పడి లేచిన కెరటం !!

Sharing is Caring...

Mohammed Rafee………….

మనసు కైన గాయాలు కసిగా పైకి లేపుతాయి! జీవితంలో రాటు దేలుస్తాయి! పడి లేచే కెరటంలా విజయాలను సొంతం చేస్తాయి! ఇందుకు హర్లిన్ కౌర్ డియోల్ తాజా ఉదాహరణ! కోట్ల మంది చూస్తుండగా, ఇంకో మూడు పరుగులు చేస్తే అర్ధ శతకం పూర్తి చేసే స్థితిలో ఉండగా, ఆమె కోచ్ సూరజ్ రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి వచ్చేయమని సైగ చేశాడు!

ఆ అమ్మాయికి మొదట అర్ధం కాలేదు! క్షణాల్లో అర్ధం చేసుకుంది! ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న చిన్ని గుండె! ఎన్నో సార్లు తట్టుకుని పైకి లేచిన హృదయం! అందుకే నవ్వుకుంటూ రిటైర్డ్ హర్ట్ గా వచ్చేసింది. 
ఆ సమయంలో కెమెరా సూరజ్ వైపు, డియోల్ వైపు చూపిస్తూనే వున్నాడు!

జనం నిశ్చేష్టులై  చూస్తుండిపోయారు! ఇది మొన్నటి బుధవారం రాత్రి జరిగిన WPL మ్యాచ్! యుపీ వారియర్స్ కు ఢిల్లీ క్యాపిటల్ మధ్య జరిగిన మ్యాచ్ లో డియోల్ కు జరిగిన ఘోర అవమానం! అదే ఇంకొకరు అయితే బ్యాట్ ను బలంగా నేలకేసి కొట్టేవారు! మోహంలో బాధను తెలిసేలా కవళికలు చూపించేవారు స్పష్టంగా! కానీ, డియోల్ నవ్వుతూనే పెవిలియన్ చేరుకుంది! 

టీమ్ తో కలసి కూర్చుంది! ఆ తరువాత హోటల్ కు చేరుకుని జెమీమా రోడ్రిగ్స్ కు చెప్పుకుని భోరున ఏడ్చిందట! కట్ చేస్తే, గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, యుపి వారియర్స్ మ్యాచ్! నాలుగో బ్యాట్స్ ఉమన్ గా బరిలోకి వచ్చింది! వస్తూనే తొలి బంతిని ఎదుర్కొని ఫోర్ బాదింది! రెండో బంతి ఫోర్, మూడవ బంతి ఫోర్! మూడు బంతుల్లో 12 రన్స్!

కెమెరా ఇక ఆమెను, కోచ్ ను చూపిస్తూ “నిన్నటి అవమానానికి కసి తీర్చుకుంటున్న డియోల్” అని కామెంటేటర్ చెబుతుంటే స్టేడియం హోరెత్తిపోయింది!  అంతటితో ఆగలేదు డియోల్! 39 బంతుల్లో 64 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించి తలెత్తి కోచ్ వైపు చూసింది మౌనంగా! అది కదా జవాబు అంటే!

విజయం అంటే అలా ఉండాలి! అవమానపడిన మరుసటి రోజే తన తడాఖా చూపించింది డియోల్! మొన్నటి వరల్డ్ కప్ లో ఆ అమ్మాయిని చాలా మ్యాచ్ లలో కూల్ డ్రింక్స్ అందించడానికే పెవిలియన్ లో కూర్చోబెట్టారు! 

ఓపెనర్ ప్రతీక్ రావల్ గాయపడిన తరువాత మాత్రమే డియోల్ ఓపెనర్ గా అడుగు పెట్టి అద్భుత పెర్ఫార్మెన్స్ చేసింది! కప్ భారత్ వశమైంది. కేవలం బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ మెరుపు వేగంతో తన సత్తా చాటుకుంటూనే ఉంటుంది డియోల్!

డియోల్ చండీఘడ్ కు చెందిన క్రికెటర్! హిమాచల్ ప్రదేశ్ కు ఆడుతూ 2021లో భారత్ టీమ్ కు ఎంపికైంది. ఆ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీ రోప్ పై విన్యాసాలు చేస్తూ పట్టిన క్యాచ్ తో హర్లిన్ డియోల్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఆ మ్యాచ్ ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో ప్రత్యేకంగా అభినందించారు.

మొన్నటి వరల్డ్ కప్ గెలిచిన తరువాత టీమ్ అంతా మోడీని కలిశారు. ఆయన అందరితో పిచ్చాపాటి మాట్లాడుతూ అదే క్యాచ్ ను మళ్ళీ డియోల్ కు గుర్తు చేయడం విశేషం! ఆ సమయంలో డియోల్ అడిగిన ప్రశ్న వైరల్ అయ్యింది. “మీ స్కిన్ మెరుస్తోంది ఏ క్రీమ్ వాడుతారు అంకుల్” అని మోడీని అడిగింది డియోల్!

భారత్ మహిళా క్రికెట్ టీమ్ లో కెప్టెన్ హర్మిత్ కౌర్ చాలా సీరియస్ గా ఉంటుంది గ్రౌండ్ లో! ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది చిలిపి డియోల్! ఫీల్డింగ్ లో చిన్న మిస్టేక్ చేసినా హర్మిత్ భరించలేదు, వెంటనే తిట్టేస్తుంది! అలా ఒకసారి డియోల్ క్యాచ్ మిస్ అయినప్పుడు హర్మిత్ తిట్టగానే “నవ్వుతూ తిట్టొచ్చు” అని డియోల్ జోక్ కట్ చేయడంతో హర్మిత్ కూడా పెద్దగా నవ్వేసింది!

ఈ వీడియో కూడా వరల్డ్ కప్ టైంలో బాగా వైరల్ అయ్యింది. అలాగే ఒక మ్యాచ్ లో వికెట్ కీపర్ రిచా ఘోష్ బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక కాస్త రిలాక్స్ గా ఆడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో కోచ్ కు పిచ్చ కోపం వచ్చి ఆయన పెవిలియన్ నుంచి అరుస్తున్నారిచా పట్టించుకోలేదు! ఆ సమయంలో డియోల్ బౌండరీ లైన్ దగ్గర నిలబడి “రిలాక్స్ గేమ్” అని అరిచింది. ఇది కూడా వైరల్ అయ్యింది!

భారత మహిళా టీమ్ లో జెమీమా, డియోల్ ఇద్దరూ బాగా అల్లరి చేస్తుంటారట! వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నవ్వుల సందడేనట! కెప్టెన్ హర్మిత్ గ్రౌండ్ లో ఎంత సీరియస్ గా వున్నావిడిగా చాలా తుంటరి అట! ఈ ముగ్గురు కలిస్తే ఇక నవ్వులే నవ్వులు అని ఎక్కడో చదివాను. కెప్టెన్ హర్మిత్ తోటి క్రీడాకారులను బాగా ఇమిటేట్ చేసి నవ్విస్తుంటుంది.

ముఖ్యంగా రోహిత్ శర్మ, సచిన్, సిద్ధూ, శ్రీకాంత్ లను బాగా ఇమిటేట్ చేస్తుందట! డియోల్ కూడా అంతే! హోటల్ నుంచి గ్రౌండ్ కు స్పెషల్ బస్సులో వెళుతున్నప్పుడు డియోల్ అసలు కూర్చోదట! మిమిక్రీ చేస్తూ బాగా నవ్విస్తూ ఉంటుందని ఇండియా పూర్వ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలి రాజ్ అన్నారొకసారి.  

మన తెలుగు తేజం శ్రీచరణి కూడా ఇటీవల చిట్ చాట్ చేస్తూ డియోల్, జెమిమా కలసి చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పింది! ఇద్దరూ గిటారిస్ట్ లు, ర్యాప్ సింగర్స్ అట! వాళ్లిద్దరూ ఎంత ఒత్తిడిని అయినా చిత్తు చేసి నవ్వించి తేలిక చేసేస్తుంటారని శ్రీచరణి కితాబునిచ్చింది!

భారత పురుషుల క్రికెట్ టీమ్ లో రాజకీయాలు వున్నట్లే మహిళా టీమ్ లోనూ బోలెడు రాజకీయాలు, అణచివేతలు షరా మామూలే! అవమానాలు తొక్కేయడాలు అంతే స్థాయిలో ఉంటాయి! అయినా అవమానాలు ఎదుర్కొని, రాజకీయాలను తట్టుకుని నిలదొక్కుకుని విజయాలను అందిస్తూ భారతీయ జెండాను రెపరెపలాడిస్తున్న మహిళా క్రికెటర్లకు సెల్యూట్! ఎందరో యువతకు స్ఫూర్తినిచ్చిన పంజాబీ పిల్ల హర్లిన్ కౌర్ డియోల్ కు స్పెషల్ సెల్యూట్!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!