వ్యవస్థలను ఉతికి ఆరేసిన సినిమా !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………….

అక్టోబర్ 15.. 1983 న విడుదలయిన “నేటి భారతం” సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. టి కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ ని చేయటానికే టి కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది. విజయశాంతి నటన సూపర్బ్. 

ముఖ్యంగా క్లైమాక్సులో నలుగురు విలనాసురులను వేటాడి చంపి హాస్పిటల్ వద్దకు ఈడ్చుకుని వచ్చే సీన్ , కోర్టులో తన వ్యధను వ్యక్తపరిచే సీన్ అత్యద్భుతం. ఇక సుమన్ కూడా చక్కగా నటించాడు. తెలుగులో ఇది మూడో సినిమా అనుకుంటాను. సంస్కారవంతమైన పోలీస్ ఆఫీసరుగానే కాకుండా ఒక సంస్కర్తగా వ్యవహరించే పాత్రను చక్కగా పోషించారు.

ఆ తర్వాత వరుసలో వచ్చేది శివకృష్ణే. నిరుద్యోగిగా,సమాజంలో అక్రమాలను ఎదిరించే విప్లవ భావాలు కల యువకుడిగా చాలా బాగా నటించారు.ప్రధాన విలనాసురుడిగా నాగభూషణం. ఈ సినిమా టైంకు ఆయన వయసు అయిపొయింది.. పాత్ర పరిధి మేరలో విలనిజం పండించాడు. ఆయనకు తోడు విలన్లుగా పి జె శర్మ , చలపతిరావు నటించారు.

తాగుబోతు పాత్రలో పి. ఎల్. నారాయణ జీవించాడు. ఆ పాత్ర ద్వారా కూడా వ్యవస్థ పై సైటర్లు వేయించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా ఎస్. వరలక్ష్మి పూర్తి వెరైటీ పాత్రలో విభిన్నంగా నటించారు. వ్యవస్థలు ఎలా తమ గుప్పెటలో ఉన్నాయో చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

ఇతర పాత్రల్లో రాజ్యలక్ష్మి,రాజేశ్వరి, నర్రా వెంకటేశ్వరరావు ,పోకూరి బాబూరావు , రాళ్ళపల్లి , మరెంతో మంది ఔత్సాహికులు , జూనియర్ ఆర్టిస్టులు నటించారు. ఈ సినిమా ఘన విజయానికి దర్శకుని ప్రతిభ, కధాంశం ..వాటిని తెరకెక్కించిన తీరు కారణమని చెప్పుకోవాలి. పాటలు సినిమా కు బలం చేకూర్చాయి.

మహాకవి శ్రీశ్రీ , అదృష్టదీపక్ మంచి పాటలు అందించారు. వాటికి శ్రావ్యమైన సంగీతాన్ని చక్రవర్తి సమకూర్చారు. శ్రీశ్రీ పాటలు వ్రాసిన ఆఖరి సినిమా ఇది. ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్ . ఎర్ర జెండా నా ఎజండా అని చెప్పుకున్న ఎర్ర రచయిత సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి ఈ పాటను వ్రాసారు. 

ఆయనే అదృష్ట దీపక్.యస్ జానకి పాడారు . శ్రీశ్రీ వ్రాసిన పాట ‘అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం’ విజయశాంతి పై చిత్రీకరించారు. ప్రేక్షకులకు బాగా నచ్చింది . సుశీలమ్మ పాడింది . చిట్టి పొట్టి పాపల్లారా పాటను కూడా అదృష్ట దీపకే వ్రాసారు.విద్యార్ధినులకు ఆర్చరీలో తర్ఫీదు ఇస్తూ సాగే పాట..యస్ జానకే పాడారు. 

విజయశాంతి , సుమన్ల ఆదర్శ వివాహ సందర్భంగా వచ్చే గ్రూప్ డాన్స్ జంబైలో అంటూ సాగుతుంది . యస్ పి శైలజ , రమేష్ బృందం పాడారు . చిత్రీకరణ బాగుంటుంది . ‘అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు’ అనే పాట మన దయనీయ ప్రభుత్వ ఆసుపత్రిల మీద చెణుకు , కొరడా దెబ్బ.

గొప్ప విషయం ఏమిటంటే ఈ నలభై ఏళ్ళల్లో పాలకులు ఎంతమంది మారినా చక్కగా ఆసుపత్రులు అక్కడే అలాగే వికసిస్తూ ఉండటం. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే అధికార పార్టీల చెంచా డాక్టర్లు కూడా మారకపోవడం. సినిమాలో డైలాగులు రయ్ రయ్ అని బాణాల్లాగా దూసుకు వస్తుంటాయి. 

Politician-Public Prosecutor-Public Doctor-Police nexus . 4Ps . అన్ని విప్లవ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా బాగా చూపారు . అయినా మనం రోజూ దేశంలో , రాష్ట్రంలో చూసేదేగా ! తెలుగులో సూపర్ హిట్టయిన ఈ సినిమా కన్నడంలో ‘ఇందినా భరత’ అనే టైటిలుతో తీసారు. శంకర్ నాగ్ , అంబిక ప్రధాన పాత్రధారులు. 

హిందీలో ‘హకీకత్’ టైటిల్. జితేంద్ర , జయప్రదలు నటించారు. జయప్రద కూడా ఎర్ర పాత్రను వేసిందన్న మాట. తమిళంలో ‘పుతియ తీరుపు’ టైటిలుతో వచ్చింది. విజయకాంత్ , అంబికలు నటించారు. జనం చప్పట్లతో పాటు అవార్డుల వర్షం కూడా కురిసింది.ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ చిత్రం , ఉత్తమ సంగీత దర్శకుడు , ఉత్తమ సపోర్టింగ్ ఏక్టర్ నంది అవార్డులు వచ్చాయి. 

ఉత్తమ సపోర్టింగ్ ఏక్టర్ అవార్డు పి యల్ నారాయణకు వచ్చింది . తాగుబోతుగా , మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిలబడి సమాజానికి ప్రశ్నలను సంధించే పాత్రలో బాగా నటించారు . ప్రేక్షకులకు గుర్తుండే పాత్ర . కాకపోతే నావరకు బాధ కలిగించే విషయం ఏమిటంటే ముగింపు చంపటంతో. చంపటంతోనే సమస్యలు పరిష్కారం అవ్వాలంటే చివరకు వాటిని అనుభవించేందుకు ఎవరు మిగులుతారు !? సమాధానం లేని , రాని ప్రశ్న . వదిలేద్దాం .

మాతరంలో ఈ సినిమా చూడనివారు ఎవరూ ఉండరు . ఈతరంలో చూడని వారు ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది.

తెర వెనుక విశేషాలు

ఒంగోలు శర్మా కాలేజీ లో చదువుతున్నప్పుడే నటుడు మాదాల రంగారావు,టి. కృష్ణ ( తొట్టెంపూడి కృష్ణ ) స్నేహితులు. వాస్తవానికి టి. కృష్ణ ముందుగా సినిమాల్లోకి వెళ్ళాడు. నాటి ప్రముఖ దర్శకుడు గుత్తా రామినీడు దగ్గర అసిస్టెంట్ గా చేరాడు.

ఒకటి రెండు సినిమాలకు పనిచేసి .. అక్కడ నచ్చక తిరిగి ఒంగోలు వచ్చి పొగాకు వ్యాపారం చేసుకుంటున్నాడు. అయినా ప్రజా నాట్యమండలి కార్యక్రమాలకు హాజరయ్యేవారు.నిండైన విగ్రహం ఉన్న మాదాలను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించింది టి. కృష్ణే.

మాదాల కొన్ని సినిమాల్లో చేసి .. సొంతంగా సినిమా తీసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ దశలో మళ్లీ కృష్ణ మద్రాస్ వెళ్లి మాదాలకు సాయంగా నిలిచాడు. ‘యువతరం కదిలింది’ లో ఒక చిన్న పాత్ర కూడా చేసాడు.

తర్వాత ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’ చిత్రాలకు సహకారం అందించాడు ..అప్పట్లో కృష్ణ తో పాటు పోకూరి బాబూరావు కూడా  ‘యువతరం కదిలింది’ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లో పనిచేశాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత ఎర్రమల్లెలు, విప్లవ శంఖం సినిమాలతో  రంగారావు ఓ స్థాయికి చేరుకున్నాడు.

తర్వాత కాలంలో స్క్రిప్టులో మార్పులపై మాట వినని మాదాలతో విభేదించి కృష్ణ తానే దర్శకుడయ్యారు.ఈ దశలో టి.కృష్ణ కు సహకరించింది పోకూరి బాబూరావు. వీళ్లద్దరూ కూడా శర్మా కాలేజి లో చదువుకున్నారు.ఇద్దరు నటులు. గాయకులే. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో ఇద్దరూ భాగస్వాములే. బాబూరావు అపుడు ఒంగోలు ఆంధ్రా బ్యాంకు లో పని చేసేవారు.

అందుకే సినిమాలో తన పేరు కాకుండా నిర్మాత గా తమ్ముడి పేరు వేశారు. రెండు లక్షల రూపాయలతో సినిమా ప్రారంభించిన ఆ ఇద్దరూ ‘నేటి భారతం’ సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టాలు పడ్డారు.ఈ సినిమాకు మోదుకూరి జాన్సన్, ఏం.వి ఎస్. హరనాథ రావులు సంభాషణలు అందించారు.టి కృష్ణ హరనాథరావులు కూడా మిత్రులే.

నటుడు రచయిత పి. ఎల్ నారాయణను టి.కృష్ణ గురువుగా భావించేవారు.కృష్ణ సినిమాలకు స్టోరీ,డైలాగుల పర్యవేక్షణ పి.ఎల్ చేసేవారు. ఆయన ఒకే అంటేనే కృష్ణ ముందుకు సాగేవారు. పి.ఎల్. నారాయణ తనపాత్రకు తానే డైలాగులు రాసుకున్నారు. సినిమాలో మాటలు తూటాల్లా పేలాయి.

సినిమా ఊహించిన దానికంటే హిట్ అయింది. ‘నేటి భారతం’ టైటిల్ కి తగ్గట్టు వ్యవస్థల పనితీరు,వాటి లోపాలు ఆధారంగా కథ అల్లుకున్నారు. ఎక్కడా బోర్ కొట్ట కుండా సాగుతుంది సినిమా. ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ చేసారు. స్థానిక కళాకారులను కూడా ప్రోత్సాహించారు.

మాదాల తో మొదలైన ఎర్ర సినిమాల ట్రెండ్ ను టి కృష్ణ కొంత కాలం విజయవంతంగా కొనసాగించారు. ఈ ఇద్దరూ ప్రకాశం జిల్లావారు కావడం విశేషం. టి. కృష్ణను డైరెక్టర్ చేసిన పోకూరి బాబూరావు తర్వాత కాలంలో కృష్ణ కుమారుడు ‘గోపీచంద్’ హీరో గా సినిమా తీయడం మరో విశేషం.

…………………..Tharjani 

 

       
    
 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!