Ravi Vanarasi…………………
ఆధునిక ప్రపంచంలో సాంకేతికత దినదిన ప్రవర్ధమానమవుతోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆవిష్కరణలు మన పనులను సులభతరం చేయడమే కాకుండా, వినోదాన్ని, సమాచారాన్ని అరచేతిలోకి తీసుకొచ్చాయి. అయితే, ప్రతి అద్భుతమైన ఆవిష్కరణకు రెండు కోణాలు ఉన్నట్లే, సాంకేతికతకు కూడా ఒక చీకటి కోణం ఉంది.
రహస్య కెమెరాలు వచ్చినప్పటినుంచి వ్యక్తిగత గోప్యత, భద్రతల పట్ల భయం పెరిగింది. బాత్రూమ్లు, దుస్తులు మార్చుకునే గదులు, హోటల్ రూమ్‌లు, అద్దె ఇళ్లు, కార్యాలయాలు, చివరికి పబ్లిక్ రెస్ట్‌రూమ్‌ల వంటి వాటిల్లో రహస్య కెమెరాలను అమర్చి ప్రజల వ్యక్తిగత క్షణాలను చిత్రీకరించే ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా వెలుగుచూస్తున్నాయి.
ఈ వార్తలు వినగానే మనకు తెలియకుండానే ఒక రకమైన ఆందోళన, అభద్రతా భావం కలుగుతుంది.
“నాకు కూడా ఇలా జరిగిందా?”, “నా గోప్యత సురక్షితమేనా?” అనే ప్రశ్నలు మెదడును తొలిచేస్తాయి. ఈ నేరాలు ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నప్పటికీ, ఎవరైనా దీని బారిన పడే అవకాశం ఉంది.
ఒకప్పుడు సీసీ కెమెరాలు కేవలం భద్రత కోసమే ఉపయోగించేవారు. నేరాలను నియంత్రించడానికి, దొంగతనాలను అరికట్టడానికి, అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి అవి ఎంతగానో ఉపయోగపడేవి. కానీ, ఈనాడు అతి చిన్న పరిమాణంలో, ఎక్కడా కనపడకుండా ఉండే “హిడెన్ కెమెరాలు” మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి.
ఇవి సాధారణంగా కనిపించే వస్తువులలో (ఉదాహరణకు, బటన్లు, పెన్నులు, గడియారాలు, బొమ్మలు, USB ఛార్జర్లు, స్మోక్ డిటెక్టర్లు, వాల్ సాకెట్లు, చివరికి ప్లాంట్లలో కూడా) అమర్చబడి ఉంటాయి. వీటిని గుర్తించడం సామాన్యులకు దాదాపు అసాధ్యం. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, ఈ కెమెరాలు మరింత అధునాతనంగా తయారవుతున్నాయి. నైట్ విజన్ సామర్థ్యంతో, చిన్నపాటి ఎల్ఈడీ లైట్లతో, వైర్లెస్ కనెక్టివిటీతో ఇవి నేరగాళ్లకు నేరాలను సులభంగా చేసిపెట్టేందుకు ఉపయోగ పడుతున్నాయి.
ఈ రహస్య కెమెరా నేరాల వెనుక ఉన్న ఉద్దేశాలు చాలా భయంకరమైనవి. వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా, ఈ వీడియోలను అశ్లీల వెబ్సైట్లలో అమ్మడం, బాధితులను బ్లాక్మెయిల్ చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం వంటి నీచమైన చర్యలకు ఉపయోగించుకుంటున్నారు. ఇది బాధితులలో తీవ్రమైన మానసిక ఆందోళన, భయం, డిప్రెషన్, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిని సృష్టిస్తుంది. కొన్నిసార్లు, ఇది ఆత్మహత్యలకు కూడా దారితీయవచ్చు.
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫిషింగ్, హ్యాకింగ్ వంటి సైబర్ నేరాల తర్వాత, రహస్య కెమెరా నేరాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. దీన్ని బట్టి ఇది ఎంత తీవ్రమైన సమస్యో అర్థం చేసుకోవచ్చు.. 2018లో ఢిల్లీలోని ఒక రెస్టారెంట్లో, 2015లో నాటి కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఒక స్టోర్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో సీసీటీవీ కెమెరా తిప్పి ఉందని ఫిర్యాదు చేయడం వంటి హై-ప్రొఫైల్ కేసులు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తాయి.
బెంగళూరులో ఒక మహిళ తన వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు తన సహోద్యోగి రహస్యంగా వీడియో తీశాడని ఆరోపించడం, కార్యాలయాల్లోనూ ఈ బెడద ఎంతగా ఉందో తెలుపుతుంది. రహస్య కెమెరాలు ఉంటాయని ఊహించుకుంటూ హోటళ్లకు వెళ్ళకుండా ఉండలేం, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించకుండా ఉండలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కొంతవరకు కాపాడుకోవచ్చు.
సైబర్ నిపుణులు సూచించినట్లుగా, అత్యంత అప్రమత్తంగా ఉండటమే ముఖ్యమైన రక్షణ కవచం. మీరు కొత్తగా వెళ్ళిన ఏ ప్రదేశంలోనైనా (హోటల్ రూమ్, చేంజింగ్ రూమ్, పబ్లిక్ టాయిలెట్, అద్దె ఇల్లు) అడుగు పెట్టగానే, ఒకసారి గదిని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ చుట్టూ ఉన్న వస్తువులను, ముఖ్యంగా అనుమానాస్పదంగా కనిపించే వాటిని దగ్గరగా పరిశీలించండి.
బాత్రూమ్లు, డ్రెస్సింగ్ టేబుళ్ళ వద్ద ఉండే అద్దాలను చాలా జాగ్రత్తగా గమనించండి. అవి “టూ-వే మిర్రర్స్” కావచ్చు (అంటే, ఒకవైపు నుండి సాధారణ అద్దంలా కనిపించి, మరోవైపు నుండి లోపల దృశ్యాలను చూడగలిగేవి). దీనిని గుర్తించడానికి, మీ వేలిని అద్దం ఉపరితలంపై ఉంచండి. మీ వేలి కొనకూ, అద్దంలో కనిపించే దాని ప్రతిబింబానికీ మధ్య కాస్తైనా ఖాళీ ఉంటే అది సాధారణ అద్దం.
ఖాళీ లేకుండా వేలికొన ప్రతిబింబంపై నేరుగా ఆనుకున్నట్లయితే, అది టూ-వే మిర్రర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు, దాని వెనుక రహస్య కెమెరా ఉండవచ్చు.గది మూలల్లో, సీలింగ్‌లో ఏమైనా రంధ్రాలు, పగుళ్లు ఉన్నాయేమో చూడండి. చిన్న రంధ్రాల నుండి కూడా కెమెరాలు అమర్చే అవకాశం ఉంది.
స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారమ్‌లు, వెంటిలేషన్ గ్రిల్స్ వంటి వాటిని కూడా పరిశీలించండి. టీవీలు, అలారం గడియారాలు, ల్యాంప్‌లు, ఫ్లవర్‌వాజ్‌లు, ఫోటో ఫ్రేమ్‌లు, టిష్యూ పేపర్ బాక్సులు, ఎయిర్ ఫ్రెష్నర్లు వంటి సాధారణ గది వస్తువులను అనుమానాస్పదంగా గమనించండి. వాటిలో చిన్న రంధ్రాలు, అసాధారణ వైర్లు ఉన్నాయేమో చెక్ చేయండి.
ఏదైనా అదనపు లేదా అసాధారణమైన వైర్లు కనిపిస్తే, అవి ఎక్కడికి వెళ్తున్నాయో పరిశీలించండి. కొన్నిసార్లు, ఈ వైర్లు కెమెరాలకు అనుసంధానించబడి ఉండవచ్చు.చాలా రహస్య కెమెరాలలో, ముఖ్యంగా రాత్రిపూట కూడా చిత్రీకరించగల నైట్ విజన్ కెమెరాలలో, చిన్న ఎల్ఈడీ లైట్లు ఉంటాయి (సాధారణంగా ఎరుపు లేదా ఆకుపచ్చ). ఇవి చీకట్లో కనిపిస్తాయి.
మీరు గదిలో లైట్లు పూర్తిగా ఆర్పేసి, చీకటి పడిన తర్వాత మీ మొబైల్ ఫోన్ కెమెరా (ముఖ్యంగా బ్యాక్ కెమెరా, కొన్ని ఫోన్ల ఫ్రంట్ కెమెరా ఇన్ఫ్రారెడ్ లైట్లను గుర్తించకపోవచ్చు) ఆన్ చేసి చుట్టూ స్కాన్ చేయండి. కెమెరా లెన్స్‌కు కనిపించని ఇన్ఫ్రారెడ్ లైట్లు మీ ఫోన్ స్క్రీన్‌పై చిన్న మెరుపులుగా లేదా డాట్స్‌గా కనిపించే అవకాశం ఉంది.
కొన్ని కెమెరాలు ఇన్ఫ్రారెడ్ లైట్లతో పనిచేయవు, కానీ చిన్న ఎల్ఈడీ లైట్లను కలిగి ఉంటాయి. అవి చీకటిలో కనిపిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మీ ఫోన్ ఫ్లాష్‌లైట్ లేదా ప్రత్యేక ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించి అనుమానాస్పద ప్రదేశాలపై కాంతిని ప్రసరింపజేయండి. కెమెరా లెన్స్ నుండి ఒక చిన్న రిఫ్లెక్షన్ కనిపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రహస్య కెమెరాలను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లు వచ్చాయి. (కొన్ని ఉచితంగా, కొన్ని చెల్లింపు వెర్షన్లలో లభిస్తాయి) RF సిగ్నల్ డిటెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు మీ ఫోన్ కెమెరా, మాగ్నెటోమీటర్ (మెటల్ డిటెక్షన్ కోసం) ఉపయోగించి కెమెరా సిగ్నల్స్ లేదా మెటల్ వస్తువులను గుర్తించడానికి ప్రయత్నిస్తాయి.
RF డిటెక్టర్లు వైర్లెస్ కెమెరాల నుండి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ను గుర్తించగలవు. ఇవి కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినా, తరచుగా ప్రయాణాలు చేసే వారికి లేదా అనుమానాలు ఉన్న వారికి ఇవి ఉపయోగపడతాయి.అన్నింటికంటే ముఖ్యమైన విషయం, మీరు ఎక్కడైనా రహస్య కెమెరాను గుర్తించినట్లయితే, భయపడకుండా తక్షణమే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి.
వారికి మీరు గుర్తించిన కెమెరా గురించి, దాని ప్రదేశం గురించి వివరంగా తెలియజేయండి. కెమెరా ఉన్న ప్రదేశం, కెమెరా తాలూకు ఫోటోలు, వీడియోలు తీసి పెట్టుకోండి. ఇది కేసు దర్యాప్తుకు సహాయపడుతుంది.ఈ రహస్య కెమెరాల బెడద కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజం మొత్తం ఎదుర్కొంటున్న ఒక పెను సవాలు.
ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న నేరగాళ్ల విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు ఇటువంటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.పౌరులుగా మనందరి బాధ్యత ఏమిటంటే, అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే.

