Mohammed Rafee……..
తేరే ఇష్క్ మే… పన్నెండేళ్ల క్రితం విడుదలైన ‘రాంఝన’ సినిమా సీక్వెల్ ఇది. ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ.. మెలో డ్రామా మూవీ! తమిళ సినిమాలు పాన్ ఇండియాకు సెట్ కావు! రాంఝన బాలీవుడ్ సినిమాగా సూపర్ హిట్ అయినా, దాని సీక్వెల్ తమిళ నటుల చేతిలో తుస్సుమంది.
తమిళ హీరోలకే కాదు అక్కడి ప్రేక్షకులు కూడా హీరో నుంచి ఓవర్ డోస్ హింస కోరుకుంటారు. ‘తేరే ఇష్క్ మే’ లో కూడా అదే ఎక్కువైంది. కొన్ని సన్నివేశాలు మాత్రం హృదయాన్ని టచ్ చేశాయి. ఓవరాల్ సినిమా చూడొచ్చు. క్లయిమాక్స్ లో హీరో హీరోయిన్లను “పైకి” పంపించడం తమిళ ప్రేక్షకుల టేస్ట్.
హీరో హీరోయిన్ లలో ఏ ఒక్కరిని దర్శకుడు కథా పరంగా చంపేసినా మన తెలుగు ప్రేక్షకులు అంగీకరించరు. ఈ సినిమాలో ఇద్దరినీ చంపేశాడు దర్శకుడు ఆనంద్ రాయ్. కొంచెం ప్రేమ తడి వున్నవారికి, ప్రేమ గురించి తెలిసిన వారికి ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది.
ధనుష్ కృతి సనమ్ నటనలో ప్రేమలో పోటీ పడ్డారు. ప్రేమ బాధను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమలో పడితే ఎంత హాయిగా ఉంటుందో అంతకు రెట్టింపు బాధ ఉంటుంది. అంతకు మించి మనసు సంఘర్షణ ఉంటుంది. లోపల ప్రేమ ఉంచుకుని దాచుకుని ఎదుటి మనిషికి చెప్పలేక భరించే ఒత్తిడి నరకమే.
ప్రేమిస్తావా, చంపేస్తావా, ఇద్దరూ కలసి చచ్చిపోదామా రేంజ్ ప్రేమ… తేరే ఇష్క్ మే! ధనుష్ ప్రేమ పీక్స్ కు వెళ్లి “చస్తావా చచ్చిపోదామా” అంటూ ఏకంగా పెట్రోల్ బాటిల్ పట్టుకుని తిరిగే మూర్ఖుడ్ని ఏ ప్రేమిక అయినా భరించగలదా?
హింసాత్మకంగా తిరిగే యూనివర్సిటీ స్టూడెంట్స్ లీడర్ తో స్నేహం చేసి మంచిగా మార్చే ప్రయత్నంలో ప్రేమలో పడి భయపడి తండ్రితో UPSC లో ర్యాంక్ సాధించి IAS కావాలని షరతు పెట్టించిన తీరు ఈతరం యువతకు గొప్ప ఇన్-స్పిరేషన్ అనే చెప్పాలి.
అనేక మలుపులు అనంతరం చివరకు కలుసుకోవడం, ప్రియురాలి భర్తను కాపాడే ప్రయత్నంలో తను నడిపే జెట్ ఫ్లైట్ ను చైనా ఓడకు ఢీ కొట్టి ప్రాణ త్యాగం చేయడం, అదే సమయంలో లివర్ సిరోసిస్ తో బాధపడే కృతి బిడ్డకు జన్మనిచ్చి కనుమూయడం… ఇదీ పైపై కథ. సినిమా చూడాలనుకునే వారికి ఇబ్బందిగా ఉండకూడదని కథను లోతుగా కాకుండా తేలిగ్గా చెప్పాను.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ధనుష్ నటన. శంకర్ పాత్రలో ఆయన చూపించిన తీవ్రత, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కృతి సనన్ తన పాత్రకు న్యాయం చేసింది.. ధనుష్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.ఎ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. పాటలు సూపర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు ప్రాణం.
ధనుష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఒక మంచి పాత్రలో కనిపిస్తారు. ముందే చెప్పుకున్నట్లు తమిళ సినిమా హింస ఎక్కువ కాబట్టి ఆయన్ని కూడా చంపేశారు! తమిళ సినిమాలకు అలవాటు పడ్డ వారికి ఈ సినిమా సూపర్ గా ఉంటుంది. తెలుగులో అమర ప్రేమ పేరుతో డబ్ చేశారు. తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. నా అభిప్రాయం ఏమిటంటే… తమిళ నటులతో పాన్ ఇండియా సినిమాల జోలికి రాకపోవడమే సో బెటర్.

