‘ఎయిర్ ఇండియా’ ను టాటాలు కొనుగోలు చేస్తారా ?

Sharing is Caring...

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది.  పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది  సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 నుంచే సరిగ్గా జీతాలు , అలవెన్సులు ఇవ్వడం లేదని సిబ్బంది మీడియాతో మొరపెట్టుకున్నారు.

మరో వైపు  రూ.62,000 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా ను  గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రయివేటీకరణ బాట పట్టింది. ఎయిరిండియాలో  76 శాతం మెజార్టీ వాటాను అమ్మేయాలని నిర్ణయించి 2018  మేలో బిడ్స్ ను ఆహ్వానించగా  ఈ వాటాను కొనుగోలు చేసేందుకు  ఒక్క కంపెనీ కూడా  ముందుకు రాలేదు. వాటాల కొనుగోలుకు   ప్రభుత్వం పెట్టిన షరతులు చూసి దేశ, విదేశాలకు చెందిన విమాన సంస్థలేవీ ఆసక్తి చూప లేదు. కంపెనీలనుంచి స్పందన కొరవడడానికి కారణాలలో ఎయిర్ ఇండియా కున్న అధిక రుణం ప్రధానమైనదని నిపుణులు చెబుతున్నారు. అంత రుణ భారాన్ని చూసి కంపెనీలు బెదిరి పోయాయి.  ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో ఎయిర్‌ ఇండియా  నెట్టుకొస్తోంది. కాగా  ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల సంఘం  ప్రైవేటీకరణ ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తోంది.  ప్రైవేటీకరించే బదులు ఎయిర్‌ ఇండియాకు ఉన్న రూ.62,000 కోట్ల అప్పుల్లో రూ.30,000 కోట్లు రద్దు చేయాలని అప్పట్లోనే కోరింది.

సంస్థను ప్రైవేటీకరిస్తే 25,000 మంది ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వలనే ఎయిర్‌ ఇండియా ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ఒక దశలో ఎయిరిండియాను దాని మాతృసంస్థ  టాటా గ్రూప్‌ సింగపూర్  ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వచ్చాయి.  ఎయిరిండియా జాతీయం కాకముందు టాటాగ్రూప్‌లోనే  ఉండేది. దేశంలో పౌర విమానయాన పరిశ్రమకు నాంది పలికింది టాటాలే. వారు నిర్వహించిన సంస్థనే ప్రభుత్వం సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాలపాటు నడిపి, తప్పుడు నిర్ణయాలతో నష్టాల పాలు చేసింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టింది.

2007 నుంచి ఎయిరిండియా నష్టాల బాటలోనే నడుస్తోంది. ఇక గతంలోకి వెళితే  టాటా ఎయిర్‌లైన్స్‌ 1932లో ప్రారంభమైంది. లెజండరీ పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచి, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియా పేరుతో పబ్లిక్‌ కంపెనీగా మార్చారు. జెఆర్‌డి కలల పుత్రికగా చెప్పే ఎయిర్‌ ఇండియా.. టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. 1953లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయడంతో జెఆర్‌డి కలలు కుప్పకూలాయి. కనీసం తమతో మాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను జాతీయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పట్లోప్రభుత్వానికి  జెఆర్‌డి లేఖ కూడా రాశారు.

నిర్ణయం కంటే కూడా నిర్ణయం తీసుకున్న పద్ధతి తనను బాధించిందని ఆయన నిరసన వ్యక్తం చేశారు.  సంస్థను జాతీయం చేసినా చైర్మన్‌గా మాత్రం జెఆర్‌డినే కొనసాగాలని నెహ్రూ నిర్ణయించడంతో 1977 వరకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఆయన్ను చైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. అప్పటి  నుంచి టాటాలు ఆ సంస్థ గురించి పట్టించుకోవడం మానేశారు. కాగా  రుణభారం చూసే టాటాలు కూడా వెనుకడుగు వేశారని సమాచారం.ప్రభుత్వం అప్పులను కొంత మేరకు రద్దు చేసినట్లైతే  ఖచ్చితంగా టాటాలు కొనుగోలు చేసి ఉండే వారని అంటారు.  ఏది ఏమైనా ప్రభుత్వ వ్యూహం ఫలించక ఎయిర్ ఇండియా అమ్మకం అప్పట్లో నిలిచి పోయింది.  దీంతో కేంద్రం ఈ సమస్య దృష్టి సారించి  సంస్థకు ఉన్న నికర అప్పులు రూ. 23,286 కోట్లకు తగ్గించింది. తాజాగా..జనవరిలో రెండోసారి బిడ్లు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే టాటా ల పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సారైనా ప్రభుత్వ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. 

——————-  KNM 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!