Ravi Vanarasi ………………
ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలలో ఇటీవల ఒక వార్త సంచలనం సృష్టించింది. నమీబియాకు చెందిన ఒక స్థానిక రాజకీయ నాయకుడు తాజా ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో విజయం సాధించాడు. మళ్ళీ పోటీ .. సాధించిన విజయం కంటే, ఆ రాజకీయ నాయకుడి పేరు మరింత చర్చనీయాంశమైంది – అతని పేరు ‘అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా.’
అయిదేళ్ల తర్వాత ఈ విషయం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకుంది.. ఇపుడు అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా పేరుపై మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది.ప్రపంచ చరిత్రలోనే అత్యంత అపఖ్యాతి పాలైన నియంత, జర్మనీకి చెందిన అడాల్ఫ్ హిట్లర్‌తో పోలిక కలిగి ఉండటం వల్ల, ఈ వార్త నమీబియా సరిహద్దులను దాటి, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది.
ఎవరీ కొత్త హిట్లర్ అని కూపీ లాగితే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి.అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా పేరు గురించి తెలుసుకునే ముందు నమీబియా సంక్లిష్టమైన చరిత్రను పరిశీలించాలి. నమీబియా పూర్వపు నైరుతి ఆఫ్రికా, 1884 నుండి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు దాదాపు 30 సంవత్సరాల పాటు జర్మన్ కాలనీగా ఉంది.
1884 నుంచి 1915 వరకు జర్మన్ వలస పాలన సాగింది ఇక్కడ.నమీబియాలోని స్థానిక తెగల పట్ల , ముఖ్యంగా హెరెరో, నామా తెగలపై జర్మన్ పాలకులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. 1904-1908 మధ్య జరిగిన హెరెరో, నామా జాతి నిర్మూలన చరిత్రలోనే అత్యంత దారుణమైన అధ్యాయాలలో ఒకటి.
ఆకాలంలో, జర్మన్ భాష, సంస్కృతి, పేర్ల ప్రభావం స్థానిక ప్రజలపై గణనీయంగా పడింది. అనేక మంది నమీబియన్లు తమ పిల్లలకు ఉద్దేశపూర్వకంగా లేదా అవగాహన లేకుండా, జర్మన్ పేర్లను పెట్టుకునే వారు. జర్మనీ పేర్లను అనుకరిస్తూ అసలు పేరుకు వెనుక ముందు తగిలించే వారు. ఈ నాటికి నమీబియాలోని కొన్నిప్రాంతాలలో జర్మన్ భాష మాట్లాడతారు. అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా తండ్రికి నియంత అడాల్ఫ్ హిట్లర్ దుశ్చర్యల గురించి పూర్తి అవగాహన లేదని అంటారు.
ఇక అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా, నమీబియాలోని అధికార పార్టీ స్వాపోలో క్రియాశీల సభ్యుడు. స్వాపో పార్టీ, నమీబియా స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ. ఊనోనా, ఓషానా ప్రాంతంలోని ఓంపియుజా నియోజకవర్గం నుండి ప్రాంతీయ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
నమీబియాలో స్థానిక రాజకీయాలలో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు, తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.అతను స్వాపో పార్టీ తరఫున సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉన్నాడు, స్థానికంగా మంచి ప్రజాదరణ పొందాడు. 2020 నవంబర్‌లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలలో, అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా తన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు.ఇపుడు రెండో సారి ఎన్నికల్లో పోటీ చేసాడు.
ఈ ఎన్నికలలో అతని పేరు వార్తాపత్రికలు, టీవీలలో ప్రముఖంగా కనిపించింది, ఆ సమయంలోనే అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది ఆ పేరుపై చర్చలు జరిగాయి. మరో హిట్లర్ అంటూ మీడియా ఊదర గొట్టింది. అంతర్జాతీయంగా తన పేరుపై వ్యక్తమైన ఆందోళనలు, విమర్శల పట్ల అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా కూడా స్పందించాడు.
చారిత్రక నియంతతో, ఆయన సిద్ధాంతాలు, చర్యలు లేదా చరిత్రతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించారు.నా తండ్రి జర్మన్ నియంతకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకోలేదని తేల్చి చెప్పాడు. తన పేరు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, దానిని మార్చుకోవడానికి ఆయన నిరాకరించారు.
ఆయన వాదన ప్రకారం, తన జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఈ పేరును మార్చుకోవడం అంటే తన గుర్తింపును వ్యక్తిత్వాన్ని తిరస్కరించినట్లే అవుతుంది.”నేను నా పేరుతోనే ఉన్నాను. నేను ప్రపంచాన్ని జయించాలనుకోవడం లేదు” అని చమత్కారంగా చెబుతూ, తన రాజకీయం కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైందని స్పష్టం చేశారు.
నమీబియాలో, ‘అడాల్ఫ్’ అనే పేరును చాలా సాధారణమైన పేరుగా పరిగణిస్తారు.. ముఖ్యంగా జర్మన్ ప్రభావం ఉన్న ప్రాంతాలలో. ఊనోనా తన పేరును “అడాల్ఫ్” అని మాత్రమే ఉపయోగిస్తారు, “హిట్లర్” భాగాన్ని సాధారణంగా తన రోజువారీ కార్యకలాపాలలో రాజకీయాలలో ఉపయోగించరు.అయినప్పటికీ, పూర్తి పేరు ఎన్నికల పత్రాలలో ఉన్నందున, అది అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
అడాల్ఫ్ హిట్లర్ ఊనోనా పేరుపై ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మీడియా కవరేజీని పరిశీలిస్తే, అందులో కొంత అతిశయోక్తి ఉద్దేశపూర్వక దృష్టి మరలింపు ఉన్నట్లు స్పష్టమవుతుంది.అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఈ పేరులోని వింతను, వివాదాన్ని మాత్రమే హైలైట్ చేసి, నమీబియా చారిత్రక సందర్భాన్ని, ఊనోనా వివరణను సరిగా వివరించడంలో విఫలమయ్యాయి.
నమీబియా ప్రజలకు, ఊనోనా పేరు కంటే, అతని రాజకీయ పనితీరు, స్వాపో పార్టీ సభ్యత్వం మాత్రమే ముఖ్యం. అతని పేరు స్థానిక రాజకీయాలలో ఎప్పుడూ పెద్ద సమస్యగా మారలేదు. ఊనోనా జర్మనీ నియంత చరిత్ర, దౌర్జన్యాలను దృఢంగా ఖండిస్తున్నాడు అనేది ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.అతను తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఒక స్థానిక నాయకుడు మాత్రమే. అతని పనితీరు, ప్రజా సేవలే ఇక్కడ కీలకం.

