జగ్గన్నతోట ప్రభల తీర్ధం ప్రత్యేకత ఏమిటీ ?

Sharing is Caring...

A symbol of spirituality …………

కోనసీమ సంస్కృతికి,ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ప్రభల తీర్థం అత్యంత విశిష్టమైనది. ప్రభల తీర్థం అనేది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే అత్యంత పురాతనమైన,విశిష్టమైన శైవ ఉత్సవం. 

ఈ తీర్థానికి సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు కాలంలో ఈ సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు.లోక కల్యాణం కోసం శివుని 11 రూపాలైన ఏకాదశ రుద్రులు ఒకే చోట సమావేశమవుతారని భక్తుల నమ్మకం.కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి గ్రామ శివారున ఉన్న జగ్గన్నతోట లో ఈ ఉత్సవం జరుగుతుంది.ఇది చాలా ప్రసిద్ధి చెందిన తీర్ధం. 

ఈ ఉత్సవానికి అంబాజీపేట పరిసర ప్రాంతాలలోని 11 గ్రామాల నుండి ప్రభలు వస్తాయి..వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ అన్నింటి లో అగ్రతాంబూలం అందుకుంటుంది.మొసలపల్లి నుంచి శ్రీ భోగేశ్వర స్వామి, ముక్కామల నుంచి శ్రీ రాఘవేశ్వర స్వామి, పుల్లేటికుర్రు నుంచి శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి,వక్కలంక నుంచి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రభలు వస్తాయి. 

వాటితో పాటు గా ,ఇరుసుమండ నుంచి శ్రీ ఆనంద రామేశ్వర స్వామి, గంగలకుర్రు నుంచి  శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి,గంగలకుర్రు అగ్రహారం నుంచి శ్రీ వీరేశ్వర స్వామి,గున్నేపల్లి నుంచి శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి,పెదపూడి నుంచి శ్రీ మేనకేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి.

వెదురు బద్దలు, రంగు కాగితాలు,పూలతో అలంకరించి భారీ ఎత్తున ప్రభలను తయారు చేస్తారు. వీటిపై శివుని ప్రతిరూపాలను ఉంచి గ్రామాల నుండి భుజాలపై మోస్తూ తీసుకువస్తారు. గంగలకుర్రు వంటి గ్రామాల ప్రభలను మోసేవారు కౌశిక నది (కాలువ) గుండా నడుచుకుంటూ తీసుకురావడం అత్యంత సాహసోపేతమైన ఘట్టం. దీన్నిచూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు.

పంట పొలాల మీదుగా ప్రభలు వెళ్లినా, సాక్షాత్తు శివుడు తమ పొలం నుండి వెళ్తున్నాడని రైతులు సంతోష పడతారు. 2023లో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం ఈ ‘ప్రభల తీర్థం’ థీమ్‌తోనే ప్రదర్శన లో పాల్గొంది.ఏకాదశ రుద్రుల దర్శనానికి గోదావరి జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

జగ్గన్నతోటలో కాకుండా సంక్రాంతికి అంబేడ్కర్‌ కోన సీమ జిల్లాలోని సుమారు 120 గ్రామాల్లో ప్రభల తీర్థాలు ఘనంగా జరుగుతాయి. వీటిని తిలకించేందుకు దేశ, విదేశాల్లో స్థిరపడ్డ ఈ ప్రాంత ప్రముఖులు వస్తుంటారు.ప్రత్యేకంగా అలంకరించిన ఈశ్వరుని ప్రతిరూపంగా పిలిచే ప్రభలను గ్రామాల్లో ఊరేగిస్తే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని ఈ ప్రాంత వాసుల నమ్మకం.

కొత్తపేట,మామిడికుదురు, బండారులంక, తొండవరం,చిరతపూడి,ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, పోతవరంల్లో ప్రభల తీర్థాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగలో మూడవ రోజైన కనుమ నాడు ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ ఉత్సవం జనవరి 16 న అత్యంత వైభవంగా జరిగింది. అన్నింట్లో జగ్గన్న తోట తీర్ధం బాగా పాపులర్ అయిన ప్రభల తీర్ధం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 నుండి ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!