Bhavanarayana Thota …………
అవినీతి, అక్రమాలు బైటపెట్టటానికి కొంతకాలం టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరే విధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోవటంతో ఈ మంత్రం పనిచేయటం లేదు. స్టింగ్ ఆపరేషన్ కూ హద్దులుండాలని అమెరికాలో ఏబీసీ చానల్ కేసు చాటి చెప్పింది.
అమెరికాలో పేరుమోసిన ఫుడ్ లయన్ అనే సూపర్ మార్కెట్లో కుళ్లిన మాంసం అమ్ముతున్నారని, అపరిశుభ్ర వాతావరణంలో ప్యాకింగ్ చేస్తున్నారని నిరూపించాలని ఏబీసీ అనే చానల్ నిర్ణయించుకుంది. అయితే, కిచెన్ లోకి వెళ్ళటం కుదరలేదు. అందుకే లైన్ డెల్, సుసన్ బారెట్ అనే ఇద్దరు రిపోర్టర్లు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగులుగా చేరారు.
సీక్రెట్ కెమెరాలతో లోపలికెళ్ళి అక్కడి పరిస్థితులన్నీ రహస్యంగా షూట్ చేశారు. తిరిగొచ్చాక ప్రైమ్ టైమ్ న్యూస్ మేగజైన్ స్టోరీగా టెలికాస్ట్ చేశారు. ఇది 1992 నాటి సంగతి. అందులో ఫుడ్ లయన్ మాజీ ఉద్యోగుల అభిప్రాయాలు కూడా చేర్చారు. మొత్తానికి ఈ కథనం అమెరికాలో పెను కలకలం రేపింది. అయితే, ఎబీసీ చానల్ మీద ఫుడ్ లయన్ సంస్థ కోర్టుకెక్కింది.
ఇన్వెస్టిగేటివ్ వార్తాకథానాలలో చట్ట సంబంధమైన ఉల్లంఘనల మీద దేశమంతటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక ఆక్రమాన్ని వెలుగులోకి తీసుకురావటానికైనా చట్టవ్యతిరేక మార్గాలు సరికాదని కోర్టు తేల్చింది. ఏబీసీ కి 10 లక్షల డాలర్ల జరిమానా పడింది. ఇప్పటికీ స్టింగ్ ఆపరేషన్ల గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఘటనను ప్రస్తావించుకోవటం తప్పదు.
*****
భారతదేశంలో 2001 లో తెహెల్కా డాట్ కామ్ అనే సంస్థ ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ పేరుతో సంచాలనాత్మకమైన స్టింగ్ ఆపరేషన్ చేసింది. అప్పటి అధికార పార్టీ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్. తెహెల్కా జర్నలిస్టులు తాము లండన్ కు చెందిన ఆయుధాల కంపెనీ ప్రతినిధులుగా ఆయనకు పరిచయం చేసుకున్నారు.
సైనికులకు పనికొచ్చే హ్యాండ్-హెల్డ్ థర్మల్ ఇమేజర్ లు సరఫరా చేస్తామని చెప్పారు. రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు సిఫార్సు చేయవలసిందిగా కోరారు. ఈ సంభాషణతో బాటు లక్ష రూపాయలు ఆయన చేతికివ్వటం కూడా కెమెరాల్లో రికార్డయింది. ఆ తరువాత ఈ వీడియోలు బైటపెట్టారు.
దేశ రక్షణ వ్యవహారాలు ఎంత ఆషామాషీగా నడుస్తున్నాయో చెప్పటం తమ ఉద్దేశమని తెహెల్కా చెప్పుకుంది. ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. బీజీపీ జాతీయఅధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2012 లో సీబీఐ కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది.
శిక్షాకాలంలోనే అనారోగ్యం కారణంగా బెయిలు మీద ఉండగా 2014 లో ఆయన చనిపోయారు. ఒక దళితుడికి జాతీయాధ్యక్ష పదవి ఇచ్చామని చెప్పుకున్న బీజేపీ ఆయనను ఈ ఘటన తరువాత ఏకాకిని చేసింది. ఏమైనా, భారతదేశంలో టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ చేపట్టటానికి తెహెల్కా ఉదంతం మార్గదర్శి అయింది.
*****
కాంగ్రెస్ ఎంపీ జిందాల్ యాజమాన్యంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి బొగ్గు కేటాయించటంలో అవకతవకలు జరిగాయంటూ భారతదేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ జీ టీవీ ఆధ్వర్యంలోని న్యూస్ చానల్ ఒక వార్తాకథనం ప్రసారం చేసింది. మరికొన్ని కథనాలు కూడా ప్రసారం చేయబోతున్నట్టు చూచాయిగా చెప్పింది.
జిందాల్ ప్రతినిధులు వెంటనే జీ న్యూస్ సీనియర్ జర్నలిస్టులను పిలిచి మాట్లాడారు. వార్తా కథనాలు ఆపటానికి 100 కోట్లు ఇవ్వాలని జీ జర్నలిస్టులు అడిగారు. పైగా తమ యజమాని సుభాష్ చంద్రకు ఈ డిమాండ్ తెలుసని కూడా చెప్పారు. ఒక హోటల్ లో జరిగిన ఈ మొత్తం సంభాషణను జిందాల్ బృందం రహస్యంగా వీడియో తీసింది.
జిందాల్ స్వయంగా మీడియా సమక్షంలో ఈ టేపులు ప్రదర్శించారు. ఈ రివర్స్ స్టింగ్ ఆపరేషన్ తో మీడియా మొత్తం ఉలిక్కిపడింది. ఇంకోవైపు ఆ ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. అవమాన భారంతో ఉన్న జీటీవీ కూడా జిందాల్ మీద 150 కోట్లకు పరువునష్టం దావా వేసింది. చివరికి ఇరుపక్షాలూ రాజీపడి కేసులు వెనక్కి తీసుకున్నాయి. అమాయక జనం చోద్యం చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడన్న సామెతను ఈ దెబ్బతో మీడియా మళ్ళీ గుర్తు చేసుకుంది.
*****
చానల్ మొదలవుతూనే జనం నోళ్లలో నానాలని గట్టిగా నిర్ణయించుకున్న మలయాళ చానల్ ‘మంగళం’ 2017 మార్చిలో చావు తెలివి చూపింది. ఒక మహిళా జర్నలిస్టు చేత మంత్రితో కొద్ది రోజులపాటు మాట్లాడిస్తూ ముగ్గులోకి దింపింది. సెక్సీ సంభాషణ మొదలుపెట్టించి వ్యవహారం ముదిరిన తరువాత రికార్డు చేసిన మాటలు ప్రేక్షకులకు వినిపిస్తూ దానిమీద చర్చ నడిపింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆ చానల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గంట సేపటికే అదే చానల్ ఆయన మంత్రివర్గ సహచరుడి మీద చర్చ మొదలుపెట్టింది. రికార్డయిన మంత్రి మాటల ఆడియో మీద చర్చ సాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి ఆదేశాల మీద శశీంద్రన్ అనే ఆ మంత్రి రాజీనామా చేశారు. అయితే, ఆ సంస్థలో పనిచేసే మరో మహిళా ఉద్యోగి ఆ గొంతు గుర్తుపట్టింది.
చానల్ లో చెబుతున్నట్టు ఎవరో గృహిణి కాదని, చానల్ లో పనిచేసే జర్నలిస్టు గొంతేనని ఆమెకు అర్థమైంది. చర్చ మధ్యలో లేచి బైటికొచ్చి ఫేస్ బుక్ లోనే ఈ సంగతి బైటపెట్టి, చానల్ అనైతికతను ప్రశ్నిస్తూ రాజీనామా చేసింది. ఇది మరో సంచలనమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీఈవో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
సాయంత్రం అరెస్ట్ ప్రకటించారు. చానల్ అనైతికత మీద మీడియా సంఘాలు మండిపడ్డాయి. క్షమాపణ చెప్పి ప్రసారాలకు ‘మంగళం’ పాడిన మంగళం యాజమాన్యం 3 ఏళ్ళకు పునఃప్రారంభించినా, 2022 లో శాశ్వతంగా మూసేసింది.
*****
బాధితులు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోలు ఒక టీవీ చానల్ కి ఇచ్చి ప్రసారం చేయించటం కూడా తెలిసిందే. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఎన్డీ తివారీ హైదరాబాద్ లో రాజ్ భవన్ లోనే రాసలీలలు జరిపి ఆయన బాధితుల స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు.ఆ విధంగా .. 84 ఏళ్ల వయసులో గవర్నర్ పదవి పోగొట్టుకోవటానికి ఆయన శృంగార లీలల స్టింగ్ ఆపరేషన్ కారణమైంది.
మరో తెలుగు చానల్ ఉస్మానియా ఆస్పత్రిలో శవాల అమ్మకం రుజువు చేయటానికి మార్చురీలో ఒక శవం కొన్నది. రిక్షాలో బైటికి తీసుకొచ్చేదాకా రహస్యంగా షూట్ చేసింది. ఆ తరువాత శవాన్ని రిక్షాలో వదిలేసి వెళ్లిపోవటంతో భయపడ్డ రిక్షావాలా ఆ శవాన్ని మూసీలో పడేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పోలీసులకు తెలిసి ఆరాతీస్తే అసలు సంగతి బైటపడింది.
చానల్ ప్రతినిధులు చేసింది తప్పని పోలీసులు తేల్చారు. పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నడపటమో, లేదా శవాన్ని పోలీసుల దగ్గరికి తీసుకువెళ్ళి కథంతా చెప్పటమో చేసి ఉండాల్సింది. అలా శవాన్ని వదిలేసి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారం నుంచి బైటపడటానికి ఆ చానల్ ప్రతినిధులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.

