One day Chief minister………………..
ప్రముఖ రచయిత జంధ్యాల 70 దశకంలో ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ పేరు మీద ఒక నాటిక రాశారు. ఆయనే ప్రధాన పాత్ర పోషించి ఆ నాటికను ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఆ ‘నాటిక’ ను ఇతరులు కూడా ప్రదర్శించారు. ‘ఒకరోజు రాజేమిటి’ అనుకున్నారు విమర్శకులు .. తర్వాత కాలంలో కొంచెం తేడాతో ‘ఒక రోజు ముఖ్యమంత్రి’ కూడా ఉంటారు అని UP రాజకీయాలు చాటి చెప్పాయి.
ఏక్ దిన్ కా సుల్తాన్’ మాదిరిగా ‘ఏక్ దిన్ కా సీఎం’ అయి .. పదవి నుంచి దిగి పోయిన ఆ వ్యక్తి ఇండియా చరిత్రకెక్కారు. ఆయన పేరే జగదాంబిక పాల్ .. ఉత్తరప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. జగదాంబిక పాల్ ఉత్తరప్రదేశ్‌లో 24 గంటలు మాత్రమే సీఎంగా పని చేసి రికార్డు సృష్టించాడు.
ఉత్తరప్రదేశ్ లో అస్థిర ప్రభుత్వాలు ఎక్కువ. పార్టీలలో చీలికలు రావడం, నేతల మద్దతు ఉపసంహరణ, ఉప ఎన్నికలు, హంగ్ ప్రభుత్వాలు ఏర్పడటం ఇలాంటి పరిణామాలను యూపీ ఎన్నో చూసింది.అలాంటి కాలంలో ఒక్కరోజు ముఖ్యమంత్రి పుట్టుకొచ్చారు.
1998లో ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ ఉన్నారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు లోక్ తాంత్రిక్ పార్టీ, భారతీయ కిసాన్ కామ్‌గర్ పార్టీ, జనతాదళ్, జనతాదళ్ (పాండే) పార్టీలు ప్రకటించాయి.
ఈ క్రమంలో నాటి గవర్నర్ రమేష్ భండారీ రాత్రికి రాత్రే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. వెంటనే లోక్ తాంత్రిక్ నేత జగదాంబిక పాల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు.సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలు మాయావతి, కాంగ్రెస్ శాసనసభా పార్టీ నాయకుడు ప్రమోద్ తివారీ పాల్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ విషయంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బలపరీక్షకు ఆదేశించింది. శాసనసభలో కళ్యాణ్ సింగ్ మెజారిటీ నిరూపించుకోవడంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. బలపరీక్షలో కళ్యాణ్ సింగ్‌కు 225 ఓట్లు, జగదాంబిక పాల్‌కు 196 ఓట్లు వచ్చాయి.
సరే అప్పుడంటే బలపరీక్ష లో ఓడిపోయాడు. కానీ ఈ జగదాంబిక పాల్ సామాన్యుడు కాదు. ఇక్కడో తమాషా విషయం చెప్పుకోవాలి.. నాటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టిన జగదాంబిక పాల్ తర్వాత కాలంలో బీజేపీలో చేరగా .. కళ్యాణ్ సింగ్ బీజేపీ ని వదిలేశారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గత ఏడాది జగదాంబికా పాల్ ను చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో ఒకరిగా నియమించారు. 2009 లో Domariaganj లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పాల్, 2014 లో బీజేపీ లో చేరి అదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు వరుసగా గెలిచి రికార్డు సృష్టించాడు.
—— KNM