Sankeerthan ……………………..
ఉచితాల మోజులో ప్రజలు… అధికారం మోజులో నేతలు… అవినీతి మోజులో కొందరు అధికారులు… ఇది దేశం తీరు. ఎవరికి వారు స్వార్థప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారు. ఎలా ఓటు వేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎలా పాలించాలో నేతలకు రావడం లేదు.
పాలకులే అధికారులతో పనిచేయించలేని నిస్సహాయస్థితికి వెళ్లిపోతే.. ఇక ప్రజల మాట అధికారులు వింటారనుకోవడం విడ్డూరమే అవుతోంది. మొత్తంగా దేశం గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా నడుస్తోంది. ఇవాళ రేపు మన దేశంలో (కొందరు) అధికారులతో పని చేయించుకోవాలంటే పెద్ద సాహసమనే చెప్పాలి.
ఏకంగా పాలకులను శాసించే స్థాయి అధికారులు ఈ దేశంలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారులు ప్రభుత్వంలో భాగమే అయినా.. వారే ప్రభుత్వాలను వెనకుండి నడిపిస్తూ.. నాయకులను ప్రభావితం చేస్తూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలను దూరం చేస్తున్నారు. చేష్టలుడిగిన పాలకులు, పాలనను ప్రభావితం చేసే అధికారుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఓ ప్రభుత్వ కార్యాలయం, ఏసీ రూమ్, బయటకు వెళ్లేందుకు కారు.. దాని డోరు తీసేందుకు ఓ మనిషి, అవసరమైతే భద్రత, ఎక్కడకు వెళ్లినా సాగిలపడే దిగువస్థాయి అధికార గణం. ఇది మొత్తంగా ప్రభుత్వ ఉన్నతాధికారి దర్పం. ఆ ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రభుత్వంలోని ఏదో ఓ విభాగంలో విధులు నిర్వహిస్తుంటారు.
విధుల్లో భాగంగా ప్రజలతో మమేకమవడం ఆ ఉద్యోగి బాధ్యత. తన పరిధిలో ఉండే గ్రామాలు,పట్టణాల్లో బస్తీల్లోకి వెళ్లి… తన విభాగానికి సంబంధించిన పనులు, ప్రజల అవసరాలపై ఆరా తీయాలి. కాని మెజార్టీ ప్రభుత్వఉన్నతాధికారులు ఇందుకు పూర్తి భిన్నం.
ప్రజాపన్నుల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అనుభవిస్తున్న మెజార్టీ ఉన్నతాధికారులు… ఆ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు.
దేశంలోని మెజార్టీ ఉన్నతాధికారుల తీరును పరిశీలిస్తే.. కష్టపడే తత్వం .. చదువుకుని ఉద్యోగం సంపాదించే వరకే పరిమితం అవుతుంది. ఆ తర్వాత మొత్తం వ్యక్తిగతంగా తనకేం ప్రయోజనం కలుగుతుందన్న ధ్యాసే తప్ప.. విధుల్లో భాగంగా దేశానికి ఏం చేద్ధాం.. మెరుగైన పనితీరుతో ఓ మార్పును తీసుకువద్ధామన్న ఆలోచనలే లేకుండా పోతున్నాయి.
ఉదయమే 10 గంటలకు ఆఫీసుకు వచ్చామా..! నాలుగు ఫైళ్లు తిరగేశామా..! నాలుగు సంతకాలు పెట్టామా..! మధ్యాహ్నం భోజనం చేశామా..! మమ అన్నట్లు పనుల కోసం వచ్చిన వారిని ఓ నలుగురిని కలిశామా..! వెళ్లిపోయామా..! ఇంతే.. ఇంకేం లేదు.
ఇది దేశంలోని మెజార్టీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దినచర్య. కడుపులో చల్ల కదలకుండా.. ఏసీ గదుల్లో కూర్చొని ఉద్యోగాన్ని చక్కబెట్టేస్తూ పనికానిచ్చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీలు ఏంటి..? వాటిని ఎలా అమలు చేయాలి..? ప్రభుత్వం అందించే వనరులు ప్రజలకు చేరుతున్నాయా? ఎక్కడ ఎలాంటి అవాంతరాలు ఏర్పడుతున్నాయి?
అవాంతరాలను తొలగించి ప్రజలకు లబ్ధిచేకూరాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే ప్రజలకు మెరుగైన జీవనప్రమాణాలు అందించగలమన్న ఆలోచనలు చేయడం లేదు. కనీసం తమ పరిధి మేరకు కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా మెజార్టీ ఉన్నతాధికారులు అఇష్టతను చూపుతున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగమంటే ప్రజాసేవలో భాగం. విధుల్లో చేరేప్పుడే.. సమయంతో పనిలేకుండా అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలన్న నిబంధన కొన్ని ఉద్యోగాలకు ఉంటుంది. నిబంధన లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగి అంటేనే అన్ని వేళల్లో అందుబాటులో ఉండటం కూడా ఒక బాధ్యతే..! కాని ఉదయం 10 గంటలకు రావడం… 6 గంటలకు వెళ్లిపోవడం.. ఆదివారం ఠంచనుగా ఆఫీసుకు తాళం వేయడం.
మళ్లీ షరా మమూలుగా సోమవారం ఆఫీసుకు వచ్చేయడం.. ఇది నడుస్తున్న కథ. పనిభాగం ఎలా తగ్గించుకోవాలి…? ఈ ఏడాదిలో ఎన్ని సెలవులు ఉన్నాయి..? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి…? వేతనంతో కూడిన సెలవులు ఎన్ని..? ఎలా సెలవులు పెడితే జీతం వస్తుందన్న ఆలోచనలే గానీ… ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నూటికి 90శాతం అధికారులు శ్రద్ధవహించడం లేదు.
పీఆర్సీలు, డీఏలు వంటి ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేసే ప్రభుత్వ ఉద్యోగులను చూశామే కానీ.. ప్రజలకు పలానా పనిచేయలేకపోతున్నాం.. ఈ పనులు చేయడానికి ప్రభుత్వం సహకరించడం లేదని ధర్నా చేసే ప్రభుత్వ ఉద్యోగులను మన దేశంలో చూశామా?
మీ పరిధిలోని ఏదైనా పనిమీద ఈ నెలలో ఏదైనా గ్రామానికి వెళ్లారా అని దేశంలోని ఉన్నతాధికారులను పట్టుకుని అడిగితే… వందకు 80 మంది నుంచి వెళ్లలేదనే సమాధానమే వస్తుంది.
అలా ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అర్థం చేసుకోకుండా.. ప్రజల అవసరాలను గుర్తించకుండా ఏసీ గదుల నుంచే విధులు నిర్వహిస్తూ చమటపట్టకుండా లక్షల జీతం తీసుకుంటూ పుణ్యకాలం గడిపేస్తూ దేశాన్ని ఎక్కడ ఉందో అక్కడే ఉంచుతున్నారు.
పని చేయాలని చెప్పడం కూడా కొందరు ఉన్నతాధికారుల దృష్టిలో నేరమే అవుతుంది. అసలు పాలకుల చేతిలో అధికారం కాకుండా తమ చేతుల్లోనే ఉండాలని కోరుకునే ఉన్నతాధికారులు కూడా చాలా మందే ఉన్నారు.
ఇలా ఎవరి స్థాయిలో వారు… ఏసీ గదులకు పరిమితం అవుతూ.. ప్రజలను క్యూలైన్లలో, ఎండల్లో, రోడ్ల మీద పడిగాపులు కాసేలా చేస్తున్నారు. అయితే అక్కడక్కడా మంచి అధికారులు కూడా లేకపోలేదు.
రౌతును బట్టి గుర్రం అన్న చందనా .. పాలనను పరుగెత్తించే నేతలు కూడా ఉంటారు. వారిని బట్టే అధికారుల తీరు ఉంటుంది. పాలకులు పకడ్బందీగా సమీక్షలు చేస్తూ ..ఉన్నతాధికారులచే చేయిస్తూ … వివిధ దశల్లో జవాబుదారీతనం ఫిక్స్ చేస్తే అధికారుల్లో మార్పు వస్తుంది. ఇవన్నీరెగ్యులర్ గా జరగాలి. అపుడే ఫలితాలు ఉంటాయి. ప్రజలకు మంచి జరుగుతుంది.