Nandiraju Radhakrishna …………..
ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు పంతులు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. గుంటూరులో ఈ నాటకాన్ని పూర్తి గా చూసాను – ఎంతో ఆసక్తికరం అనిపించింది.1892లో రచించిన ఈ నాటకం, ఆధునిక భారతీయ భాషల్లో తొలి సామాజిక నాటకాలలో ఒకటి. అందులోను తెలుగులో సామాజిక అంశాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చిన తొలి ప్రయత్నం.
ఈ నాటక శీర్షిక “కన్యాశుల్కం” అంటే చిన్నపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లిచేసి డబ్బు తీసుకునే దురాచారం. అప్పటి సమాజంలో ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ నాటకం వివాదాస్పదమయినా, ఇప్పటికీ ఇది అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు సాహిత్య కృతుల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో డైలాగులు ఈనాటికీ జనాల్లో ప్రసిద్ధంగా ఉన్నాయి.
ఈ నాటకాన్ని రాయడానికి గల కారణాన్ని గురజాడ మొదటి సంచిక ఆంగ్ల ఉపోద్ఘాతంలో ఇలా చెప్పుకొచ్చారు …”ఇలాంటి అసభ్యమైన ప్రవర్తనలు సమాజానికి కళంకం. వీటిని వెలికి తీయడం, ఉన్నతమైన నైతిక విలువలను ప్రాచుర్యంలోకి తేవడం లిటరేచర్ యొక్క గరిష్ఠమైన పాత్రగా భావించాలి. సామాన్య ప్రజల్లో చదువుకునే అలవాటు వచ్చేవరకు, కళా రూపంలో ఈ ప్రభావాన్ని చూపించాలి.”
ఆ కాలంలో తెలుగు రచనలు చాలా కఠినమైన శైలి, సంస్కృత వచనంతో ఉండేవి. అవి కేవలం చదువుకున్న వారికే అర్థమయ్యేవి. కానీ గురజాడ ప్రజల భాషలో, వినోదాత్మకంగా, అర్థవంతంగా రాసి సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నాటకం బ్రిటిష్ భారతదేశంలోని విజయనగరం సంస్థానంలో జరిగింది.
ఆంగ్ల విద్యాభ్యాసం చేసినప్పటికీ నీతి, నైతికత లేని గిరీశం అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. మధురవాణి, వేశ్య అయినప్పటికీ, నిజాయితీగా, ధైర్యంగా, దయతో ఉండే మహిళగా చిత్రించబడింది.నాటకంలో కొన్ని అణచివేత సంఘటనలు ఉన్నాయి.
ఉదాహరణకు అగ్నిహోత్రవధానులు, తన చిన్న కుమార్తెను ఒక వృద్ధుడికి డబ్బుకోసం పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, పెద్ద కుమార్తె అభ్యర్థించినపుడు ఆమె ముఖంపై భోజనపత్రాన్ని విసిరి కొట్టిన ఘోర సన్నివేశం మానవతా వాదుల హృదయాలను కదిలిస్తుంది.
అలాగే “మడి” వంటి ఆచారాలను హాస్యాత్మకంగా విమర్శించారు. ఒక పాత్ర “టచ్మీ-నాట్” గింజలాగా ఎవరినీ దగ్గరికి అనుకోకుండా తిరుగుతుంది – శుద్ధి పోతుందేమోనన్న భయం! నాటకంలో హాస్యమే కాదు – లుబ్ధావధానులు అనే కంజుసుడు చివరికి పెద్దబ్బాయిని అమ్మాయి అనుకోని పెళ్లి చేసుకోవడం వంటి ఘట్టాలు వినోదాన్ని కలిగిస్తాయి.
గిరీశం, అతని ప్రేమ వ్యవహారాలు కూడా నాటకానికి హాస్యరసాన్ని తెస్తాయి. ప్రతి పాత్రను రచయిత చాలా నిజాయితీగా, బహిరంగంగా చూపించారు.. గిరీశం – అనుభవం లేని, పనికిమాలిన యువకుడు. తక్షణ సంతోషాలు, డబ్బు కోసమే జీవించే వాడు. తన ప్రగతిశీలతను మాటలకే పరిమితం చేసే వాడు.
రామప్ప పంతులు – ఓ మధ్యవర్తిగా తన ప్రయోజనం కోసం ఆటలాడే వాడు, కానీ చివరికి తానే చిక్కుకుంటాడు.
మధురవాణి, పూటకూళ్లమ్మ మాత్రమే ధైర్యంగా, నైతికంగా నిలిచిన పాత్రలు. పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ “గిరీశం” “రామప్పంతులు” పాత్రల్లో చూపారు. “మధురవాణి” పాత్ర ను బాగా మలిచారు. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా మారుతుంది.
రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది. ఆమె సంస్కారవతి. దురాచారాల్ని సహించదు. కన్య వేషంలో ఉన్న శిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో తన తెలివితేటలు చూపుతుంది.
నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను కుటిల దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁను” అనే అవకాశవాద, కపట బుద్ధి గలవాడు.
అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతన ఆచారాలున్నవాడు సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు.
ఒక్కో పాత్రను ఒక్కో అద్భుతంగా సృష్టించారు గురజాడ.ఈ నాటకంలో షాకులు, ట్విస్టులు ఉండవు – కానీ నిజమైన సమాజాన్ని అద్దంలా చూపిస్తుంది. ఎంతో మంది కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.. తర్వాత కాలంలో సినిమా గా కూడా తీశారు.

