Ajith Dadaa……….
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనను ‘అజిత్ దాదా’గా పిలుచుకుంటారు. అజిత్ తండ్రి అనంత్‌రావ్ పవార్. ఈయన సీనియర్ పొలిటిసియన్ శరద్ పవార్‌కు స్వయానా అన్నయ్య. రాజకమల్ స్టూడియోస్‌లో పని చేసేవారు.తల్లి ఆశా పవార్.బాబాయ్ శరద్ పవార్ అజిత్ పవార్ రాజకీయ గురువు.
ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబపరంగా పవార్ వంశంలో వీరు కీలక వ్యక్తులు. 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా డియోలాలిలో అజిత్ జన్మించారు.ప్రాథమిక విద్యను అహ్మద్‌నగర్ జిల్లాలోని డియోలాలి ప్రవరలో పూర్తి చేశారు.
ఆ తర్వాత, బారామతిలోని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ హైస్కూల్ నుండి 10వ తబారామతిలోని అదే స్కూల్ లో పూర్తి చేశారు.12వ తరగతి తర్వాత ఆయన ముంబైలోని ఒక కళాశాలలో డిగ్రీలో చేరారు. అయితే, ఆయన తండ్రి అనంతరావు పవార్ ఆకస్మిక మరణం కారణంగా, కుటుంబ బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో మధ్యలోనే చదువును ఆపేశారు.
అజిత్ పవార్ కుటుంబం మొదటి నుంచి ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం.వీరి కుటుంబానికి పుణె జిల్లా బారామతిలో తరతరాలుగా వందల ఎకరాల సాగు భూమి ఉంది. అప్పట్లోనే వారు వ్యవసాయాన్ని ఒక వ్యాపార దృక్పథంతో లాభసాటిగా మార్చుకున్నారు.
పవార్ కుటుంబం దశాబ్దాల క్రితమే చక్కెర కర్మాగారాలు, సహకార బ్యాంకులు,విద్యా సంస్థలను స్థాపించింది. ఈ సహకార సామ్రాజ్యం వారిని ఆర్థికంగా, రాజకీయంగా తిరుగులేని శక్తిగా మార్చింది..తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను స్వీకరించిన అజిత్ పవార్, తన బాబాయ్ శరద్ పవార్ మార్గదర్శకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యునిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991లో పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికై 16 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి, గ్రామీణ స్థాయిలో బలమైన పట్టు సాధించారు. 1991లో బారామతి లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.
అయితే శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి రావడంతో ఆయన కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు.1991 నుండి బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక, నీటిపారుదల, వ్యవసాయం వంటి కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. రికార్డు స్థాయిలో 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2019లో ఎన్సీపీ (NCP) నుండి బయటకు వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కానీ ఆ ప్రభుత్వం కొద్ది రోజులే సాగింది. 2023లో తన మద్దతుదారులతో కలిసి ఎన్సీపీని చీల్చి, ఏక్నాథ్ షిండే-బీజేపీ కూటమిలో చేరారు. అనంతరం ఎన్నికల సంఘం ఆయన వర్గానికే అసలైన ‘ఎన్సీపీ’ గుర్తింపును, గడియారం గుర్తును కేటాయించింది.
అజిత్ పవార్ 2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.అజిత్ పవార్ తన కంచుకోట అయిన బారామతి నియోజకవర్గం నుండి వరుసగా 8వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో సోదరుని కుమారుడు యుగేంద్ర పవార్‌పై 1,00,899 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు.ఆయన నాయకత్వంలోని ఎన్సీపీ మొత్తం 41 సీట్లను గెలుచుకుంది.
ఆయన పార్టీ పోటీ చేసిన 59 స్థానాల్లో 41 చోట్ల విజయం సాధించి, దాదాపు 70% సక్సెస్ రేటును నమోదు చేసింది.అజిత్ పవార్ భాగస్వామిగా ఉన్న మహాయుతి కూటమి (BJP, శివసేన-షిండే, NCP-అజిత్) మొత్తం 288 స్థానాలకు గాను 230 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుని తిరిగి అధికారాన్ని దక్కించుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అజిత్ పవార్ రాజకీయంగా మళ్ళీ పుంజుకోవడానికి ఉపయోగ పడింది.అజిత్ పవార్‌కు ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2019లో మావల్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. రెండో కుమారుడు జయ్ పవార్ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటారు.సీఎం కావాలన్నది అజిత్ కోరిక.. అది తీరకుండానే ప్రమాదంలో ఆయన మరణించారు.

