Committed actress Lijomol Jose……………………..
ఫొటోలో ఉన్న లిజో మోల్ ను గుర్తు పట్టారా ? అదేనండీ జైభీమ్ లో “సిన తల్లి” పాత్ర చేసిన నటి.. తనిప్పుడు మలయాళ, తమిళ సినిమాల్లో బిజీగా ఉంది. కమిట్ మెంట్ ఉన్న నటి . కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.డైరెక్టర్ రచయితలతో మాట్లాడి పాత్రను స్టడీ చేసి తెరపై ఆ పాత్ర సజీవంగా కనబడేందుకు కృషి చేస్తుంది.
జైభీమ్ సినిమా లోని సీనతల్లి పాత్ర కోసం ఎంతో ఆమె కష్టపడింది. గిరిజన మహిళ మాటతీరు, కట్టూబొట్టూ నేర్చుకోవడానికి ఆరు నెలలు శిక్షణ తీసుకుంది.కొంతకాలం ఆదివాసీల మధ్యే గడిపారు. పూరి గుడిసెలో కొన్నాళ్ళు ఉందట. చివరికి ఎలుకలు పట్టడం కూడా నేర్చుకున్నారు. ఆ సమయంలోనే తమిళం నేర్చుకోవడంలో నటుడు మణి కందన్ చాలా సాయం చేశారు.
డబ్బింగ్ సమయంలో తాను డైలాగులు చెబుతుంటే కళ్ళ వెంట నీళ్లు కారేవి. పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లు .. రాజన్న మరణం తర్వాత సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు కూడా అంతే. దర్శకుడు ‘కట్’ చెప్పిన తర్వాత కూడా కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. నేను గ్లిజరిన్ అస్సలు ఉపయోగించలేదు. తెరపై కనిపించేవన్నీ నిజమైన కన్నీళ్లే.” అని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
గిరిజన మహిళ గా భర్త కోసం పోరాటం చేసిన పాత్ర లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. ‘సినతల్లి’గా అందరి మన్ననలు అందుకున్నది. కేరళలోని ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందిన జొస్ అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేసింది.ఆ తర్వాత కొన్నాళ్ళు ఒక కేరళ చానల్‌లో పని చేసింది. పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్‌లో జొస్ మాస్టర్స్ చదివింది.
ఆ సమయంలోనే స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపించింది. ఆడిషన్స్‌లో మూడు రౌండ్ల అనంతరం హీరో ఫహద్ ఫాజిల్ నటించిన ‘మహాశింటే ప్రతీకారం’ సినిమా కోసం ఎంపికైంది. అలా చిత్ర పరిశ్రమ లోకి ప్రవేశించింది.
2016లో వచ్చిన ‘రిత్విక్ రోషన్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్ నటిగా ఎదిగింది.ఈక్రమం లోనే హీరో సిద్దార్థ్ నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చాయ్’మూవీతో హీరోయిన్‌గా నటించింది. ఇందులో సిద్ధార్థ్‌కు జోడిగా నటించి ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది.
ఈ సినిమాలు కాకుండా స్ట్రీట్ లైట్స్, ప్రేమ సూత్రం, ఒత్త కోరు కాముకన్, తీతుమ్ నండ్రుమ్ చిత్రాల్లో జొస్ నటించింది. స్వల్పకాలంలోనే పరిశ్రమ దృష్టి లో పడింది.జొస్ తన బంధువు ..స్నేహితుడైన అరుణ్ ఆంటోనీ ని పెళ్లి చేసుకుంది.గృహిణిగా మారినా నటిగా కొనసాగుతోంది.
‘జై భీమ్’ (2021) సినిమా తర్వాత కూడా మలయాళం, తమిళ భాషల్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘ పుత్తం పుదు కాళై విడియాధా’ అనే తమిళ వెబ్ సిరీస్లో ఆమె ‘లోనర్స్’ (Loners) అనే ఎపిసోడ్‌లో నటించారు.విశుధ మేజో, అయల్వాషి, పులిమడ ,హెర్ ,నడన్న సంభవం,ఐ యామ్ కథలన్ వంటి మలయాళ చిత్రాల్లో నటించారు.
ఇటీవల విడుదలైన పొన్మన్ మలయాళ చిత్రంలో నటించారు. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది.అలాగే క్యాగంగళ్, జెంటిల్‌ఉమన్, కాదల్ ఎన్బతు పొదువుడమై వంటి తమిళ చిత్రాల్లో నటించారు.
మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు, వాటిలో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఆమె నాణ్యమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ, కథ నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తున్నారు.

