Tyranny in the name of devotion …………………………..
రెండు రోజులుగా వార్తల్లో కనిపిస్తున్న’ రామరాజ్యం సంస్థ వీర రాఘవ రెడ్డి ఎవరా ?’ అని కూపీ లాగితే చాలా విషయాలే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ’ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన టీమ్ లీడరే ఈ వీరరాఘవరెడ్డి.
ఇతగాడిది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం.’రామరాజ్యం’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సంస్థకు పేస్ బుక్ లో ఒక అకౌంట్ కూడా ఉంది.అందులో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
భగవద్గీత శ్లోకాలతో పాటు హిందువులు.. తన సంస్థలో చేరే విధంగా వీడియోలు షేర్ చేస్తున్నారు. ramarajyam.net పేరిట ఒక వెబ్ సైట్ కూడా ఉంది. వీటిలో ఆయన వీడియోలు పెడుతున్నారు. రామ రాజ్య స్థాపన, ఇక్ష్వాకు వంశం .. అర్చకులు ఏం చేయాలి .. తదితర అంశాలపై ఈ వీడియో ఉన్నాయి. ఎవరినైనా ఆకర్షించే విధంగా అనర్గళంగా వీరరాఘవరెడ్డి మాట్లాడేస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘రామరాజ్యం’ పేరుతో వీరరాఘవరెడ్డి ప్రైవేట్ ఆర్మీని నడిపిస్తున్నారు. దేశంలో రామరాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి చదివిన యువతీ, యువకులను తన సైన్యంలో రిక్రూట్ చేసుకుంటున్నారు.
5 కిలో మీటర్లు నడిచే సామర్థ్యం.. రెండు కిలో మీటర్లు పరుగెత్తే సత్తా ఉన్నవారే అర్హులు. ఆయన ఆర్మీ లో చేరాలంటే వయసు 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైనవారికి రూ.20వేల జీతం ఇస్తారని సమాచారం. ఆ మధ్య పెనుగొండలో ఒక అర్చకుడిని కలసినట్టు పేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. అక్కడ ఆయనతో ఏమి మాట్లాడింది బయటకు రాలేదు.
ఇక చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన ‘రామరాజ్యం’ సైన్యంలో చేరాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపణ. తమకు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని వీర రాఘవ రెడ్డి కోరారని ఆరోపణ. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు.
రంగరాజన్ తో మాట్లాడిన వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఈ సందర్భంగానే తాము ఇక్ష్వాకు వంశస్థులమని రాఘవ రెడ్డి చెప్పుకున్నారు. ఆలయానికి వచ్చేవారి గోత్రం , ప్రవర ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ ను ప్రశ్నించారు.
ఆలయ భూముల వ్యవహారంపై కోర్టులో కేసులు వేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే … ఈసారి తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని కూడా హెచ్చరించి వెళ్లారు.
ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీడియాలో వార్తలు హైలైట్ కావడం తో అధికార పక్షం,విపక్షం గట్టిగా స్పందించాయి. పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిని, మరికొందరిని అరెస్ట్ చేశారు. కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.