Ravi Vanarasi……………..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత విద్యా రంగంలోకి ప్రవేశించి అద్భుతమైన కృషి చేసిన అరుదైన వ్యక్తిత్వం స్వరూప్ సంపత్ ది. ఆమె కేవలం ఒక నటిగా, మోడల్‌గా, ‘మిస్ ఇండియా’గా మాత్రమే కాక, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యావేత్తగా, పరిశోధకురాలిగా, ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ ఫైనలిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఆమె జీవిత ప్రయాణం గ్లామర్, కళ, మేధస్సు, సామాజిక సేవ… ఈ నాలుగింటి కలయికగా కనిపిస్తుంది. నటనలో రాణించిన తరువాత, కేవలం పేరు ప్రఖ్యాతులతో సరిపెట్టుకోకుండా, విద్యారంగంలో ముఖ్యంగా అభ్యాసన వైకల్యాలు (Learning Disabilities) ఉన్న పిల్లల కోసం నాటక మాధ్యమాన్ని ఉపయోగించి వినూత్నమైన మార్పును తీసుకురావాలని సంకల్పించారు..ఇది ఆమె వ్యక్తిత్వ గొప్పదనాన్ని తెలియజేస్తుంది.
స్వరూప్ సంపత్ 1958 నవంబర్ 3వ తేదీన అప్పటి బొంబాయి రాష్ట్రంలోని గుజరాత్‌లో జన్మించారు. ఆమె కుటుంబ నేపథ్యం కళలు, వైద్యం వంటి విభిన్న రంగాల మేళవింపు. ఆమె తండ్రి, బచు సంపత్, గుజరాతీ రంగస్థలంలో ఒక సుప్రసిద్ధ నటుడు. బచు సంపత్ గుజరాతీ నాటక రంగానికి చేసిన సేవలు అపారమైనవి.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, చిన్నప్పటి నుండి కళల పట్ల, ముఖ్యంగా నాటక రంగం పట్ల స్వరూప్ మమకారం పెంచుకున్నారు. ఆమె తల్లి, మృదుల సంపత్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ (శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేసే వైద్య నిపుణురాలు). వైద్యరంగం, కళారంగం రెండింటి ప్రభావం ఆమెపై పడింది.
కళాశాల రోజుల్లో స్వరూప్ సైన్స్ విభాగంలో చదువుతూనే, నాటకాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆమె పీటర్ షాఫర్ రాసిన ప్రసిద్ధ నాటకం ‘ఈక్వస్’ (Equus) గుజరాతీ అనుసరణలో నటించారు. ఈ నాటక ప్రదర్శన తర్వాత ఆమె జీవితంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది.ఆమె భవిష్యత్ జీవిత భాగస్వామి, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరైన పరేశ్ రావల్‌ను కలిశారు.
పరేశ్ రావల్ ఆ సమయంలోనే రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇద్దరి మధ్యా కళల పట్ల ఉన్న అభిరుచి, నాటకం పట్ల ఉన్న పిచ్చి ఒక బలమైన బంధానికి పునాది వేసింది. 1987లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పరేశ్ రావల్ భారతీయ సినీ పరిశ్రమలో నటుడిగా సుప్రసిద్ధులు.వారిద్దరూ కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా, కళాత్మక భాగస్వాములుగా కూడా ఉన్నారు.
ఆమె తన భర్త నటించిన నాటకాలకు దర్శకత్వం వహించడం లేదా వాటిలో నటించడం వంటివి కూడా చేశారు. రంగస్థల నటులుగా వారిద్దరూ కలిసి అనేక నాటకాలను ప్రదర్శించారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు – అనిరుధ్, ఆదిత్య. అనిరుధ్ కూడా నటన రంగంలోకి ప్రవేశించారు. కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత వృత్తి జీవితాన్ని అత్యంత సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ, స్వరూప్ సంపత్ అనేక మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.
స్వరూప్ సంపత్ జీవితం రెండు స్పష్టమైన దశలుగా విభజించబడింది. మొదటి దశ గ్లామర్, నటన, ప్రజాదరణతో కూడినది కాగా, రెండవ దశ లోతైన విద్యా పరిశోధన, సామాజిక సేవ, ఉపాధ్యాయ శిక్షణతో కూడినది. ముఖ్యంగా ఆమె నటన జీవితానికి తాత్కాలికంగా విరామం ఇచ్చిన తరువాత విద్యా రంగంలో సాధించిన ఉన్నత స్థాయి విద్య, ఆమె అసాధారణ మేధస్సుకు నిదర్శనం.
నటన రంగంలోకి అడుగు పెట్టకముందే, స్వరూప్ సంపత్ ఒక మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1979 సంవత్సరంలో, ఆమె ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయం ఆమె జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది.
ఈ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా, ఆమె అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఆ సంవత్సరమే ‘మిస్ యూనివర్స్ 1979’ పోటీలో భారతదేశం తరపున పాల్గొన్నారు. అందాల పోటీల్లో గెలవడం ఆమెకు కేవలం ప్రఖ్యాతిని మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపును, మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశాన్ని కల్పించింది.
‘మిస్ ఇండియా’ టైటిల్ ఆమెకు బాలీవుడ్ ప్రవేశానికి ఒక బలమైన మార్గాన్ని సుగమం చేసింది. ఈ విజయం తరువాత, ఆమె మోడలింగ్ ప్రపంచంలో మరింత చురుకుగా మారారు. ముఖ్యంగా, ‘శృంగార్’ అనే కుంకుమ సంస్థకు ఆమె మోడల్‌గా వ్యవహరించారు.ఫెమినా మిస్ ఇండియాగా ఆమె ప్రయాణం కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక నటిగా, ప్రజాకర్షణ ఉన్న వ్యక్తిగా ఆమె స్థానాన్ని పదిలం చేసింది.
మిస్ ఇండియా కిరీటం తర్వాత, స్వరూప్ సంపత్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె నటనా జీవితం 1980వ దశకంలో మొదలైంది. ఆమె నటించిన తొలి చిత్రాలలో ప్రముఖమైనవి 1981లో విడుదలైన ‘నరం గరం’, ‘నఖుదా’. ‘నరం గరం’ ఈ చిత్రం హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఒక అద్భుతమైన హాస్య చిత్రం.
ఇంకా హిమ్మత్ వాలా,లోరీ,కరిష్మా,’సాథియా వంటి చిత్రాలలో నటించారు. నటన నుండి విరామం తీసుకున్న తర్వాత, కేవలం గృహిణిగా ఉండకుండా, ఆమె తన మేధస్సును సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
స్వరూప్ సంపత్ విద్యా రంగంలో తన డాక్టోరల్ పరిశోధన కోసం ‘యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్’, యునైటెడ్ కింగ్‌డమ్ ను ఎంచుకున్నారు. ఆమె పరిశోధనా సిద్ధాంతం (Doctoral Thesis) అంశం చాలా ముఖ్యమైనది: ‘అభ్యాసన వైకల్యాలు ఉన్న పిల్లలలో జీవిత నైపుణ్యాలను (Life Skills) మెరుగుపరచడానికి నాటకాన్ని ఉపయోగించడమే దాని లక్ష్యం.
ఈ పరిశోధన, అభ్యాసన వైకల్యాలు (Learning Disabilities) ఉన్న పిల్లల విద్యకు కొత్త దిశానిర్దేశం చేసింది. డిస్లెక్సియా, డిస్‌గ్రాఫియా, డిస్‌కాల్కులియా, డిస్‌ప్రాక్సియా వంటి నిర్దిష్ట అభ్యాసన వైకల్యాలు ఉన్న పిల్లలు కేవలం చదువులోనే కాక, సామాజిక, భావోద్వేగ జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతుంటారు.
ఈ పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఇతరులతో సంభాషించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి నాటకం శక్తివంతమైన సాధనంగా ఎలా ఉపయోగపడుతుందో ఆమె తన పరిశోధన ద్వారా నిరూపించారు.
తన డాక్టోరల్ పరిశోధన ఫలితాలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, స్వరూప్ సంపత్ 2010లో ‘లెర్నింగ్ డిసేబిలిటీస్ ఇన్ ఎ నట్‌షెల్: డిస్లెక్సియా, డిస్‌గ్రాఫియా, డిస్‌కాల్కులియా, డిస్‌ప్రాక్సియా’ (Learning Disabilities in a Nutshell: Dyslexia, Dysgraphia, Dyscalculia, Dyspraxia) అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకానికి నటుడు ఆమిర్ ఖాన్ ముందుమాట రాయడం విశేషం.
pl.read it ….. సంగీత జగత్తులో సాటిలేని విద్వాంసుడు!

