మమతా కులకర్ణి సన్యాసం వెనుక అంత కథ ఉందా ?

Sharing is Caring...

Her ascetic farce ………………

మమతా కులకర్ణి .. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్. ఇపుడు సన్యాసిని లేదా సాధ్వి..రేపు  ???
కొద్దిరోజుల క్రితం సన్యాసం పుచ్చుకుని  ఆమె ‘సాధ్వి’ అయ్యారు. శ్రీ యమై మమతా నంద్ గిరి గా మారిపోయారు ఆపై మహామండలేశ్వర్ (ఆధ్యాత్మిక అధిపతి)గా కూడా బిరుదు పొందారు. 

సహజంగా ఉన్నత సాధువులకు మఠాలపై అధికారం అప్పగిస్తూ మహామండలేశ్వర్ గా ప్రకటిస్తారు. ఈ బిరుదు లేదా హోదా కఠినమైన శిక్షణ పొంది, జ్ఞాన సముపార్జన చేసిన సన్యాసులకు మాత్రమే దక్కుతుంది. మహా మండలేశ్వర్ బిరుదు లేదా హోదా అందుకోవాలంటే 12 ఏళ్లకు పైగా అఖడా కఠోర నియమాలు అనుసరిస్తూ సాధ్వి గా జీవించాలి.

మమతా విషయంలో అదంతా ఏమీ జరగలేదు. చేరిన వెంటనే మమతకు ఆ బిరుదు ఎలా ఇచ్చారు ?ముఖ్యంగా కిన్నార్ అఖడా సమూహం ట్రాన్స్ జెండర్లది. కిన్నార్ అఖడా అధినేత్రి లక్ష్మి కూడా ట్రాన్స్ జెండర్. లక్ష్మీనారాయణ అసలుపేరు. మరి ఈ గ్రూప్ లో మమతా కులకర్ణి ఎలా చేరారు ?ఆమె ట్రాన్స్ జెండర్ కాదు కదా. అంటే ఈ అఖడా  నాయకులను మేనేజ్ చేశారా ? అనే డౌట్ కూడా వస్తుంది.

ఈ క్రమంలోనే  కొన్నిఆరోపణలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ‘మిగతా అఖడాలలో కూడా మమత చేరేందుకు ప్రయత్నించారు .. కానీ ఆమె చరిత్ర తెలిసిన వారు దగ్గరికి రానివ్వలేదని’ కిన్నార్ అఖడా అధినేత్రి లక్ష్మి పదికోట్లు తీసుకుని మమత కు ఆ బిరుదు కట్టబెట్టారని ప్రచారం జరిగింది.  కిన్నార్ అఖడా సభ్యురాలు హేమాంగి  సఖి బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు.

మమతా కులకర్ణికి అండర్ వరల్డ్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డాన్‌ని పెళ్లాడిందని,డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్టు చేశారని హేమాంగి సఖి ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణలు మీడియాలో హైలైట్ అయ్యాయి.

దీంతో కుంభమేళా  లోనే అఖడా పరువు, ప్రతిష్ట మంట గలసి పోతాయని అఖడా పెద్దలు రంగ ప్రవేశం చేశారు.అఖడా ఆచారాలను పాటించనందున మమతా కులకర్ణి, లక్ష్మిలను బహిష్కరిస్తున్నట్టు కిన్నార్ అఖడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ ప్రకటించారు.

ఇక తనపై వచ్చిన ఆరోపణలను మమతా కులకర్ణి ఖండించింది. మహామండలేశ్వర్ కావడానికి రూ. 10 కోట్లు ఎవరికి ఇవ్వలేదని అంటున్నారు. తన బ్యాంకు అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసిందని .. తన అపార్టుమెంట్లు శిధిలావస్థలో ఉన్నాయని చెబుతున్నారు. నేను ఎలా బతుకుతున్నానో ఎవరికి తెలియదు. నా దగ్గర డబ్బు లేదు. నేను అప్పు తీసుకుని గురుదక్షణ సమర్పించానని ఒక మీడియా ప్రతినిధికి వివరించారు.

ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ..మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
 
@ అండర్ వరల్డ్‌తో మమతకు సంబంధాలు ఉన్నాయని పలు మీడియా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా విక్కీ గోస్వామి ని పెళ్లాడినట్టు రూమర్లు ఉన్నాయి. అయితే  మమతా మాత్రం తాను అతనిని పెళ్లి చేసుకోలేదని చెబుతోంది.

@ CNN-News18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా విక్కీ గోస్వామితో తన సంబంధం గురించి చెబుతూ, అతను తన భర్త కాదని చెప్పింది. తాను ఇంకా అవివాహితురాలిని కూడా ఆమె స్పష్టం చేసింది.

@ 1997 లో విక్కీ 11.5 టన్నుల మాండ్రాక్స్ అక్రమ రవాణా చేసినందుకు దుబాయ్‌లో అరెస్టయ్యాడు.. దుబాయ్ చట్టాల ప్రకారం 25 సంవత్సరాల జీవిత ఖైదు విధించారు. జైలులో సత్ప్రవర్తనకు గాను పదేళ్లు శిక్ష తగ్గించారు. ఆ సమయంలో మమతా కులకర్ణి  జైలు కెళ్ళి తరచుగా అతన్నికలిసే వారట.

@ 2016లో అక్రమ మెథాంఫెటమైన్ ఉత్పత్తికి ఎఫెడ్రిన్ సరఫరా చేసిన వ్యక్తులలో ఒకరిగా థానే పోలీసులు మమతను కేసులో ప్రస్తావించారు. ఈ డ్రగ్స్ విలువ రూ.2000 కోట్లు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్, గ్యాంగ్ స్టర్ అక్రమ రవాణా ఆపరేషన్ కోసం వీటిని తయారు చేశారట. 

 @ జనవరి 2016లో మమత,ఆమె భాగస్వామి విక్కీ గోస్వామి, ఇతర సహ నిందితులతో కలిసి కెన్యాలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు సంబంధించిన సమావేశానికి హాజరైనట్లు పోలీసులు కూపీ లాగారు.

@ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో వచ్చిన నివేదికల ప్రకారం, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కెన్యాలో మమతా కులకర్ణిని,ఆమె భర్తతో పాటు అరెస్టు చేశారని ‘ఇండియా టుడే’ రాసుకొచ్చింది. 

@ కొంతకాలం దుబాయ్‌లో అజ్ఞాత జీవితం గడిపిన తర్వాత ఇస్లాం మతంలోకి మారి నైరోబీకి మారారు. విక్కీ గోస్వామి కూడా మతం మార్చుకుని ఆమెను పెళ్లి చేసుకున్నారని అంటారు.  విక్కీ గోస్వామి జైలులో ఉండగా అతని వ్యాపార కార్యకలాపాలను మమతాయే  చూసేవారట. ఆమె దుబాయ్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాన్ని కూడా నిర్వహించిందని సమాచారం.

@ మమత నెరిసిన జుట్టు తో , కళ్లద్దాలు ధరించి జైలుకు వెళ్ళినపుడు దుబాయ్‌కి చెందిన ఒక వార్తాపత్రిక గుర్తించింది. మమత గోస్వామితో కలిసి దుబాయ్‌కి వెళ్లినట్లు గతంలో వార్తలు వచ్చాయి. 

@ విక్కీగోస్వామి పై ఆఫ్రికన్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.  ప్రముఖ సౌత్-ఆఫ్రికన్ దినపత్రిక ‘మెయిల్ & గార్డియన్‌’ సమాచారం మేరకు విక్కీ మొదటిసారిగా 1994లో దక్షిణాఫ్రికాకు వచ్చి, మనీలాండరింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వివిధ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులలో కూడా ఉన్నాడట.  
——-
విలాసవంతమైన జీవితం గడుపుతూ అకస్మాత్తుగా ఇండియా కొచ్చి మమతా సన్యాసం ఎందుకు తీసుకున్నారు ? అసలు మోటివ్ ఏమిటి ? అనేది సస్పెన్స్ ..  ఎందుకు  సాధువుల చెంతకు వెళ్లారు ? జీవితం పై విరక్తి కలిగిందా ?  గోస్వామి ఎక్కడున్నాడు ? ఇద్దరూ కలసి లేరా ? వంటి సందేహాలు రావచ్చు. కొన్ని అరెస్ట్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. పోలీసులు ఆమె రాకను గమనించారా ? ఏం చేయబోతున్నారు ? వంటి ప్రశ్నలకు  కాలమే జవాబు చెప్పాలి. 

 –KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!