Sensational director…………………
అభ్యుదయానికి టి. కృష్ణ ప్రతిరూపం. ఆయన తీసిన సినిమాలు కూడా ఆ కోవలోనివే.. కృష్ణ తీసిన ఆరు తెలుగు సినిమాలు సంచలనం సృష్టించినవే. తన చిత్రాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఖ్యాతి ఆయనకు దక్కుతుంది.
నేటి భారతం, దేశంలోదొంగలు పడ్డారు,దేవాలయం,వందేమాతరం ,ప్రతిఘటన,రేపటి పౌరులు వంటి తెలుగు సినిమాలతో పాటు ‘ఇందిన భారత’ అనే కన్నడ సినిమా తీశారు.నేటి భారతం కన్నడ వెర్షన్ అది.
ఒంగోలు csr శర్మా కాలేజీ లో చదువుతున్నప్పుడే నటుడు మాదాల రంగారావు – టి. కృష్ణ స్నేహితులు. టి. కృష్ణ ముందుగా సినిమాల్లోకి వెళ్ళారు. నాటి ప్రముఖ దర్శకుడు గుత్తా రామినీడు దగ్గర అసిస్టెంట్ గా చేరారు.ఒకటి రెండు సినిమాలకు పనిచేసి .. అక్కడ నచ్చక తిరిగి ఒంగోలు వచ్చి పొగాకు వ్యాపారం లోకి దిగారు.
ప్రజా నాట్యమండలి కార్యక్రమాలకు హాజరయ్యేవారు. నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది టి. కృష్ణే.మాదాల కొన్ని సినిమాల్లో చేసి .. సొంతంగా సినిమా తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దశలో మళ్లీ కృష్ణ మద్రాస్ వెళ్లి మాదాలకు సాయంగా నిలిచారు. ‘యువతరం కదిలింది’ లో ఒక చిన్న పాత్ర కూడా చేసారు.

తర్వాత కాలంలో ఒక సినిమా స్క్రిప్టు మార్పులపై తన మాట వినని మాదాలతో విభేదించి కృష్ణ తానే దర్శకుడయ్యారు.ఈ దశలో టి.కృష్ణ కు సహకరించింది పోకూరి బాబూరావు. వీళ్లద్దరూ కూడా శర్మా కాలేజి లో చదువుకున్నారు. ఇద్దరు నటులు. గాయకులే.
ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో ఇద్దరూ భాగస్వాములే. బాబూరావు అపుడు ఒంగోలు ఆంధ్రా బ్యాంకు లో పని చేసేవారు. అందుకే సినిమాలో తన పేరు కాకుండా నిర్మాత గా తమ్ముడి పేరు వేశారు. రెండు లక్షల రూపాయలతో సినిమా ప్రారంభించిన ఆ ఇద్దరూ ‘నేటి భారతం’ సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టాలు పడ్డారు.
మోదుకూరి జాన్సన్, హరనాథరావు ‘నేటి భారతం’ సినిమా కు మాటలు రాశారు. పి. ఎల్. నారాయణ తనపాత్రకు తానే డైలాగులు రాసుకున్నారు. సినిమాలో మాటలు తూటాల్లా పేలాయి. సినిమా ఊహించిన దానికంటే హిట్ అయింది. కృష్ణ పి.ఎల్.నారాయణ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ ను పి. ఎల్. నారాయణ పరిశీలించేవారు.
నేటి భారతం టైటిల్ కి తగ్గట్టు వ్యవస్థల పనితీరు, వాటి లోపాలు ఆధారంగా కథ అల్లుకున్నారు. ఎక్కడా బోర్ కొట్ట కుండా సాగుతుంది సినిమా. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ చేసారు. స్థానిక కళాకారులను కూడా ప్రోత్సాహించారు.
అప్పటినుంచి కృష్ణ వెనుతిరిగి చూడలేదు. కృష్ణ సినిమాల ద్వారా విజయ శాంతి మంచి పేరు సంపాదించారు. వందేమాతరం శ్రీనివాస్ ను గాయకుడిగా మార్చింది కృష్ణే. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
టి. కృష్ణ పూర్తి పేరు తొట్టెంపూడి కృష్ణకుమార్. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో రత్తమ్మ, వెంకట సుబ్బయ్య దంపతులకు 1950 సెప్టెంబర్ 1న ఆయన జన్మించారు. ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కళాశాలలో బీఏ చదివారు. కళాశాల జీవితం, మిత్రుల సాహచర్యం, ‘అన్న’ నల్లూరు వెంకటేశ్వర్లు పరిచయం టి. కృష్ణను మేటి కళాకారుడిగా, సంచలన సినీ దర్శకుడిగా తీర్చి దిద్దాయి.
చదువు కోసం టి. కృష్ణ 1965లో ఒంగోలుకు వచ్చారు. టాగూరు ట్యుటోరియల్ కళాశాలలో మెట్రిక్ చదువుతూ స్టూడెంట్ ఫెడరేషన్ మెస్లో చేరారు. ప్రజానాట్య మండలి ఒడిలో, నల్లూరు వెంకటేశ్వర్లు శిక్షణలో పెరిగారు. నాటక ప్రదర్శనలకు అవాంతరం కలుగకూడదనే ధ్యేయంతో బీఏ కోర్సు తీసుకుని పూర్తిచేసారు.
నాటకరంగం పట్ల విపరీతమైన మక్కువ ఉన్న ఆయన పలు నాటక పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. రచయితలు ఎంవీఎస్ హరనాథరావు, ఇసుకపల్లి మోహనరావు తదితరులు కూడా ఆయన మిత్రులే. బొల్లిముంత శివరామకృష్ణ రచించిన ‘సంభవామి యుగేయుగే’ నాటిక టి. కృష్ణకు మంచి పేరు తెచ్చింది.
తెలుగులో మరో టి .కృష్ణ ఉన్నారు. ఆయన శోభన్ బాబు తో ‘ఖైదీ బాబాయ్’ వంటి సినిమాలు తీశారు. పేరు ఒకటే కానీ ఇద్దరూ వేరువేరు. ఇద్దరూ ఒకటే అనుకునే వారు లేకపోలేదు. ప్రముఖ సినీ హీరో టి. గోపీచంద్ టి కృష్ణ కుమారుడే.
సంచలన సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ కేన్సర్ వ్యాధికి గురయ్యారు. మూడు నెలలపాటు అమెరికాలో చికిత్స కూడా పొందారు. అయినా ఆ వ్యాధి తగ్గలేదు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 1986 అక్టోబరు 21న అభిమానులను, ఆత్మీయులను దుఃఖసాగరంలో ముంచి తిరిగిరాని దూరతీరాలకు తరలిపోయారు.

