Trend Setter …………………….
సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ ఎన్నో హిందీ రీమేక్ చిత్రాల్లో నటించి విజయం సాధించారు. 1974లో ‘జంజీర్’ ఆధారంగా తీసిన ‘నిప్పులాంటి మనిషి’తో ఎన్టీఆర్ రీమేక్ చిత్రాల పరంపర మొదలైంది. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం.
ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా రీమేక్ సినిమా ‘ జయం మనదే’ . ఇది 1951లో వచ్చిన హిందీ సినిమా ‘బాదల్’ కి తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని సుందర్‌లాల్ నహతా నిర్మించారు. తాతినేని ప్రకాశ రావు డైరెక్ట్ చేశారు. హిందీ రీమేక్స్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఎన్టీఆర్ రీమేక్ హిట్స్ ను చూసి ఇతర హీరోలు కూడా రీమేక్స్ పై దృష్టి పెట్టారు. రీమేక్స్ పరంపరలో వచ్చిన మరో చిత్రమే ‘అన్నదమ్ముల అనుబంధం’.హిందీలో హిట్ అయిన ధర్మేంద్ర నటించిన ‘యాదోంకీ బారాత్’ ఈ సినిమాకు ఆధారం. సలీం జావేద్ లు ఈ కథను రూపాందించారు.
‘యాదోంకీ బారాత్’ రీమేక్ హక్కులను ఎన్టీఆర్ , ఎమ్జీఆర్ కు పర్సనల్ మేకప్ మేన్ గా పనిచేస్తున్న పీతాంబరం కొనుగోలు చేశారు. అప్పటికే కొన్ని సినిమాలు తీసి పీతాంబరం డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ‘డేట్స్ ఇస్తాను ..సినిమా ప్లాన్ చేసుకో’ అన్నారు.
వెంటనే పీతాంబరం ‘యాదోంకీ బారాత్’ తెలుగు ,తమిళ హక్కులు కొనుక్కున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రాన్ని పీతాంబరం నిర్మించారు. తమిళంలో ఇదే కథను యమ్జీఆర్ తో ‘నాళై నమదే’ పేరిట మిత్రుడు కె.యస్.ఆర్. మూర్తి తో కలసి నిర్మించారు.
తమిళంలో యమ్జీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించగా, చిన్న తమ్ముని పాత్రలో చంద్రమోహన్ నటించారు. తెలుగులో కూడా ఈ పాత్రకు తొలుత చంద్రమోహన్ ను అనుకున్నారు. అయితే బాలకృష్ణ ఆ పాత్ర పోషించారు. చిన్న పాత్ర అది. రెండు పాటలు ఉంటాయి. బాలకృష్ణ కు జంటగా జయమాలిని నటించారు.
తమిళ చిత్రానికి ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడు చాలావరకు సొంత బాణీలే వినిపించారు. ఇటు తెలుగులో అటు తమిళంలో రెండు సినిమాలు ఒకే రోజున అంటే 1975 జూలై 4న విడుదలయ్యాయి. తెలుగునాట ‘అన్నదమ్ముల అనుబంధం’ 9 కేంద్రాలలో వందరోజులు ఆడింది. రజతోత్సవమూ జరుపుకుంది. ‘నాళై నమదే’ ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమిళ సినిమాను కె .ఎస్. సేతు మాధవన్ డైరెక్ట్ చేశారు.
‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలో లో ఎన్టీఆర్ కు పాటలు లేవు. పాటలన్నీ మురళీమోహన్, బాలకృష్ణకే పెట్టారు.ఈ సినిమాకు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు.హిందీ లో ఆర్డీ బర్మన్ చేసిన ట్యూన్స్ నే వాడారు. ఇందులో ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ లేదు.చివర్లో కాంచనను ఆయనకు జోడీగా చూపారు.
హిందీ కథకు గొల్లపూడి మారుతీ రావు చేత కొన్ని మార్పులు చేయించారు. మాటలు రాయించారు. రాజబాబు పాత్రకు కామెడీ పెట్టారు కానీ అంత గొప్పగా ఉండదు. ‘ఎవరండీ బాబు రౌడీ అనేది’ రాజబాబు ఊత పదం.తెలుగు సినిమా దర్శకుడు ఎస్ డి లాల్ హిందీ నేటివిటీ కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎన్టీఆర్ కు సినిమాలో డైలాగులు తక్కువ. ఫస్ట్ హాఫ్ లో అధికభాగం మురళి మోహన్ లతల ప్రేమ కథ నడుస్తుంది.ఎన్టీఆర్ ఈ సినిమాల్లో ప్రతి సీన్ లో సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. ఎప్పుడూ మిస్ అయిన తమ్ముళ్ల గురించి ఆలోచిస్తుంటారు. ఎన్టీఆర్ డ్రెస్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎన్టీఆర్ సిగరెట్ తాగుతూ ఫైట్ చేసే సీన్లు అభిమానులను అలరిస్తాయి.
లతకు మురళీ మోహన్ తనకు క్యాన్సర్ అని చెప్పే సన్నివేశాలు. లత గుడికి వచ్చి దేవుడిని ప్రార్దించే సీన్లు, ఎన్టీఆర్ సిగరెట్ ను నోట్లో పెట్టుకోగా బాలకృష్ణ లైట్ వెలిగించడం.. అదేసమయంలో మురళీ మోహన్ వచ్చి తాను కూడా సిగరెట్ వెలిగించుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ప్రముఖ విలన్ రాజనాల పోలీస్ అధికారి గా నటించారు.ప్రభాకర రెడ్డి ప్రధాన విలన్ పాత్రలో .. గిరిబాబు ఆయన కొడుకు గా నటించారు. క్లయిమాక్స్ ఆసక్తికరంగా ఉంటుంది.
“ఆ నాటి హృదయాల ఆనందగీతం…” ‘కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా’,’అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది సందెవేళ మల్లెపూలు తెమ్మన్నది’, ‘గులాబి పువ్వై నవ్వాలి వయసు జగాన వలపే నిండాలిలే’ పాటలు బాగుంటాయి.
అప్పట్లో ఈ సినిమా కు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. పీతాంబరమే తర్వాత కాలంలో ఎన్టీఆర్ తోనే యుగంధర్ సినిమా కూడా తీశారు. ఎన్టీఆర్ చివరి సినిమావరకు పీతాంబరం ఆయనకు మేకప్ మేన్ గా పనిచేశారు.
బాలకృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాహసమే జీవితం’ నిర్మాతల్లో పీతాంబరం ఒకరు. పీతాంబరం కుమారుడు పి.వాసు ‘సాహసమే జీవితం’ దర్శకులు భారతీవాసులో ఒకరు. ఈ వాసుయే తర్వాత రోజుల్లో చంద్రముఖి వంటి హిట్ ఫిలిం తీశారు.అన్నదమ్ముల అనుబంధం సినిమా యూట్యూబ్ లో ఉంది. చూడని వారు చూడవచ్చు.ఈ జులై తేదీకి ఈ సినిమా విడుదలై యాభైఏళ్లు అవుతోంది.