ్ ఆలయం నుండి దాదాపు 40 కి.మీ. దూరంలో ఉంది.
కేదార్ నాథ్, బదరీ నాథ్ వెళ్లే మార్గంలో పంచ ప్రయాగలు అనే అయిదు పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అవి విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ … ఈ ఐదింటిని కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు. ఈ క్షేత్రాల దర్శనం మోక్ష ప్రదాయకమని భక్తుల నమ్మకం.
హిమాలయాలలో వున్న త్రిమూర్తులకు ప్రతీకగా భూమి పై యేర్పడ్డ త్రిభుజాకార హిమనీ నదమైన సతోపంత్ లో పుట్టిన ‘అలకనంద ‘ నది పరుగులతో బదరీనాథుని పాదాలను తాకి దిగువకు పారుతూ చిన్న చిన్న సెలయేళ్లని తనలో కలుపుకుంటూ ప్రవహిస్తుంది. అలకనంద నది ఐదు ప్రధాన సంగమాలలో ఇది మొదటిది.
జోషిమఠ్ దాటి పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి విష్ణుప్రయాగ దగ్గర ‘ధౌళి గంగ’తో కలసి ‘అలకనంద’గా దిగువకు దూకుతుంది. ధౌళి గంగ ‘ నితిపాస్ ‘ లో పుట్టి తెల్లని రంగులో పడమట వైపునుండి పరుగులతో వచ్చి ‘విష్ణుప్రయాగ’ దగ్గర ‘అలకనంద’తో సంగమించి తన ఉనికిని కోల్పోతుంది. అలకనంద నీరు నీలం రంగులోను , ధౌళిగంగ తెల్లటి రంగులోను వచ్చి కలిసే దృశ్యం అద్భతంగా వుంటుంది.
ఈ సంగమం వద్ద ఉన్న అష్టభుజి ఆకారపు ఆలయం 1889 నాటిది.. దీనిని ఇండోర్ మహారాణి అహల్యబాయి నిర్మించారు. ఈ విష్ణు ఆలయం నుండి ఒక మెట్ల మార్గం ప్రయాగ వైపు వెళుతుంది. రెండు కొండల నడుమ ఉన్న లోయలో ఈ నదీ సంగమం జరుగుతుంది. రెండు కొండలను కలుపుతూ ఒక ఇనుప బ్రిడ్జి ని అక్కడ నిర్మించారు. బ్రిడ్జి పై నుంచి నదీ ప్రవాహాన్ని చూడవచ్చు. 2013 లో వచ్చిన వరదల వల్ల ఇక్కడ ఆలయానికి ఏ విధమైన నష్టం కలగలేదు. ఆలయం పక్క నుంచి మెట్ల దారి గుండా దిగి సంగమం చేరుకుని భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు.
పురాణాల ప్రకారం, విష్ణువు ఈ ప్రదేశంలో ధ్యానం చేసి నారద మహర్షికి జ్ఞానాన్ని అనుగ్రహించాడని చెబుతారు.ఇక్కడ నారదుడు తపస్సు చేసాడని చెబుతారు. ఆయన తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి దర్శన మిచ్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని ‘విష్ణుప్రయాగ’ గా పిలుస్తారు.
ఈ ప్రదేశంలో అలకనంద నదిని ‘విష్ణుగంగ’ గా పిలుస్తారు.ప్రస్తుతం ఈ నదిపై 400 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్లాంటు జేపీ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది.విష్ణుప్రయాగ సమీపంలో ఆనకట్టలు, పూల లోయను, కాగ్‌భూషండి సరస్సు, హనుమాన్ చట్టి ని సందర్శించవచ్చు.
వర్షాకాలం, శీతాకాలం మినహా విష్ణుప్రయాగ్ కు మిగతా రోజుల్లో వెళ్ళవచ్చు. ప్రకృతి అందాలు ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటాయి.వర్షాకాలంలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదా దృశ్యాలను చూడటం కష్టతరం కాబట్టి మిగతా రోజుల్లో వెళ్లడం మంచిది.
విష్ణు ప్రయాగ కు 261 కి.మీ దూరంలో ఉన్న రిషికేశ్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటే ..అక్కడనుంచి జోషిమఠ్ కు టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. విష్ణుప్రయాగ కు 287 కి.మీ దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది. అక్కడ నుంచి జోషిమఠ్ కు, విష్ణు ప్రయాగకు వెళ్ళవచ్చు. జోషిమఠ్ లో హోటల్స్ ఉన్నాయి,వసతి భోజన సదుపాయాలకు ఇబ్బంది లేదు.
జోషిమఠ్ కి ఎనిమిది కి.మీ దూరంలో విష్ణు ప్రయాగ ఉంది.పంచ ప్రయాగ యాత్ర విష్ణు ప్రయాగ వద్ద మొదలుపెడితే నంద ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, చివరిగా దేవ ప్రయాగకు చేరుకుంటాం.