అలరించే యాక్షన్+సెంటిమెంట్+ఎమోషనల్ డ్రామా !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………..

సూపర్ స్టార్ కృష్ణ-కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. 1980 ఏప్రిల్లో విడుదలయిన ఈ ‘మామా అల్లుళ్ళ సవాల్’ సూపర్ హిట్ సినిమా.12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.లాగించిన సినిమా కాదు.ఆడిన సినిమా.ముందుగా మెచ్చుకోవలసింది కధ స్క్రీన్ ప్లేని అందించిన యం డి సుందరాన్ని.

ఇద్దరు ప్రాణ స్నేహితులు . ఒకరు ధనవంతుడు , మరొకరు పేదవాడు . కాలేజీలో క్లాస్ మేట్స్ చేసిన ఓ కామెంటుతో పేద స్నేహితుడు ధనవంతుడైన స్నేహితుడిని వదిలి వెళ్ళిపోతాడు . తర్వాత కాలంలో ధనవంతుడు లాయర్ అవుతాడు. బావ కూతురిని పెళ్ళి చేసుకుంటాడు. 

పేద స్నేహితుడు చనిపోతాడు. అతని తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాడు. అతను ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. అతన్ని కాపాడాటానికి లాయర్ హీరో నడుం బిగిస్తాడు. ఆ కేసుని హేండిల్ చేసేది హీరో బావ కం మామ పోలీసు ఆఫీసర్ సత్యనారాయణ. ఇద్దరూ పంతంగా తీసుకొని సవాళ్లు విసురుకుంటారు. చివరకు హీరో లాయర్ తన మిత్రుడి తమ్ముడిని కాపాడటంతో సినిమా ముగుస్తుంది. 

రొటీన్ కధగా కాకుండా డిఫరెంట్ కధ. జంధ్యాల సంభాషణలు కథకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా మామా అల్లుళ్ళ మధ్య సవాళ్ళ డైలాగులు బాణాల్లాగా ఉంటాయి .వాళ్ళిద్దరివే కాదు. అందరి డైలాగులు చాలా పదునుగా ఉంటాయి. డైలాగులు సినిమాలో డ్రామాని బాగా మెయింటైన్ చేస్తాయి. 

వీటికి తోడు చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు. సినిమా ప్రారంభమే వేటూరి వ్రాసిన ఒక మంచి పాటతో ప్రారంభమవుతుంది. స్నేహితులు కృష్ణ ,రంగనాధులు మోటార్ సైకిళ్ళ మీద షికారు కొడుతూ పాడే పాట.

‘ఒక నాటిది కాదు వసంతం విడిపోనిది మా అనుబంధం’ పాట చిత్రీకరణ బాగుంటుంది. బాలసుబ్రమణ్యం,ఆనందులు పాడారు. శ్రీదేవి బ్రాండ్ మార్క్ వానపాట కూడా ఉందండోయ్. దీన్నీ వేటూరి మాస్టారు వ్రాసారు. చిటుక్కు చిటుక్కు చిలికింది వాన అంటూ సాగుతుంది ఆపాట. 

వీటూరి వ్రాసిన బర్త్ డే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ‘మంచితనానికి మాయని మమతకు పుట్టినరోజు ఇది’ . అలాగే ఆయనే వ్రాసిన మరో పాట ‘శ్రీదేవి వంటి చిట్టితల్లికి సీమంతం చేయరండి’ అని శ్రీదేవి మీదే ఉంటుంది. చాలా బాగుంటుంది . వీటూరిదే మరో పాట ‘చక్కనమ్మ వచ్చింది ఒక్క నవ్వు నవ్వింది ‘ బాగుంటుంది. 

ఈ సినిమాలో రమాప్రభకు కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలి అనుకునే పిచ్చి . ఆమెకు ,తండ్రి అల్లుకు ఓ పాట ఉంది. సరదాగా సాగుతుంది. ‘చక్కనైన మా కృష్ణయ్యని ఎక్కడైనా చూసారా’ అనే పాట అది . ‘ఓ మండపేట మైనరు హేయ్ పిండి మిల్లు ఓనరూ’ జయమాలిని పాట అభిమానులను అలరిస్తుంది.1980 లో జయమాలిని కాస్త ఒళ్ళు చేసినట్లుగా కనబడుతుంది.  అయినా డాన్సు స్పీడులో ఏం తేడా ఉండదు .

30+ సినిమాలు కలిసి పనిచేసారు కృష్ణ-కె యస్ ఆర్ దాసులు . ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్సే . ఈ సినిమా క్లైమాక్స్ దాస్ మార్కులోనే ఉంటుంది.ఈ సినిమా విజయానికి ఆయన దర్శకత్వం కూడా ముఖ్య కారణమే . యాక్షన్+సెంటిమెంట్+ఎమోషన్+డ్రామా వెరశి ఈ సినిమా . అతిలోకసుందరి శ్రీదేవి గ్లామర్ ఉండనే ఉంది.  ప్రత్యేకంగా అభినందించాల్సింది హీరో కృష్ణని ఆయన చాలా బాగా నటించారు. సూపర్ స్టార్ శ్రీదేవి కాంబో లో ఇది మరో హిట్ మూవీ. 

ఇతర నటీనటులు అందరూ కూడా ఎవరికి వారు బాగా నటించారు. సత్యనారాయణ,జమున , నిర్మలమ్మలను ముందుగా చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్లను చాలా బాగా పండించారు. అల్లు,  రంగనాధ్ , చంద్రమోహన్, సారధి , ప్రభాకరరెడ్డి , సిలోన్ మనోహర్, రమాప్రభ,అత్తిలి లక్ష్మి ప్రభృతులు నటించారు. అన్నట్టు ఈ సినిమా నిర్మాణంలో నటుడు సత్యనారాయణ కూడా భాగస్వామి. 

కృష్ణ , శ్రీదేవి , సత్యనారాయణ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . A watchable , emotion-filled sentimental , feel good , entertaining movie .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!